కర్ణవేధ... విద్యారంభం | Shodasha Samskara Karnavedha Vidyarambham | Sakshi
Sakshi News home page

కర్ణవేధ... విద్యారంభం

Jan 9 2021 8:15 AM | Updated on Jan 9 2021 8:15 AM

Shodasha Samskara Karnavedha Vidyarambham - Sakshi

షోడశ సంస్కారాలలో తొమ్మిదవది కర్ణవేధ: దీనికే కర్ణభేద అనే పేరు కూడా వుంది. అంటే చెవులకు రంధ్రం వేయడం అని అర్థం. వాడుకలో ఈ సంస్కారాన్ని చెవులు కుట్టించడమంటారు.  దీనిని శిశువులందరికీ లింగభేదం లేకుండా శిశువుకు ఐదు సంవత్సరాలు నిండేలోపే జరిపించాలని దేవలుడనే మహర్షి బోధించాడు. తాటంకాలు అనగా చెవి తమ్మెలకు రంధ్రం వేసి వాటిని బంగారంతో అలంకరించడం ద్వారా మెదడుకు చైతన్యం కలిగి జ్ఞాపక శక్తి వృద్ధి చెంది శిశువులు చురుకుగా అన్ని రంగాలలో రాణిస్తారని వైద్యశాస్త్రం చెప్తుంది. ఎందుకంటే, జ్ఞాపకశక్తికి సంబంధించిన నాడులు చెవి తమ్మెలలో అంతమౌతాయి. వాటిని నిత్యం బంగారంతో ప్రేరేపించడం ద్వారా అవి ఉత్తేజితమై, జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. పూర్వాశ్రమంలో గురువులు తమ శిష్యులకు గుంజీలు తీసే శిక్ష విధించడంలో పరమార్థం ఇదే. అందుకే గతంలో స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరూ చెవులు కుట్టించుకునేవారు.  

సంస్కార విధానం: శుభముహుర్తాన స్నానాదులను ఆచరించాలి. స్వర్ణశిల్పాచార్యులను పిలిపించి, పూజామందిరం దగ్గర శిశువును కూర్చుండబెట్టి ఆచార్యుల చేత చెవులు కుట్టించాలి. తర్వాత ఆ చెవులను స్వర్ణాభరణాలతో అలంకరించాలి. తదుపరి ఆ చార్యులకు నూతన వస్త్ర దక్షిణ తాంబూలాదులను సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి.

విద్యారంభం: యాజ్ఞవల్క్య స్మృతి తదితర స్మృతులలో ఈ అక్షరాభ్యాసం గురించి కనిపిస్తుంది. దీనికే విద్యారంభం, అక్షర స్వీకారం అని ఇతర పేర్లున్నాయి.. శిశువుకు ఈ సంస్కారాన్ని చూడాకరణం అయిన తర్వాత చేయాలని శాస్త్రం. వేదాధ్యయనంతప్ప ఇతర విద్యలన్నీ కూడా ఈ సంస్కారం అయిన తర్వాతే నేర్చుకోవడం ప్రారంభించాలని సూచించారు. ఒక్క వేదవిద్యమాత్రం, అర్హులైనవారు ఉపనయనం అయిన తరువాతే ప్రారంభించాలి. ఈ సంస్కారాన్ని ఐదు లేదా ఏడవ సంవత్సరంలో చేయాలని శాస్త్రవచనం. శిశువు విద్యలను అభ్యసించడం ద్వారా దినదిన ప్రవర్ధమానమవుతాడని, ఉత్తరాయణంలో ఈ సంస్కారం జరిపించాలని ఒక భాష్యకారుడు సూచించాడు. కొందరు కార్తీక, మార్గశిర మాసాలు కూడా యోగ్యమనే చెప్పారు. పురుష నక్షత్రాలలో, శుభతిథులలో, ఆది, సోమ, బుధ, గురు, శుక్ర వారాలలో జరిపించాలని శాస్త్రం.

సంస్కార విధానం: శుభముహుర్తాన, పూజామందిరంవద్ద గణపతి పూజ, పుణ్యహవాచనం పూర్తిచేసిన తర్వాత కలశస్థాపన చేసి, అందులోకి వాగ్దేవిని, గణపతిని, ఇతర దేవతలను ఆవాహనచేసి, సరస్వతీదేవికి విశేషపూజలు జరిపించాలి. గుణవంతుడు, విద్యాప్రపూర్ణుడైన ఒక ఆచార్యుని పిలిపించి ఆయనకు పాదపూజ చేసి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత, ఆ ఆచార్యుడు, ఒక పళ్ళెంలో నిండుగా బియ్యం పోసి, మధ్యలో, ఆ బియ్యం మూడు సమాన భాగాలుగా అయ్యేట్లు ఒక బంగారు వస్తువుతో అడ్డంగా రెండు గీతల్ని గీయాలి. మొదటి భాగంలో ‘ఓం‘ అనీ, రెండవ భాగంలో ‘నమశ్శివాయ’ అనీ, మూడవభాగంలో ‘సిద్ధం నమః‘ అనీ వ్రాయాలి. శిశువును కుడితొడమీద కూర్చోపెట్టుకుని, తండ్రి, ఆ శిశువుచేత ఆ అక్షరాలను మూడుసార్లు దిద్దించాలి. ఆ తర్వాత గణపతికి, సరస్వతికి హవిస్సులర్పించే హోమం చేయాలని కొన్నిచోట్ల ప్రస్తావస్తన కనిపిస్తుంది.       
  – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement