ఆడపిల్లలను దూసుకెళ్లమనే స్కేటర్‌ గర్ల్‌

Skater Girl released on netflix in june 11 - Sakshi

వెబ్‌ఫ్లిక్స్‌

స్కేటింగ్‌ బోర్డ్‌ ఈ దేశంలో ఎంత మంది పిల్లలకు అందుబాటులో ఉంటుందో తెలియదుగాని ఉత్తర భారతదేశంలో పల్లెటూరి అమ్మాయిలకు ఇదో వింతే. రాజస్థాన్‌లోని ఒక అమ్మాయి ఈ చక్రాల పలకతో ప్రేమలో పడితే ఊరు ఏమంటుంది? తల్లిదండ్రులు ఏమంటారు? ఎన్నో అడ్డంకులను దాటి ఊళ్లో ఒక స్కేటింగ్‌ గ్రౌండ్‌ను ఆ అమ్మాయి ఎలా ఏర్పాటు చేసుకొని ఛాంపియన్‌ అయ్యింది? మొదటిసారిగా స్కేటింగ్‌ బోర్డ్‌ నేపథ్యంలో ఈ సినిమా తయారయ్యింది. క్రిస్టఫర్‌ నోలన్‌ దగ్గర శిష్యరికం చేసిన మన ముంబై దర్శకురాలు మంజరి మాకిజనీ దీని దర్శకురాలు. జూన్‌ మొదటివారంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా సందేశం... పరిచయం...

పల్లెటూరి అమ్మాయిలంటే తాటికాయలకు పుల్ల గుచ్చి బండిలాగా లాగేంత వరకూ తెలియనిస్తారు. సైకిల్‌ తొక్కడం ఒక మేరకు ఓకే. ఇక వాళ్ల ఆటలన్నీ ఇంటికే పరిమితం అనుకునే పరిస్థితే మన దేశంలో. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా ఉత్తరాదిలో పల్లెటూరి ఆడపిల్లలు తొందరగా ఎదిగితే తొందరగా పెళ్లి చేసి పంపించేయాలనే భావజాలంలోనే పెంచబడతారు. కాని వారికీ కలలుంటాయి. వారికీ సామర్థ్యాలు ఉంటాయి. వారికీ నిరూపణా శక్తి ఉంటుంది. వారికీ విజయ కాంక్ష ఉంటుంది. వారికీ అవకాశాలు పొందే హక్కు ఉంటుంది అని చెప్పే సినిమాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలా వస్తున్న సినిమా ‘స్కేటర్‌ గర్ల్‌’. ఇండో–అమెరికన్‌ సినిమాగా హాలీవుడ్‌ ప్రేక్షకులను, భారతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తయారైన ఈ సినిమా ‘నెట్‌ఫ్లిక్స్‌’లో జూన్‌ 11 నుంచి స్ట్రీమ్‌ కానుంది. దీని దర్శకురాలు మంజరి మాకిజనీ.

హాలీవుడ్‌లో మన స్త్రీ దర్శకురాలు
‘షోలే’ సినిమా చూసిన వారందరికీ అందులో మెక్‌ మోహన్‌ పోషించిన ‘సాంబ’ పాత్ర గుర్తుండే ఉంటుంది. ఆ మెక్‌ మోహన్‌ కుమార్తే మంజరి మాకిజనీ. ‘చిన్నప్పుడు నాన్నతో పృథ్వీ థియేటర్‌ (ముంబై)కు వెళ్లి నాటకాలు చూసి ఆయనతో చర్చించడం నా మీద ప్రభావం చూపింది’ అంటుంది మంజరి. గత ఏడేళ్లుగా లాస్‌ ఏంజెలెస్‌ లో స్థిరపడి హాలీవుడ్‌ కోసం కూడా పని చేస్తున్న మంజరి బాలీవుడ్‌లో విశాల్‌ భరద్వాజ్‌ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసింది. ఆ తర్వాత హాలీవుడ్‌కు వెళ్లి క్రిస్టఫర్‌ నోలన్‌ ‘డన్‌కిర్క్‌’కు పని చేసింది. ఆమె తీసిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘ఐ సీ యూ’, ‘ది లాస్ట్‌ మార్బెల్‌’, ‘ది కార్నర్‌ టేబుల్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్స్‌కు చాలా పేరు వచ్చింది. ఎంత పేరు వచ్చిందంటే ప్రతిష్ఠాత్మక ‘అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ తన 2016లో నిర్వహించిన మహిళా డైరెక్టర్ల వర్క్‌షాప్‌కు ఆహ్వానం అందేంత. అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 1973 నుంచి ఇలాంటి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంటే ఇప్పటివరకూ ఆహ్వానం అందుకున్న భారతీయులలో మంజరి రెండవ వ్యక్తి అంటే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆమెకు నోలన్‌ వంటి ప్రఖ్యాత దర్శకుడి దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది.

స్కేటర్‌ గర్ల్‌
ఇంత అనుభవం తర్వాత మంజరి ‘స్కేటర్‌ గర్ల్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్రామీణ ఆడపిల్లలకు స్ఫూర్తినిచ్చే, వారి కలలకు ఊతం ఇచ్చే ఈ కథను ఆమె తన సోదరి వినతి మాకిజనీతో కలిసి రాసుకుంది. బాలీవుడ్‌లో ఇప్పటి వరకూ హాకీ, బాడ్‌మింటన్, క్రికెట్‌ వంటి స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాలు వచ్చాయి. కాని దేశంలో ఎక్కడా ‘స్కేట్‌బోర్డ్‌’ నేపథ్యంగా సినిమా రాలేదు. ‘స్కేటర్‌ గర్ల్‌’ మొదటిది. అందుకే ఈ సినిమా మీద అందరికీ ఆసక్తి నెలకొంది.

అడ్డంకులు దాటాలా? రాజీ పడాలా?

బ్రిటన్‌కు చెందిన ఒక యాడ్‌ ప్రొఫెషనల్‌ జెస్సికా (బ్రిటిష్‌ నటి అమి మఘేరా) రాజస్థాన్‌లోని మారుమూల పల్లెకు షూటింగ్‌ నిమిత్తం రావడంతో ఈ కథ మొదలవుతుంది. అక్కడ పిల్లలు చక్రాలు బిగించుకున్న కర్రబల్లను లాక్కుంటూ ఆడుకుంటున్నారు. ఈ బల్ల స్కేట్‌బోర్డ్‌కు దగ్గరగా ఉంది అని జెస్సికా గమనిస్తుంది. అంతేకాదు, ఆ ఊరి అమ్మాయి ప్రేరణ ఆ బల్లను బేలెన్స్‌ చేయడంలో ఎంతో ప్రావీణ్యం చూపించడం కూడా గమనిస్తుంది. అంతే. ఆ పిల్లలందరికీ స్కేట్‌బోర్డ్‌ కొనిచ్చి వారిని అందులో ఎంకరేజ్‌ చేస్తుంది. కాని అసలే పల్లెటూరు. ఆపైన ఆడపిల్ల. ప్రేరణకు స్కూల్లో, ఇంట్లో, ఊళ్లో ఎన్నో అడ్డంకులు. ఆడపిల్ల ఇలాంటి ఆట ఆడటం ఏమిటి? అని. అయితే ఆ ఆడపిల్ల ఆ ఆట ఆడటమే కాదు ఊళ్లో పిల్లలందరూ ఆడుకోవడానికి కమ్యూనిటీ స్కేటింగ్‌ పార్క్‌ నిర్మించడానికి కంకణం కట్టుకుంటుంది. అంతే కాదు, ప్రాక్టీసు చేసి ఛాంపియన్‌షిప్‌ సాధించాలని పట్టుబడుతుంది.

‘స్కేటర్‌ గర్ల్‌’ దర్శకురాలు మంజరి మాకిజనీ.

‘నీ భయాన్ని జయించాలనంటే దానిని ఎదుర్కొనడమే మార్గం’ అంటుంది ప్రేరణ. ఆడపిల్లలుగాని, యువతులుగాని, స్త్రీలు గాని తమ గమనంలో ఫలానా అడ్డంకి వస్తుందని భయపడి ఆగిపోవడం కంటే దానిని గెలవడానికి దానిని ఎదుర్కొనడమే మంచిది అని ఈ సినిమా చెబుతుంది. మంచి సాంకేతిక నిపుణులు, నటీనటులు పాల్గొన్న ఈ సినిమాలో సీనియర్‌ నటి వహీదా రహమాన్‌ ఒక ముఖ్యపాత్ర పోషించడం విశేషం.
ఇంకో పది రోజుల్లో చూడటానికి సిద్ధంగా ఉండండి.

– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top