మీరు బాగా అరుస్తున్నారా? అయితే, అరవండి ఇంకా అరవండి.. కానీ ఓ కండిషన్‌

Screams and Giggles to Beat the Pandemic - Sakshi

Scream To Release Stress: డాక్టర్‌ రాసే మాత్రలు వేరు. మనం వాడుకోవాల్సిన మాత్రలు కూడా ఉంటాయి. అమెరికాలో స్త్రీలు ఇప్పుడు ‘స్క్రీమ్‌ గేదరింగ్స్‌’లో పాల్గొంటున్నారు. అంటే ఒక మైదానంలో చేరి పెద్ద పెద్దగా అరిచి తెరిపిన పడుతున్నారు. ఎందుకు? ఒత్తిడి దూరం చేసుకోవడానికి. మన దేశంలో కూడా కోవిడ్‌ వల్ల, కుటుంబ సభ్యుల అనారోగ్యాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల స్త్రీలు లోలోపల వొత్తిడి పేరబెట్టుకుంటున్నారు. ఇది మంచిది కాదు. డాబా మీదకో, గ్రౌండ్‌లోకో వెళ్లి ‘స్క్రీమ్‌’ చేయడం ఒత్తిడికి ఒక మందు. ‘లాఫింగ్‌ థెరపీ’లా ఈ థెరపీ ఇప్పుడు అవసరమే సుమా.

సంప్రదాయ చైనీయ వైద్యంలో కొండ చిటారుకో, ఏదైనా ఏకాంత ప్రదేశానికో వెళ్లి పెద్ద పెద్దగా అరవడం కూడా ఒక ఆరోగ్య సాధనం అని నమ్ముతారు. చైనా సంగతేమో కాని అమెరికాలోని స్త్రీలు మా అసహనాన్ని పెద్దగా అరచి పారదోలుతాం అని ఇటీవల ఏదో ఒక ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లోనో పార్క్‌లోనో ‘స్క్రీమ్‌ గేదరింగ్స్‌’ నిర్వహిస్తున్నారు. అంటే ఒక పదీ పదిహేను నిమిషాల సేపు పెద్దగా అరిచి తమ మనసులో, శరీరంలో ఉన్న అలజడిని తగ్గించుకోవడం అన్నమాట. దానికి కారణం గత రెండేళ్లుగా కోవిడ్‌ వారిపై ఏర్పరుస్తున్న ఒత్తిడిని వాళ్లిక సహించలేని స్థాయికి చేరడమే.

కోవిడ్‌ను పూర్తిగా నిర్మూలించే వాక్సిన్‌ ఇంకా రాకపోవడం, వాక్సిన్‌ వేసుకున్నా దాని బారిన పడుతూ ఉండటం, చంటి పిల్లలకు ఇంకా వాక్సిన్‌ లేకపోవడం, కోవిడ్‌ వల్ల అందరూ ఇంట్లో ఉండిపోవాల్సి రావడం, ఉద్యోగాలు ఊడటం, రెట్టింపు పని చేయాల్సి రావడం... ఇవన్నీ పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా గూడు కట్టుకుని పోతున్నాయి. అవి అలాగే లోపల సాంద్రపడటం ప్రమాదం అని నిపుణులు అంటారు. వొత్తిడిని సాటివారితో పంచుకుని రిలీఫ్‌ పొందాలి. కాని సాటివారు కూడా అలాంటి వొత్తిడిలో ఉంటే ఏమిటి చేయడం.

‘పదండి... అందరం కలిసి అరుద్దాం’ అని అమెరికాలోని స్త్రీలు స్క్రీమ్‌ థెరపీని సాధన చేస్తున్నారు. అయితే ఈ అరుపులు ఇతరులు వినకపోవడమే మంచిది. పెద్దగా గట్టిగా అరిచే మనిషిని చూడటం, వినడం ఎదుటి వారికి ఆందోళన కలిగించవచ్చు. అందుకే వీలైనంత ఏకాంత ప్రదేశంలో వీటిని సాధన చేయడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు.

యోగాలో కూడా ‘జిబ్రిష్‌’ వంటివి సాధన చేయిస్తుంటారు. అంటే ఒక ఐదు పది నిమిషాలు గొంతులో నుంచి ఏ పిచ్చి అరుపులు వస్తే ఆ అరుపులను అలౌ చేస్తూ వెళ్లడం. దీని వల్ల సబ్‌కాన్షియస్‌ మైండ్‌లో గూడు కట్టుకుని ఉన్న గాఢమైన భావాలు వదిలిపోతాయని చెబుతారు. మరో పద్ధతి ‘ట్రీ షేక్‌’. అంటే ఒక చెట్టు గాలికి ఎలా గలగలలాడిపోతుందో అలా మూడు నాలుగు నిమిషాలు నిటారుగా నిలబడి ఒళ్లంతా గలగలలాడించాలి (కదిలించాలి). దాని వల్ల ఒత్తిడి దూరం అవుతుందని నిపుణులు అంటారు.

మన దేశంలో అమ్మలు, పెద్దవాళ్లు ఏదైనా ఒత్తిడి పెరగడం వల్ల గట్టిగా తిట్టడం, అరవడం చూస్తూ ఉంటాం. అది ఒక రకంగా స్ట్రెస్‌ నుంచి దూరమవడమే. ఎన్నో చేదు సంఘటనలు, అయిష్టమైన పరిణామాలు చూసిన స్త్రీలు ‘గయ్యాళి’ ముద్రతో ఉండటం కూడా మన సమాజంలో ఉంది. నిజానికి అదంతా లోపలి ఒత్తిడికి ఒక బయటి ప్రతిఫలనం. ఆ ఒత్తిడి ఏమిటో కనుక్కుని దూరం చేయగలిగితే వారు కూడా శాంత స్వభావులు అవుతారు.

గత రెండేళ్లుగా ఇళ్లల్లో ఉగ్గ పట్టుకుని ఉన్న స్త్రీలు ఏ మేరకు ఒత్తిడిలో ఉన్నారో కుటుంబం మొత్తం పట్టించుకోవాలి. ఇవాళ రేపూ అంటూ కోవిడ్‌ ముగింపు వాయిదా పడే కొద్దీ వారి మనసులో ఎలాంటి భావాలు చెలరేగుతున్నాయో కూడా పరిశీలిస్తూ ఉండాలి. వారు విసుక్కుంటూ ఉంటే, ఒక్కోసారి పని వైముఖ్యం చూపుతుంటే కుటుంబం సంపూర్ణంగా ఆ మూడ్స్‌ను అర్థం చేసుకోవాలి. మగవాళ్లు స్ట్రెస్‌ను తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం వెతుక్కుంటారు. వారికి కనీసం బయట ఒకరిద్దరు స్నేహితులను కలిసే వీలు ఉంటుంది. స్త్రీలు ఇళ్లకే పరిమితమయ్యే అనివార్య పరిస్థితులు ఈ రెండేళ్లలో వచ్చాయి. అందుకే వారి మానసిక ఆరోగ్యం కూడా శ్రద్ధ పెట్టక తప్పదు.

మంచి నిద్ర, ఉల్లాసం, ఆశావహమైన భవిష్యత్తు కనిపించకనే తాము పార్కుల్లో చేరి కేకలేస్తున్నాం అంటున్నారు అమెరికా వనితలు. ‘మా మీద మేము అరుచుకోలేము. కుటుంబం మీద అరవలేము. పిల్లల చదువు సరిగ్గా సాగకపోవడం మాకు చాలా వొత్తిడి కలిగిస్తోంది. వాళ్ల మూడ్స్‌ కూడా మాకు కష్టమే. మాకు వొత్తిడిగా ఉంది. అందుకే ఏడ్చి తెప్పరిల్లే బదులు అరిచి తెరిపిన పడుతున్నాం’ అని బోస్టన్‌లో స్క్రీమ్‌ థెరపీలో పాల్గొన ఒక గృహిణి అంది.

‘కోపం పోవడానికి పంచింగ్‌ బ్యాగ్‌ను పంచ్‌ చేయడం ఎలాగో ఒత్తిడి పోవడానికి ఇలా పెద్దగా అరవడం అలాగా’ అని కొందరు నిపుణులు అంటున్నారు. యుద్ధ సైనికుడు గెలుపు నినాదం ఇచ్చినట్టు, కుంగ్‌ఫూ ఫైటర్‌ పంచ్‌ ఇచ్చే ముందు అరిచినట్టు, కింగ్‌ కాంగ్‌ శత్రువు మీద దాడి చేసే ముందు గుండెలు చరుచుకున్నట్టు మామూలు మనుషులు కూడా ఏదో ఒక పార్కులో చేరి తమ లోపల ఉన్న ఒత్తిడి అనే శత్రువును ఈ పద్ధతుల్లో ఓడించవచ్చని నిపుణులు అంటున్నారు. స్క్రీమ్‌ థెరపీ వల్ల ప్రయోజనం ఎలా ఉన్నా దాని వంకతో తమ లాంటి కొంతమంది స్త్రీలతో ఏదో ఒక మేరకు కొత్త స్నేహం, సంభాషణ కూడా ఒత్తిడి తగ్గిస్తాయి. కాబట్టి కొత్త మార్గాలు వెతకండి. ఆరోగ్యంగా ఉండండి. ఒత్తిడిని ఒంట్లో నుంచి ఖాళీ చేయండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top