బ్యూటిఫుల్‌ సక్సెస్‌ మంత్ర

Special Educator Sangeetha Rajesh Success Secret Special Story - Sakshi

సక్సెస్‌ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఎందుకంటే అది ఆనందాన్నిస్తుంది కాబట్టి. ఆనందాలు మళ్లీ మళ్లీ కావాలి... కొత్త కొత్త రూపాల్లో రావాలి... ఇదీ సంగీతారాజేశ్‌ ఆకాంక్ష. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో నిస్వార్థసేవ. ఫ్యాషన్‌ ఇండస్ట్రీకి కొత్త నడక. బ్యూటీ ఇండస్ట్రీ అధ్యయనం. మహిళలకు మార్కెట్‌ పాఠాల బోధన. అన్నింటిలో రాణిస్తున్న... ఆమె ‘సక్సెస్‌ మంత్ర’ ఏమై ఉంటుంది?

ఓ ముప్పై– నలభై ఏళ్ల కిందట... ‘ఇది ఇంపోర్టెడ్‌ శారీ, మా అన్న సింగపూర్‌ నుంచి తెచ్చాడు’ అని ఒకరు హోదా ఒలకబోసేవారు. ‘నాది కూడా ఇంపోర్టెడే. ఫలానా నగరంలో స్మగుల్డ్‌ గూడ్స్‌ దొరుకుతాయి’ అని మరొకరు... మీకు నేనేమీ తీసిపోను అన్నంత ధీమాగా. అప్పట్లో ఇలా నడిచేవి సగటు మహిళల కబుర్లు. వాళ్లలో ఎవరికీ స్మగుల్డ్‌ గూడ్స్‌ కొనడం చట్టరీత్యా నేరమనే విషయం తెలియదు కూడా.

సింథటిక్‌ మోజుతోపాటు ఇలాంటి హోదాల ప్రదర్శనలో మన సంప్రదాయ వస్త్రాలు తెరమరుగయ్యాయి, క్రమంగా వస్త్రాల తయారీదారులు కనుమరుగవడం కూడా మొదలైంది. అలాంటి సమయంలో గ్లోబలైజేషన్‌ రూపంలో వచ్చింది ఓ పెనుమార్పు. మన చేనేతలకు విదేశాల్లో అందుతున్న గౌరవాలను స్వయంగా చూసిన మన మహిళలే మన సంప్రదాయ చేనేతలకు బ్రాండ్‌ అంబాసిడర్‌లయ్యారు. నిర్లిప్తంగా మిగిలిపోయిన చేనేత, హస్తకళాకారుల వైపు చూసింది భారతీయ ఫ్యాషన్‌ ఇండస్ట్రీ. అలాంటి సమయంలో పెన్‌ కలంకారీని పునరుద్ధరించడానికి స్వచ్ఛందంగా సేవ చేశారు సంగీతా రాజేశ్‌.

అంతకంటే ముందు ఆమె పిల్లల చదువు వారి మానసిల్లోసానికి, మే«ధావికాసానికి దోహదం చేయాలి తప్ప బడి అంటే భయపడేలాగ ఉండకూడదని స్పెషల్‌ కిడ్స్‌ కోసం ప్రత్యేకమైన కరిక్యులమ్‌ తయారు చేశారు. పిల్లల్లో మేధావికాసానికి మన తాతమ్మల నుంచి ఇంట్లో ఆడుకున్న బోర్డ్‌గేమ్స్‌ దోహదం చేస్తాయని ఆచరణ లో చూపించారామె. సోషల్‌ మీడియా లో లక్షలాది ఫాలోవర్లున్న ఇన్‌ఫ్లూయెన్సర్‌ కూడా. ఇప్పుడు తాజాగా ‘మనిషిని సమాజంలో ఆత్మవిశ్వాసం తో ముందుకు నడిపించే సాధనం అందంగా కనిపించడం కూడా’ అని మరో ప్రయోగానికి తెర తీశారు.

♦ స్పెషల్‌ పాఠాలు
‘‘నేను మధురైలో పుట్టాను, దిండిగల్‌లో పెరిగాను. హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబంలోని అబ్బాయితో పెళ్లయింది. అలా పాతికేళ్ల కిందట హైదరాబాద్‌కి వచ్చాను. నేను స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ని, స్పెషల్‌ చిల్డ్రన్‌కి స్పీచ్‌ థెరపీ, వాళ్లకు కాన్సెప్ట్‌ అర్థమయ్యేటట్లు టీచింగ్‌ మెటీరియల్, ప్రత్యేకమైన టీచింగ్‌ మెథడాలజీతో క్లాసులు చెప్పి, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ పరీక్షలు రాయించి మెయిన్‌ స్ట్రీమ్‌కి పంపించడం నా బ్రెయిన్‌ చైల్డ్‌ ప్రాజెక్ట్‌. అందులో బిజీగా ఉన్నప్పుడు కలంకారీ మీద ఆసక్తి కలిగింది.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో నిష్ణాతులు చేసే పెన్‌ కలంకారీ మీద అధ్యయనం చేశాను. వాళ్ల చేతిలో కళ ఉంది, నా దగ్గర సృజన ఉంది. ఆ రెండింటినీ కలుపుతూ కొత్త ప్యాటర్న్స్‌ తెచ్చాం. వాటి ఖరీదు ఎక్కువే. కానీ ఒక చీర అమ్మగలిగానంటే దానిని తయారు చేసిన కుటుంబం నెలంతా ఆకలి లేకుండా జీవించగలుగుతుంది. పెన్‌ కలంకారీని ఆధునిక ఫ్యాషన్‌ ప్రపంచంలోకి తీసుకురావడంలో సక్సెస్‌ అయ్యాను. వీవర్స్‌కి ప్రయోజనం కల్పించడంలో నా లక్ష్యం నెరవేరింది. ఆ తర్వాత చాలామంది ఇదే పంథాను అనుసరించారు.  
 
పెన్‌ కలంకారీ కళాకారుడికి సూచనలు ఇస్తూ...

♦ పంచడానికే జ్ఞానం!
నేను ప్రధానంగా టీచర్‌ని కావడంతో నాకు తెలిసిన, నేను తెలుసుకున్న విషయాలను నాలో దాచుకోలేను. జ్ఞానం ఉన్నది పలువురికి పంచడానికే అన్నట్లు ఉంటాను. వినడానికి నా ఎదురుగా ఎవరూ లేకపోతే ఫేస్‌బుక్‌లో చెబుతాను. అలా తొమ్మిదేళ్ల కిందటే నేను ఎఫ్‌బీ వేదికగా కాస్ట్యూమ్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చాను. కోవిడ్‌ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. నాకు అప్పటికే ఎనిమిది లక్షల ఫాలోవర్లున్నారు. ఆ టైమ్‌లో నాకు అసలైన చాలెంజ్‌ నా వ్యాపారాన్ని కొనసాగించడం కాదు, నా ఉద్యోగులకు జీతాలివ్వడం. రెండు వారాలు మినహా మిగతా కోవిడ్‌ సమయమంతా పని చేశాను. అప్పుడు షోరూమ్‌లు, మాల్స్‌లో జనం కనిపించలేదు, కానీ ఆన్‌లైన్‌లో చాలా ఎక్కువగా కొనుగోళ్లు చేశారు.

♦ అదే నా సక్సెస్‌ సూత్ర  
 నేను కోవిడ్‌ టైమ్‌లో సూరత్, జైపూర్‌కు వెళ్లి అక్కడి నుంచి లైవ్‌లో డిస్‌ప్లే చేశాను. గంటల్లోనే కొనుగోళ్లు జరిగాయి. స్టాక్‌ అక్కడి నుంచే నేరుగా డెలివరీ ఇచ్చేశాను. ఒక రవాణా ఖర్చు, ఒక స్టేట్‌ జీఎస్టీ తగ్గిపోతే ఎంత ఆదానో ఆలోచించండి. విదేశాలకు వెళ్లాల్సిన స్టాక్‌ ఆగింది, మార్కెట్‌ చేసి పెట్టమని అడిగిన వాళ్ల స్టాక్‌ను ఆన్‌లైన్‌లో అమ్మేశాను. దాంతో స్టాక్‌ కొనుగోలుకు డబ్బు పెట్టాల్సిన అవసరం రాలేదు.

అటు ఉత్పత్తిదారులు, నేను– నా ఉద్యోగులు, వినియోగదారులు... అందరికీ ప్రయోజనమే. అందుకే విన్‌ విన్‌ డీల్‌ ఎప్పుడూ సక్సెస్‌ అవుతుందని నమ్ముతాను. గృహిణులు కొంతమంది ఇంట్లోనే చిన్న స్థాయిలో దుస్తులు, ఇతర ఇంటికి అవసరమైన వస్తువుల వ్యాపారం చేస్తున్నారు. కానీ అదంతా అవ్యవస్థీకృతంగా ఉంది. అలాంటి హోమ్‌ సెల్లర్స్‌ను ఒక వేదిక మీదకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఔత్సాహిక మహిళలకు బోధన తరగతులలో పాఠాలు చెప్తున్నాను.

వ్యాపారం కోసం ఓ సొంత ఫోన్‌ నంబరు, బ్యాంకు అకౌంట్‌ నిర్వహణ, ఆన్‌లైన్‌ లావాదేవీలలో శిక్షణ, మార్కెట్‌ మెళకువలతోపాటు డెడ్‌స్టాక్‌ను ఎలా డీల్‌ చేసే సులువు కూడా నేర్పిస్తున్నాను. హోమ్‌ సెల్లర్స్‌ చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే... స్నేహితులు, బంధువులలో కస్టమర్లను వెతుక్కోవడం. ఆ పొరపాటు వల్ల స్నేహితులు, బంధువులు దూరమవుతారు తప్ప, లాంగ్‌ టర్మ్‌ కస్టమర్‌లను ఏర్పరుచుకోవడం సాధ్యం కాదు. ప్రొఫెషన్‌నీ, కుటుంబ బంధాలను కలపకూడదు’’ అని తాను నేర్చుకున్న, అనుసరించిన సక్సెస్‌ సూత్రను వివరించారు సంగీతారాజేశ్‌.

స్పెషల్‌ చాలెంజ్‌
ఫ్యాషన్‌ ఇండస్ట్రీని బాగా అధ్యయనం చేశాను, కాబట్టే బ్యూటీకి ఉన్న ఆదరణ, మేకోవర్‌ అవసరాన్ని కూడా తెలుసుకోగలిగాను. ఫ్యాషన్, బ్యూటీ... ఈ రెండూ ఒకదానితో ఒకటి కలగలిసి ఉంటాయి. అందం అనేది మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే సాధనం. మరి అలాంటప్పుడు అందాన్ని పెంచుకోవడానికి ఎన్నెన్నో అధునాతన సాధనాలు అందుబాటులోకి వచ్చిన నేటి తరుణంలో అందంగా కనిపించడం అనే ఆకాంక్షకు ఎవరైనా ఎందుకు దూరంగా ఉండాలి? నేను వయసులో ఉన్నప్పుడు ఫ్యాషన్‌ ఇండస్ట్రీతో పరుగులు పెట్టాను, రిటైర్‌మెంట్‌ లేకుండా ఒకచోట స్థిమితంగా ఉంటూ నిర్వహించుకోవడానికి ఇప్పుడు కొత్త కెరీర్‌లోకి అడుగుపెట్టాను. ఇందులో కూడా సక్సెస్‌ అయ్యి, మరో ఐదేళ్లలో కొత్త తరానికి పాఠాలు చెప్పే స్థాయికి చేరుతాను. నేను కెరీర్‌ రోల్స్‌ ఎన్ని మార్చినా స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ రోల్‌లో కొనసాగుతూనే ఉంటాను.
– సంగీతారాజేశ్, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌

– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: మోహనాచారి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top