వేసవిలో శరీరానికి చెమట ఎక్కువగా పట్టడం సహజమే. అయితే కొందరికి మాత్రం ఈ చెమట వల్ల చర్మంపై బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది దుర్వాసనకు దారితీస్తుంది. ముఖ్యంగా హైపర్ హైడ్రోసిస్ సమస్య ఉన్నవారికి ఇది మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అటువంటి వారికోసం కొన్ని చిట్కాలు...
స్నానానికి యాంటీ బ్యాక్టీరియల్ సబ్బును వాడటం వల్ల చర్మంపై ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. అలాగే స్నానం చేసిన తర్వాత బాహుమూలలు, పాదాలు, చర్మం మడతలు ఉండే ప్రాంతాల్ని తడి లేకుండా పూర్తిగా తుడుచుకోవాలి.
గాలి ఆడేలా ఉండే కాటన్ బట్టల్ని ధరించాలి. ఇవిగాక యాంటీ–పెర్‌స్పిరెంట్స్, డియోడరెంట్స్ వాడటం వల్ల దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియాను చంపి, మంచి సువాసనను ఇస్తాయి.
వీటికన్నా ముఖ్యం ఏమిటంటే.. కారం ఎక్కువగా ఉండే పదార్థాలు, కెఫీన్, వెల్లుల్లి వంటి ఘాటైన వాసన వచ్చే ఆహార పదార్థాల్ని తగ్గించాలి.
తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం సహజమైన సమతుల్యతను కలిగి ఉంటుంది. అలాగే తగినంత నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అలాగే చెమట గాఢత తగ్గి, దుర్వాసన తక్కువగా వస్తుంది.


