పరిశోధనా రంగంలో నకీలల కలకలం | A Stir Over Fakes in the Field of Research | Sakshi
Sakshi News home page

పరిశోధనా రంగంలో నకీలల కలకలం

May 24 2026 12:11 PM | Updated on May 24 2026 12:17 PM

A Stir Over Fakes in the Field of Research

శాస్త్ర రంగంలో వాస్తవ పరిశోధనల కంటే నకిలీల ప్రాబల్యం పెరిగిపోతుండటం పట్ల అంతర్జాతీయ పరిశోధక సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. శాస్త్ర విజ్ఞాన రంగానికి సంబంధించి నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల వెల్లడించిన దిగ్భ్రాంతికరమైన విషయాలు యావత్‌ సైన్స్‌ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేశాయి.

‘అమ్ముడుబోతున్న’ జర్నల్స్‌!
ఎటువంటి క్షేత్రస్థాయి పరిశోధనలు లేదా ప్రయోగాలు లేకుండానే, ధనార్జనే ధ్యేయంగా కొన్ని ముఠాలు నకిలీ అధ్యయన పత్రాలను విక్రయిస్తున్నాయి. అంతకంటే ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, శాస్త్రీయ ప్రమాణాలను పాటించాల్సిన కొన్ని గుర్తింపు పొందిన జర్నల్స్‌ (సైన్స్‌ పత్రికలు) సైతం ఈ ముఠాలతో చేతులు కలపటం! భారీ మొత్తంలో డబ్బు, ఇతర ప్రయోజనాల కోసం ఆ పత్రికలు నాణ్యత లేని, అశాస్త్రీయమైన సమాచారాన్ని ప్రచురిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనా రంగం విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి!

నెట్‌వర్క్‌గా సాగుతోంది
నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ నిర్వహించిన లోతైన సత్యాన్వేషణలో భాగంగా, లక్షలాది పాత రికార్డులను తనిఖీ చేసినప్పుడు ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మధ్యవర్తులు, నకిలీ పరిశోధకులు ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి, పరిశోధనా పత్రాలను విక్రయిస్తున్నట్లు బయటపడింది. దీంతో, నికార్సైన పరిశోధనా పత్రాన్ని కూడా అది నిజమైనదా కదా అని సూక్ష్మంగా పరిశీలించాల్సిన అగత్యం ఏర్పడింది.

అబద్దపు నివేదికలు, ప్రసంశలు
ప్రచురణల రంగంలోని పెద్దల బలహీనతలను ఆసరాగా చేసుకుని, కొన్ని ముఠాలు ప్రధానంగా మూడు రూపాల్లో మోసానికి పాల్పడుతున్నట్లు నార్త్‌వెస్టర్న్‌ బృందం గుర్తించింది ఆ మూడూ : ఎటువంటి ప్రయోగాత్మక ఆధారాలు లేకుండానే, కేవలం ఊహాజనిత లెక్కలతో అబద్ధపు నివేదికలను కల్పిత డేటాతో సిద్ధం చేయడం;  నిర్ణీత రుసుము చెల్లిస్తే చాలు, ఎవరి పేరునైనా సరే ‘ప్రధాన పరిశోధకుడి’ (ఫస్ట్‌ ఆథర్‌) గా నివేదికలో చేర్చటం; ఆ తప్పుడు పరిశోధనకు ప్రాధాన్యం కల్పించేందుకు కొన్ని పత్రికల్లో రివ్యూలు రాయించటం, అలాగే ‘గ్రంథ రచయిత’లుగా కొందరికి ప్రశంసాపత్రాలు అందచెయ్యటం! ‘‘ఈ ధోరణి పట్ల మనం ఉదాసీనంగా ఉండిపోతే, సైన్స్‌ ప్రామాణికతే ప్రశ్నార్థకంగా మారుతుంది’’ అని ప్రొఫెసర్‌ అమరల్‌ కలవరపడుతున్నారు. అమరల్‌ నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీకి చెందిన సోషల్‌ సిస్టమ్స్, ఇంజనీరింగ్‌ సైన్సెస్‌ నిపుణుడు. ఆయన తన సహ పరిశోధకుడు రీస్‌ రిచర్డ్‌సన్‌తో కలిసి కూపీ లాగినప్పుడు ఈ నకిలీ పరిశోధనల పత్రాల గుట్టలు బయటపడ్డాయి. వాటిపై వీరిచ్చిన సంచలన నివేదిక ప్రతిష్టాత్మకమైన పి.ఎన్‌.ఎ.ఎస్‌. (ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌) జర్నల్‌లో రావటంతో అంతర్జాతీయంగా నకిలీ పరిశోధనా పత్రాలపై చర్చ మొదలైంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌’ మద్దతు కూడా వీరికి లభించింది. 

తవ్వి తీశారు
అమరల్‌ పరిశోధక బృందం కేవలం ప్రాథమిక పరిశీలనకే పరిమితం కాలేదు. అంతర్జాతీయ స్థాయిలోని అతి పెద్ద డేటాబేస్‌లను క్షుణ్ణంగా పరిశీలించి, ఈ అక్రమాలను వెలికి తీసింది. ఇందుకోసం వారు ‘వెబ్‌ ఆఫ్‌ సైన్స్‌’, ‘స్కోపస్‌’, ‘పబ్‌మెడ్‌’ వంటి పేరున్న డేటాబేస్‌ల నుండి లక్షలాది రికార్డులను సేకరించి తూర్పార పట్టారు. ఒకే రకం చిత్రాలను లేదా ఒకే రకం డేటాను వేర్వేరు పరిశోధనా పత్రాల్లో మళ్లీ మళ్లీ వాడటం వంటి మేధోచౌర్యాన్ని గుర్తించారు. నాణ్యత ప్రమాణాలు పాటించనందున డేటాబేస్‌ల నుండి తొలగింపునకు గురైన జర్నల్స్‌ జాబితాను నిశితంగా చెరిగి, వాటిలో వచ్చిన పరిశోధనా పత్రాల వెనుక ఉన్న ఉమ్మడి నెట్‌వర్క్‌లను వెలికితీశారు. ‘రిట్రాక్షన్‌ వాచ్‌’, ‘పబ్‌పీర్‌’ వంటి వాచ్‌డాగ్‌ ప్లాట్‌ఫామ్‌లలోని చర్చలను, ఎడిటర్ల నేపథ్యాలను, పరిశోధనా పత్రాల సమర్పణ తేదీలను బేరీజు వేసుకున్నారు. ఇంత నిశితంగా తవ్వుకుంటూ వెళ్లాక మాత్రమే, అశాస్త్రీయ పద్ధతుల్లో పత్రాలను ప్రచురిస్తున్న ముఠాల ఉనికిని తెలుసుకోగలిగారు.

ఎంత డబ్బుకు అంత హోదా!
శాస్త్ర పరిశోధన అనేది నిరంతర శ్రమతో కూడిన విషయం. అయితే, ఈ నేరపూరిత పగడ్బందీ నెట్‌వర్క్‌లు శ్రమ లేకుండా డబ్బు సంపాదించటం కోసం నకిలీ పరిశోధనా పత్రాలను సృష్టిస్తున్నాయి. ఈ పత్రాల్లో నిజాలు ఉండవు, వీటిలోని సమాచారానికి పొంతనలు కుదరవు. ఇదంతా కూడా మనీ లాండరింగ్‌లా సాగుతుంది. భారీ మొత్తంలో నిధులు చెల్లించే వారికి పరిశోధనతో సంబంధం లేకపోయినా ‘ప్రధాన రచయిత’ హోదాను కల్పిస్తారు. ఇచ్చే డబ్బును బట్టి రచయితల జాబితాలో నాలుగో స్థానం లేదా ఐదో స్థానం కేటాయిస్తారు.  ఈ అశాస్త్రీయ పత్రాలపై ఎటువంటి సమీక్ష లేదా అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు, జర్నల్స్‌ యాజమాన్యాలకు కూడా భారీగా ముడుపులు అందిస్తున్నట్లు అమరల్‌ టీమ్‌ పసిగట్టింది.

నివారించటం ఎలా?!
ఈ వ్యవస్థీకృత ‘ఫేక్‌ రీసెర్చ్‌’ వైరస్‌ను అడ్డుకోవడానికి అమరల్, రిచర్డ్‌సన్‌ల బృందం అత్యంత కీలకమైన, ఆచరణాత్మక పరిష్కారాలను సూచిస్తోంది. అవి: పరిశోధన పత్రాలపై సంపాదకీయ పర్యవేక్షణ ఉండాలి. జర్నల్న్‌ పనితీరుపై నిరంతర నిఘా పెట్టాలి. ఎడిటర్లు అనుసరిస్తున్న సమీక్షా పద్ధతులు పారదర్శకంగా ఉన్నాయా లేదా అని నిశితంగా గమనించాలి. అనైతిక పద్ధతులకు పాల్పడే ఎడిటర్లను గుర్తించి, జర్నల్స్‌ విశ్వసనీయతను కాపాడాలి. అలాగే, కృత్రిమ మేధ, డేటా ఎనలిటిక్స్‌ ఆధారంగా సరికొత్త టూల్స్‌ను అభివృద్ధి చేయాలి. అబద్ధపు సమాచారాన్ని, మే«ధా      చౌర్యాన్ని, కల్పిత డేటాను ప్రాథమిక దశలోనే గుర్తించగల సాంకేతికతను పబ్లిషింగ్‌ హౌస్‌లు తప్పనిసరిగా వాడాలి.

ఏఐతో మరింత ముప్పు!
శాస్త్ర పరిశోధనా రంగంలోప్రస్తుతం జరుగుతున్న ఈ మోసాలకు తోడు, ‘జనరేటివ్‌ ఏఐ’ ప్రవేశం కూడా పరిశోధనా రంగాన్ని మరింత ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టివేసే ప్రమాదం ఉందని పరిశోధకుడు రిచర్డ్‌సన్‌ హెచ్చరించారు. అదెలా అంటే, ఏఐ సాయంతో అతి తక్కువ సమయంలో వేల సంఖ్యలో నకిలీ పరిశోధనా పత్రాలను సృష్టించే అవకాశం ఉంది. దీనివల్ల వాస్తవ పరిశోధనలు ఈ కృత్రిమ సమాచార ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇక నకిలీ పరిశోధనా పత్రాలలోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని భవిష్యత్తు ఏఐ మోడల్స్‌ శిక్షణ పొందితే, అవి మరింత తప్పుడు సమాచారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ఒక విషవలయంలా మారి, వాస్తవానికి, కల్పితానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూర్తిగా చెరిపివేస్తుంది. ఈ పరిణామం వల్ల అంతిమంగా శాస్త్రీయ విజ్ఞానం ప్రామాణికత దెబ్బతింటుంది. 

అబద్ధపు పునాదుల మీద నిర్మితమయ్యే మేధో సంపత్తి మానవాళికి ఎటువంటి ఉపయోగం లేకపోగా, తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ‘‘శాస్త్ర విజ్ఞానం మానవజాతి మనుగడకు అత్యంత కీలకం అని మనం విశ్వసిస్తే, దాని పవిత్రతను కాపాడటానికి ఈ అనైతిక శక్తులపై పోరాడక తప్పదు’’ అని అమరల్‌ తాజాగా పిలుపునిచ్చారు. శాస్త్ర విజ్ఞాన రంగంలో నైతికతను పునరుద్ధరించడమే నేటి తక్షణ కర్తవ్యం అని ఆయన అంటున్నారు. నిజమే. సత్యాన్వేషణే లక్ష్యంగా సాగే సైన్స్‌ రంగం, ఈ నకిలీ ప్రభావం నుండి బయటపడి తన పూర్వ వైభవాన్ని, విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన చారిత్రక అగత్యం నేడు ఏర్పడింది!
∙ సాక్షి స్పెషల్‌ డెస్క్‌

మేధా దోపిడీకి పరాకాష్ఠ
నకిలీ పరిశోధనా రంగంలోని ముఠాలు అనుసరిస్తున్న వ్యూహాలు, మాయోపాయాలను ప్రొఫెసర్‌ అమరల్‌ బృందం శాస్త్రీయంగా విశ్లేషించింది. దాని ప్రకారం, ఈ నెట్‌వర్క్‌లు ఒకే పరిశోధనా పత్రాన్ని ఏకకాలంలో పలు జర్నల్స్‌లో వచ్చేలా చేసి, త్వరగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తాయి. ఒకవేళ భవిష్యత్తులో ఆ పత్రం నకిలీదని తేలి,  తొలగింపునకు గురైనప్పటికీ అప్పటికే వారు పొందాల్సిన లబ్ధిని వారు పొంది ఉంటారు. అలాగే ప్రచురణ నిలిచిపోయిన పాత పత్రికల వెబ్‌సైట్‌ డొమైన్‌లను ఈ ముఠాలు కొనుగోలు చేస్తాయి. ఉదాహరణకు, బ్రిటన్‌కు చెందిన ‘హెచ్‌.ఐ.వి. నర్సింగ్‌’ జర్నల్‌ మూత పడగానే దానిని కొని, దాని పేరును వాడుకుంటూ నర్సింగ్‌ రంగానికి ఏమాత్రం సంబంధంలేని వేలాది అశాస్త్రీయ పత్రాలను వారు ప్రచురించారు. మేధా దోపిడీకి ఇది పరాకాష్ఠ. ఇవి కాక, రచయితలకు, జర్నల్‌ ఎడిటర్లకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ; పరిశోధనా పత్రాల ప్రచురణకు ‘ప్యాకేజీ’ ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పరిశోధనా పత్రం తయారీ నుండి ప్రచురణ వరకు కొనసాగుతున్న ఈ పకడ్బందీ కుంభకోణంపై అమరల్‌ బృందం అంతర్జాతీయ సమాజానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. శాస్త్ర రంగంలో తగిన భద్రతా ప్రమాణాలు, పారదర్శకతను పెంచకపోతే, భవిష్యత్తులో మేధో ప్రపంచం ఈ మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

ఆటోమేటిక్‌ స్కానింగ్‌ సిస్టమ్‌
నకిలీ పరిశోధనల వ్యవస్థ జాడలను ఛేదించేందుకు ప్రొఫెసర్‌ అమరల్‌ బృందం ఒక అధునాతన ‘ఆటోమేటిక్‌ స్కానింగ్‌ సిస్టమ్‌’ను అభివృద్ధి చేసింది. ఈ సాంకేతిక విధానం ప్రధానంగా మెటీరియల్‌ సైన్సెస్, ఇంజినీరింగ్‌ రంగాల్లోని పరిశోధనా పత్రాలను నిశితంగా విశ్లేషిస్తుంది. చాలామంది నకిలీ పరిశోధకులు పరిశోధన కోసం తాము అత్యాధునిక పరికరాలను ఉపయోగించినట్లు పత్రాల్లో పేర్కొంటారు. అయితే, వారు పేర్కొన్న పరికరాల సామర్థ్యానికి, వారు చూపిన ఫలితాలకు మధ్య ఎటువంటి శాస్త్రీయ సంబంధమూ ఉండదు. దానిని ఈ ‘ఆటోమేటిక్‌ స్కానింగ్‌ సిస్టమ్‌’ సాఫ్ట్‌వేర్‌ తక్షణమే గుర్తిస్తుంది. అలాగే  క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రయోగాలు చేయకుండానే, కేవలం ఊహాజనిత పరికరాల పేర్లతో పేపర్లు సృష్టించే వారిని ఈ వ్యవస్థ సమర్థవంతంగా గుర్తించి, అడ్డుకుంటుంది. ఈ వినూత్న పరిష్కారాన్ని ప్రతిష్ఠాత్మకమైన ‘ప్లాస్‌ వన్‌’  జర్నల్‌ ప్రశంసించింది. శాస్త్రీయ పరిశోధనల నాణ్యతను కాపాడటంలో కీలక ముందడుగుగా దీనిని అభివర్ణించింది.

Advertisement
 
Advertisement
Advertisement