క్యాన్సర్‌ రోగులకు ఉపయోగపడే సౌకర్యాల వేర్‌! | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ రోగులకు ఉపయోగపడే సౌకర్యాల వేర్‌!

Published Wed, Sep 13 2023 9:50 AM

This Sister Duo Help Clothing For Cancer Patients-  - Sakshi

సాధారణంగా రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్న వారెవరైనా... ‘ఇన్నాళ్లూ పనిచేసి అలసిపోయాం, ఇక విశ్రాంతి తీసుకుందాం’ అనుకుంటారు. అయితే సుకన్య, సంధ్యారావులు మాత్రం ఇలా అనుకోలేదు. రిటైర్మెంట్‌ తరువాత కొత్త వ్యాపారం చేయాలనుకున్నారు. అరవై ఏళ్లకు దగ్గరలో ఉన్నా వారిలోని హుషారు, ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అక్క సుకన్య ఎమ్మెస్సీ చేసింది. దానికితోడు టీచింగ్, ఫార్మా, ఆడిటింగ్, ఆర్ట్స్‌ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. టెక్స్‌టైల్‌ టెక్నాలజీ ఇంజినీర్‌ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్స్‌లో పనిచేసిన అనుభవం వాటికి తోడైంది. అయితే అనుకోకుండా ఎదురైన ఒక సంఘటన వల్ల వారు క్యాన్సర్‌ రోగులకు ముఖ్యంగా స్త్రీలకు అవసరం అయిన ప్రత్యేక తరహా దుస్తులను రూపొందిస్తూ తమ వైవిధ్యాన్ని కూడా చాటుకుంటున్నారు. 
 

అత్తయ్య అవస్తలు చూసి...
దుస్తుల పరిశ్రమలో ఇరవై ఏళ్లపాటు పనిచేసిన సంధ్య తనకు తనే బాస్‌ కావాలి అనుకునేది. ఈ క్రమంలోనే ఏదైనా దుస్తుల తయారీ కంపెనీ పెడితే బాగుంటుందని అనుకున్నారు అక్కాచెల్లెళ్లు. వీరు ఇలా ఆలోచిస్తున్న సమయంలో... వీరిద్దరికీ ఎంతో ఇష్టమైన వీరి మేనత్తకు రొమ్ము క్యాన్సర్‌ ఉన్నట్లు తెలిసింది. సుకన్య, సంధ్యలకు  మంచి స్నేహితురాలిలా ఉండే మేనత్త క్యాన్సర్‌తో బాధపడడం వారిని కలచి వేసింది. 

ఒకపక్క క్యాన్సర్‌ బాధిస్తుంటే మరోపక్క ఆమె ధరించే దుస్తులు ఆమెకు సౌకర్యంగా లేకపోవడాన్ని ఇద్దరూ గమనించారు. క్యాన్సర్‌తో బాధపడే ఎంతోమంది రోగులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్‌ రోగులు ధరించడానికి వీలుగా ఉండే దుస్తులు రూపొందిస్తే వందలాది మంది క్యాన్సర్‌ రోగులకు సాయం చేసినట్లే అనుకుని ‘వీకీ వేర్‌’ పేరిట క్యాన్సర్‌ రోగులకు దుస్తులు తయారు చేయడం ప్రారంభించారు.

సలహాలు... సూచనలతో...
ఆంకాలజిస్టులు, క్యాన్సర్‌ రోగుల సలహాలు, సూచనలు తీసుకుని 2017లో తలకు పెట్టుకునే టోపీని రూపొదించారు. కాటన్‌తో తయారు చేసిన ఈ టోపీని కీమోథెరపీ  చేయించుకునేటప్పుడు ధరించడానికి అనుకూలంగా తయారు చేశారు. తరువాత మాస్టెక్టమీ బ్రాలను రూపొందించారు. చర్మానికి సౌకర్యంగా ఉండే బ్రాలను మార్కెట్‌ ధర కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా క్యాన్సర్‌ రోగులకు అవసరమైన వాటిని స్వయం సహాయక గ్రూపులతో తయారు చేయిస్తూ సాటి మహిళ లకు ఉపాధి కల్పిస్తున్నారు. వీరి వీకీ వేర్‌ ఉత్పత్తులు ఇతర దేశాలకు కూడా ఎగుమతి  అవుతున్నాయి. 

రోగులకు ఇలా...
వీకీ వేర్‌ ఉత్పత్తులు తయారయ్యాక క్యాన్సర్‌ రోగులకు టెస్టింగ్‌ కోసం పంపించి, వారికి అన్నివిధాల సౌకర్యంగా ఉన్నాయన్న నిర్ధారణ అయిన తరువాత మార్కెట్లో విక్రయిస్తున్నారు. క్యాన్సర్‌ కేర్‌ ఆసుపత్రుల్లోని డాక్టర్లను కలిసి వీకీ వేర్‌ గురించి చెప్పడం, క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతున్న రోగులకు వాటిని ఇవ్వడం ద్వారా వీకీ వేర్‌ రోగులకు చేరుతున్నాయి. వీకీ వేర్‌ వెబ్‌సైట్, సోషల్‌ మీడియా, ఈ కామర్స్‌ సైట్ల ద్వారా ఉత్పత్తులు విక్రయిస్తున్నారు సుకన్య, సంధ్యారావులు.

‘‘మీ కలలను ఎప్పటికీ వదులుకోవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు కంటోన్న కల మీద నమ్మకం ఉంచండి. అది తీరడానికి సుదీర్ఘ కాలం పట్టవచ్చు. అయినా వెనక్కి తగ్గవద్దు. కలను నిజం చేసుకునే క్రమంలో ఎవరినైనా సాయం అడగడానికి సిగ్గుపడవద్దు. ఇలా నిజాయితీగా ముందుకు సాగితే వ్యాపారం ఏదైనా రాణించగలుగుతారు’’ అని సుకన్య, సంధ్యలు యువతరానికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు.

(చదవండి:  పడుకునే ముందు  ముఖం కడుగుతున్నారా?     ) 

Advertisement
Advertisement