Mamta Sharma Das: హాయ్‌.. నేను మమత

Special Story About Kolkata top influencer Mamta Sharma Das - Sakshi

ఇన్‌ఫ్లుయెన్సర్‌

నెట్‌లో స్టార్‌ అవడానికి ఆడిషన్‌లు అక్కర్లేదు. ఏ ఇండస్ట్రీతోనూ కుటుంబ బంధాలు అవసరం లేదు. స్క్రీన్‌పై ఒకసారి కనిపిస్తే రెండోసారి చూడాలనిపించేలా వస్త్రధారణ, ‘హాయ్‌..’ అంటూ మొదలు పెట్టగానే మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చక్కటి పలు వరసలాంటి మాట వరస ఉంటే చాలు అంటున్నారు మమత. అమ్మాయిలకైతే ఈ విద్య మరీ తేలికట! ట్రై చేయమని అంటున్నారు. తర్ఫీదు అవసరం లేదంటున్నారు.

అదృష్టాన్ని నిర్మించుకోవడం అనే మాటను మీరు ఎప్పుడూ విని ఉండరు. అదృష్టం అంటే ‘కట్టుకోవడం’ కాదు. ‘కలిసిరావడం’. అయితే వైరుధ్యం చూడండి! మమతా శర్మ దాస్‌ కట్టుకున్న దుస్తులు ‘స్టెయిలిస్ట్‌’గా, పదిమందిని కలుపుకొని పోవడం ‘ఇన్‌ఫ్లుయెన్సర్‌’గా ఆమెకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. దీనర్థం ఆమె తన అదృష్టాన్ని తనే నిర్మించుకున్నారని! అమ్మాయిలకు తను చెప్పే మాట కూడా ఇదే. ‘‘గర్ల్స్‌.. మంత్రముగ్ధుల్ని చేసే వస్త్రధారణ, మనసుకు హత్తుకునే మాట తీరు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే ప్రపంచం మిమ్మల్ని చూసి, మీ మాట విని మీకు ఇన్‌ఫ్లుయెన్స్‌ అవుతుంది. అప్పుడు మిమ్మల్ని మించిన ‘ఇన్‌ఫ్లుయెన్సర్‌’ ఎవరూ ఉండరు’’ అంటారు మమత.  
∙∙
యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఇంకా.. నెట్‌లోని అనేక వేదికల మీద మనకు కబుర్లు చెప్పి, మనసు దోచే వాళ్లంతా ఇన్‌ఫ్లుయెన్సర్‌లే. అయితే అదేమీ నేర్చుకోవలసినంత పెద్ద ఆర్ట్‌ కాదని మమత అంటున్నారు. సహజంగానే ప్రతి అమ్మాయిలోనూ ఉండే కళేనట అది! మమత ఇన్‌ఫ్లుయెన్సర్, స్టెయిలిస్ట్, బ్రాండింగ్‌ కన్సల్టెంట్‌ కూడా! ఒక బ్రాండ్‌ను అమ్మిపెట్టడానికి కంపెనీలకు సలహా ఇవ్వడం ఇది. ‘వీవ లా వీదా’ అనే ఒక సొంత ఫ్యాషన్‌ సామ్రాజ్యానికి ఆమె మహరాణి కూడా. వీవ లా వీదా అంటే ‘జీవితం వర్థిల్లాలి’ అని. జీవితాన్ని ఏ కళతోనైనా వర్థిల్లేలా చేసుకోవచ్చు.

అది మన వరకు. బయట కొన్ని వందల, వేల, లక్షల జీవితాలను వర్థిల్లేలా చేసే కళ మాత్రం ఇన్‌ఫ్లుయెన్సింగ్‌. మమతకు ఏడేళ్ల కూతురు ఉంది. రోజంతా ఇద్దరి మధ్య మాటలే మాటలు. ఆ కూతురు ఈ తల్లిని ఇన్‌ఫ్లుయెన్స్‌ చేస్తుందట! ‘‘దీన్ని బట్టి మీకేమి అర్థమౌతోంది? వయసు సంబంధం లేకుండా ఎవరైనా ఎవర్నైనా ఇన్‌ఫ్లుయెన్స్‌ చెయ్యొచ్చు’’ అని నవ్వేస్తారు మమత. ఆమేమీ కెరియర్‌ని ప్లాన్‌ చేసుకుని ఈ దారిలోకి రాలేదు. కొంత జీవితాన్నైతే చూశారు. బహుశా ఆ చూడటం ఆమెను ఇటువైపు తిప్పిందేమో.. మనుషులతో ఏదైనా షేర్‌ చేసుకోవాలని, వాళ్లకు సంతోషం కలిగించాలని, వాళ్ల బాధను తొలగించాలనీ! ఎందుకు అలా అనిపించింది?
∙∙
మమత కోల్‌కతాలో పుట్టారు. కుటుంబ పరిస్థితులతో, సమాజంతో, చివరికి తనతో తను ఘర్షణ పడుతూ పెరిగారు. తల్లిదండ్రులది మతాంతర వివాహం. తల్లి, తండ్రి, తమ్ముడు, తను! తల్లీదండ్రి బాగానే ఉండేవారు. బయట ఎవరన్నా ఒక మాట అంటే అది వినొచ్చి ఒకరితో ఒకరు ఘర్షణ పడేవారు. ఆ ఘర్షణ మమతకు బాగుండేది కాదు. అమ్మానాన్న ఉన్న అనాథను అని చాలాసార్లు అనుకునేది. తమ్ముడికి, తనకు వయసులో పదేళ్ల వ్యత్యాసం. వాడు పసితనంలో ఉండగానే తండ్రి చనిపోయాడు. తల్లి ఒక్కటే చిన్న ఉద్యోగం చేస్తూ ఇద్దర్నీ పెంచింది. మాటలు వస్తున్నప్పుడు తమ్ముడు మొదట తనను ‘మా’ అని పిలిచాడట. తర్వాత ఆ పిలుపు అలాగే కొనసాగింది. బంధాలు వరసల్ని బట్టి కాకుండా దగ్గరితనాన్ని బట్టి ఏర్పడతాయి అంటారు మమత. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మనం ప్రపంచంతో ఆ దగ్గరతనాన్ని పెంచుకోవాలి అని చెబుతారు.

34 ఏళ్ల మమతకు చిన్న వయసులోనే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పెద్ద పేరు వచ్చింది. నెటిజెన్స్‌కి ఆమెపై గురి కుదరడం అందుకు కారణం. ఒక బ్రాండ్‌కి కన్సల్టెంట్‌గా ఉన్నప్పుడు సాధారణంగా కంపెనీ దృష్టినుంచే ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మమత తన ఫాలోవర్స్‌ వైపు నుంచి బ్రాండ్‌ని ఎనలైజ్‌ చేస్తారు. కస్టమర్‌ ఫ్రెండ్లీ. కంపెనీకి ఆమె కావాలి. ఆమెకు కస్టమర్‌లు కావాలి. ఆ కావాలి అనుకోవడమే మమతను స్టార్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను చేసింది. ‘‘ఉల్లాసం, ఉత్సాహం, నేర్చుకోవాలన్న తపన, నేర్పాలన్న అభిలాష ఉంటే చాలు. మీరు నెట్‌ సెలబ్రిటీ అయిపోయినట్లే’’ అంటారు మమత.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top