Sriti Shaw : మల్టీ టాలెంట్.. శృతిలయల విజయ దరహాసం

‘రెండు పడవల మీద ప్రయాణం’ కష్టం అంటారు. రెండు పడవలేం ఖర్మ...ఎన్ని పడవలైనా కొందరు సునాయసంగా ప్రయాణించగలరు. శృతి షా ఈ కోవకు చెందిన ప్రతిభావంతురాలు. దుబాయ్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్న ఇరవై అయిదు సంవత్సరాల షా నటి,మోడల్‌గా రాణిస్తుంది.
‘టిస్కా మిస్ ఇండియా 2021’ టైటిల్‌ను గెలుచుకుంది. సంగీతంలో కూడా తన ప్రతిభ చాటుకుంటుంది. రకరకాల మ్యూజిక్ ఆల్బమ్‌లకు రూపకల్పన చేసింది.
శృతి ప్రొడ్యూసర్ కూడా. మరోవైపు సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ‘టైం లేదు అని సాకు వెదుక్కుంటే చిన్న పని కూడా చేయలేం’ అంటున్న శృతి షాకు ఎప్పటికప్పడు కొత్త విద్యలు నేర్చుకోవడం అంటే ఇష్టం.
కోల్‌కతాలో పుట్టిపెరిగిన శృతి చిన్నప్పుడు స్కూల్లో ఒక నాటకంలో వేషం వేసింది. ఎన్నో ప్రశంసలు లభించాయి. నటన మీద తనకు మక్కువ అలా మొదలైంది. అయితే నటప్రస్థానంలో భాగంగా తెలుసుకున్న విషయం ఏమిటంటే...‘మన నటనకు ఎప్పుడూ ప్రశంసలు మాత్రమే రావు. విమర్శలు కూడా వస్తాయి. ప్రశంసల వల్ల ఉత్సాహాన్ని పొందినట్లే, విమర్శల నుంచి గుణపాఠాలు తీసుకోవాలి’ అనే స్పృహ ఆమెలో వచ్చింది.
‘నిన్ను నువ్వు బలంగా నమ్ము’ అనేది శృతి షా విజయసూత్రాలలో ఒకటి. ఎందుకంటే నీ గురించి నీకు తప్ప మరెవరికి తెలియదు. ‘చేసిన తప్పును మళ్లీ చేయకు’ అనేది ఆమె ఎప్పుడూ గుర్తుంచుకునే పాఠం. ‘ప్రతి వ్యక్తి ఒక బడి. అందులో నుంచి మనకు కావాల్సింది నేర్చుకోవచ్చు’ అనేది ఆమె విశ్వాసం.
మరిన్ని వార్తలు