హనీ!బీ అలెర్ట్ | Sakshi Funday Special Story: Environmental pollution effect on honey bees | Sakshi
Sakshi News home page

హనీ!బీ అలెర్ట్

May 17 2026 12:26 AM | Updated on May 17 2026 12:26 AM

Sakshi Funday Special Story: Environmental pollution effect on honey bees

తేనెటీగల మనుగడపై కాలుష్యం కాటు

ప్రకృతిలో ఎన్నో కీటకాలు ఉన్నా, వాటిలో తేనెటీగల పాత్ర అత్యంత కీలకం. ప్రకృతిలోని జీవవైవిధ్యం కాపాడటానికి తేనెటీగలు అహరహం శ్రమిస్తుంటాయి. మొక్కల్లోని పరాగసంపర్కం తొంభైశాతం తేనెటీగల ద్వారానే జరుగుతుంది. తేనెటీగలే లేకుంటే, చాలారకాల వృక్షజాతుల మనుగడకు ముప్పు కలుగుతుంది. ఒకవేళ తేనెటీగలే అంతరించిపోతే, భూమ్మీద మానవాళి అంతరించిపోవడానికి ఎంతోకాలం పట్టదని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికి తేనెటీగలు అంతరించిపోయే పరిస్థితి లేదు గాని, వాటి మనుగడ మాత్రం కష్టాల్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, తేనెటీగల మరణాలు ఆందోళనకరమైన స్థాయిలో పెరుగుతున్నాయి. 

ఒక్కోచోట తేనెటీగల మరణాలు దాదాపు నలభై శాతం వరకు ఉంటున్నాయి. మరోవైపు తేనెటీగల సహజ ఆవాసాలు కనుమరుగైపోతున్నాయి. ప్రకృతిలో తేనెటీగల పాత్ర, వాటి ప్రస్తుత స్థితిగతుల గురించి మే 20న ‘ప్రపంచ తేనెటీగల దినోత్సవం’ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం...

తేనెటీగలు ప్రకృతిలోని అత్యంత కీలకమైన కీటకాలు. తేనెటీగల ద్వారానే దాదాపు డెబ్బయి శాతం పంటలు పండుతున్నాయి. తేనెటీగలు పూల నుంచి మకరందాన్ని సేకరిస్తాయి. ఈ క్రమంలో పూల పుప్పొడిని ఒకదాని నుంచి మరొకదానికి చేరవేయడం ద్వారా పరాగ సంపర్కానికి దోహదపడతాయి. తేనెటీగల వల్ల జరిగే పరాగ సంపర్కం కారణంగానే దాదాపు డెబ్బయి శాతం ఆహార ధాన్యాలు, పండ్లు పండుతున్నాయి. 

తేనెటీగలు మైనంలాంటి కొవ్వు పదార్థంతో షడ్భుజాకారంలో అద్భుతమైన గూళ్లు నిర్మించుకుంటాయి. ఇలాంటి గూళ్ల వరుసతో తేనెపట్టులు ఏర్పాటు చేసుకుంటాయి. రకరకాల పూల నుంచి సేకరించిన మకరందాన్ని వీటిలో భద్రపరచుకుంటాయి. తేనెటీగల సంఖ్య తగ్గిపోతే, ఆహార చక్రం అస్తవ్యస్తం అవుతుంది. పంటల దిగుబడి తగ్గిపోయి, ఆహార కొరత ఏర్పడుతుంది. తేనెటీగలు అంతరించిపోతే, మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుండటంతో తేనెటీగలను కృత్రిమంగా పెంచే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయినా కూడా పలుచోట్ల తేనెటీగల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది.

తేనెటీగలకు ముప్పు వీటి వల్లనే...
తేనెటీగల మనుగడకు ముప్పు కలిగిస్తున్న వాటిలో ప్రధానమైనవి రసాయనిక పురుగు మందులు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో రసాయనిక పురుగు మందుల వాడకం పెరిగింది. పురుగు మందుల్లోని ‘నియోనికోటినాయిడ్స్‌’ వంటివి పెద్దసంఖ్యలో తేనెటీగల ఉసురు తీస్తున్నాయి.

⇒ అడవుల నరికివేత వల్ల చెట్లు తగ్గిపోతున్నాయి. తేనెటీగలు గూళ్లు కట్టుకోవడానికి అనువైన చెట్లు తగ్గిపోతుండటంతో అవి తమ సహజమైన ఆవాసాలను కోల్పోతున్నాయి. చెట్లు తగ్గడం వల్ల పూలు కూడా తగ్గిపోయి, తేనెటీగలు తమ ఆహారాన్ని కూడా కోల్పోతున్నాయి. ఆహారం, ఆవాసం కరవైన పరిస్థితుల్లో తేనెటీగలు 
నశించిపోతున్నాయి.

⇒ వాయు కాలుష్యం తేనెటీగల మీద కూడా దుష్ప్రభావాన్ని చూపుతోంది. వాయుకాలుష్యం వల్ల తేనెటీగలు పూల సువాసనను గుర్తించలేక, తమ సహజమైన ఆహారాన్ని సేకరించుకోలేక నశిస్తున్నాయి.
⇒ రకరకాల పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు, వైరస్‌ల వల్ల కూడా తేనెటీగలకు ముప్పు కలుగుతోంది. వ్యా«ధికారకమైన పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు, వైరస్‌లు సోకినప్పుడు తేనెటీగలు పెద్దసంఖ్యలో నశించిపోతుంటాయి.

⇒ కొన్ని ప్రాంతాల్లో ఏకపంట సాగు కొనసాగిస్తుండటం కూడా తేనెటీగల మనుగడకు చేటు తెస్తోంది. ఏకపంట సాగు వల్ల తేనెటీగలు ఆహార వైవిధ్యాన్ని కోల్పోయి, క్రమంగా క్షీణిస్తున్నాయి.
⇒ తేనె సేకరించడంలో మనుషులు అనుసరించే అనియంత్రిత విధానాల వల్ల కూడా తేనెటీగలు పెద్దసంఖ్యలో నశిస్తున్నాయి. తేనె సేకరణ కోసం తేనెపట్టులకు పొగబెట్టి, తేనెపట్టులను చెట్ల నుంచి తొలగించడం వంటి పనుల వల్ల తేనెటీగల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది.

ప్రపంచవ్యాప్త సమస్య
తేనెటీగలు తగ్గిపోతుండటం ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదు, ఇది ప్రపంచవ్యాప్త సమస్య. ఒక్కో దేశంలో ఈ పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంటోంది. అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం..

తేనెటీగలు తగ్గితే...
⇒  పంటల దిగుబడి తగ్గి, ఆహార కొరత ఏర్పడుతుంది
⇒ జీవ వైవిధ్యం దెబ్బతింటుంది.
⇒ పర్యావరణం సమతుల్యత కోల్పోతుంది.
⇒ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.
⇒ చివరికి మానవజాతి మనుగడకు ముప్పు ఏర్పడుతుంది.

తేనెటీగలకు ప్లాస్టిక్‌ బెడద
తేనెటీగలకు నానా రకాల కాలుష్యాలతో పాటు ఇటీవలి కాలంలో ప్లాస్టిక్‌ బెడద కూడా పెరుగుతోంది. తేనెటీగలు సహజంగా రకరకాల చెట్ల నుంచి వెలువడే జిగురుతో గూళ్లు నిర్మించుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్ల జిగురు తగినంత దొరకక తేనెటీగలు తమ గూళ్ల నిర్మాణానికి చిన్న చిన్న ప్లాస్టిక్‌ ముక్కలను కూడా ఉపయోగించుకుంటున్నాయి. తేనెటీగలు తమ గూళ్ల నిర్మాణానికి ప్లాస్టిక్‌ వినియోగించుకుంటున్న విషయం తొలిసారిగా 2013లో కెనడాలో వెలుగులోకి వచ్చింది. టొరంటోలోని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో తేనెగూళ్లలో ప్లాస్టిక్‌ అవశేషాలు బయటపడ్డాయి.

తర్వాత ఇదే పరిస్థితిని బ్రిటన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్‌ తదితర దేశాల్లోనూ గుర్తించారు. నగర ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాల్లోని తేనెగూళ్లలో ప్లాస్టిక్‌ అవశేషాలు ఎక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదిలా ఉంటే, కొన్నిచోట్ల పారిశ్రామికంగా తేనెటీగల పెంపకం సాగిస్తున్నవారు తేనెగూళ్ల కోసం చెక్క ఫ్రేముల బదులుగా ప్లాస్టిక్‌ ఫ్రేములు వాడుతున్నారు. వీటి వల్ల కూడా తేనెటీగలకు మైక్రోప్లాస్టిక్స్‌ బెడద తప్పడం లేదు. తేనెగూళ్లలో ప్లాస్టిక్‌ కారణంగా రకరకాల దుష్పరిణామాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం తేనెగూళ్లలోకి ప్లాస్టిక్‌ చేరడం వల్ల తలెత్తే అనర్థాలు ఇవీ:

తేనెపట్టులకు మహమ్మారి
అడవుల నరికివేత, రసాయనిక పురుగు మందులు, చిన్నా చితకా పరాన్నజీవులు, బ్యాక్టీరియా, వైరస్‌లు వంటివి తేనెటీగల మనుగడకు ముప్పు కలిగిస్తున్న సంగతి తెలిసిందే! వీటికి మించిన పెనుముప్పు ‘కాలనీ కొల్లాప్స్‌ డిజార్డర్‌’ (సీసీడీ) రూపంలో తేనెపట్టులను నామరూపాలు లేకుండా నాశనం చేస్తోంది. సీసీడీని పర్యావరణవేత్తలు ‘మహమ్మారి’గా అభివర్ణిస్తున్నారు. తేనెపట్టులను అకస్మాత్తుగా నాశనం చేసే ఈ పరిణామాన్ని తొలిసారిగా ఇరవై ఏళ్ల కిందట గుర్తించారు. అమెరికాలో 2006–07లో సీసీడీ కారణంగా కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 60% తేనెపట్టులు తుడిచిపెట్టుకుపోయాయి. తేనెపట్టుల్లో సీసీడీ పరిస్థితి ఏర్పడినప్పుడు తేనెను సేకరించే కార్మిక తేనెటీగలు అకస్మాత్తుగా కనిపించకుండాపోతాయి.

తేనెపట్టులో రాణి ఈగ, ఇంకా రెక్కలురాని పిల్లలు మాత్రమే మిగిలి ఉంటాయి. చనిపోయిన తేనెటీగలు గూటి దగ్గర ఎక్కువగా కనిపించవు. కొద్దికాలంలోనే తేనపెట్టులోని తేనెటీగలేవీ మిగలవు. బ్రిటన్‌లోను, ఇతర యూరోప్‌ దేశాల్లోనూ సీసీడీ కారణంగా దాదాపు 30% వరకు తేనెపట్టులు నాశనమయ్యాయి. భారత్‌లో సీసీడీ ప్రభావం కొంత తక్కువగా ఉంది. భారత్‌లో సీసీడీ వల్ల 10%–20% మేరకు నష్టం వాటిల్లింది.

సీసీడీ కేవలం ఒక కారణం వల్ల కాకుండా, అనేక కారణాల సమ్మేళనం వల్ల ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. వాతావరణ మార్పులు, పూల వైవిధ్యం తగ్గడం, మితిమీరిన రసాయనాలు, కాలుష్యం, అడవుల నరికివేత, పరాన్నజీవులు, సూక్ష్మజీవుల తాకిడి– ఇవన్నీ ఒకేసారి మితిమీరినప్పుడు సీసీడీ పరిస్థితి ఏర్పడుతుందని వివరిస్తున్నారు. సీసీడీ కేవలం తేనెటీగల సమస్య మాత్రమే కాదు, ఇది మానవుల ఆహారచక్రం సమస్య కూడా! ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగితే, వాటిల్లబోయే నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమే!

తేనె చరిత్ర
తేనె వినియోగం పదివేల ఏళ్ల కిందటే మొదలైంది. తేనె కోసం కృత్రిమ పద్ధతుల్లో మట్టితో తేనెగూళ్లను నిర్మించే తొలి పద్ధతులు క్రీస్తూపూర్వం 3000 నాటికే వాడుకలో ఉండేవని పలు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రాచీన ఈజిప్టులో మానవులు తొలినాళ్లలో కృత్రిమంగా మట్టితో ఏర్పాటు చేసిన తేనెగూళ్ల అవశేషాలు బయటపడ్డాయి. స్పెయిన్‌లో బయటపడ్డ గుహాచిత్రాల ఆధారంగా మనుషులకు క్రీస్తుపూర్వం 8000 నాటికే తేనె వినియోగం తెలుసునని చరిత్రకారులు చెబుతున్నారు. పురాతన వైద్య పద్ధతుల్లో తేనెను ప్రధానంగా ఉపయోగించేవారు.

వివిధ ఔషధాలను తేనెతో కలిపి సేవించడం ఇప్పటికీ మన ఆయుర్వేదం సహా అనేక సంప్రదాయ వైద్యపద్ధతుల్లో ఆచరణలో ఉంది. తేనె పోషకాల గని. ఎన్నాళు గడిచినా తేనెకు కాలం చెల్లదు. స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ చెడిపోదు. అందుకే పదార్థాలను దీర్ఘకాలం నిల్వ ఉంచడానికి తేనెను ఉపయోగిస్తారు. తేనెను తక్షణ శక్తినిచ్చే పదార్థంగా, ఔషధంగా, సౌందర్య సాధనంగా, సంప్రదాయ క్రతువుల్లో పవిత్ర పదార్థంగా ఉపయోగిస్తారు. తేనెను వంటకాల్లో చక్కెరకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగిస్తారు.

తేనె గురించి కొన్ని వాస్తవాలు
⇒  ఒక టీ స్పూన్‌ తేనెను మనం అవలీలగా చప్పరించేస్తాం. నిజానికి టీ స్పూన్‌ పరిమాణంలోని తేనె దాదాపు డజను తేనెటీగల జీవితకాల శ్రమ.
⇒  ప్రాంతాన్ని బట్టి, అక్కడ పూచే పూలను బట్టి తేనె రంగు, రుచి మారుతూ ఉంటుంది. తేనె సహజంగా పారదర్శకమైన లేత పసుపు నుంచి ముదురు గోధుమ రంగు వరకు రకరకాల రంగుల్లో ఉంటుంది. లేత రంగు తేనె కంటే ముదురు రంగు తేనె ఎక్కువ రుచిగా ఉంటుంది.

⇒  తేనెలో నీటిశాతం తక్కువగా ఉండటం, ఆమ్లత్వం ఎక్కువగా ఉండటం వల్ల తేనెలో బ్యాక్టీరియా పెరగడం దాదాపు అసాధ్యం. తేనెను సరైన పద్ధతిలో నిల్వచేస్తే వేల ఏళ్లు గడిచినా చెడిపోదు. ఈజిప్టు సమాధుల్లో దొరికిన వేల ఏళ్ల  నాటి తేనె ఈనాటికీ ఉపయోగించడానికి అనువుగా ఉంది.
⇒  గాలిలోని తేమ సోకితే ఆహార పానీయాలు ఏవైనా త్వరగా చెడిపోతాయి. తేనె మాత్రం వాటికి పూర్తిగా భిన్నం. గాలిలోని తేమ సోకినా తేనె చెడిపోదు.
⇒ తేనెను వేడిచేస్తే నాణ్యత కోల్పోతుంది. వేడి చేయడం వల్ల తేనెలోని కీలకమైన ఎంజైమ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి.

తేనెటీగల పెంపకం
ఆధునిక యుగంలో పంతొమ్మిదో శతాబ్దం నుంచి కృత్రిమంగా తేనెటీగల పెంపకం మొదలైంది. అమెరికన్‌ శాస్త్రవేత్త లోరెండో లాంగ్‌స్ట్రోత్‌ 1851లో ఎక్కడికైనా సులువుగా తీసుకుపోయేందుకు అనువైన తేనెగూడును కృత్రిమంగా నిర్మించాడు. అప్పటి నుంచి తేనెటీగల పెంపకం (ఎపికల్చర్‌) వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా ఎదగడం మొదలైంది. ఇప్పుడు చాలా చోట్ల తేనె కోసమే కాకుండా, పంటల పరాగసంపర్కం కోసం కూడా తేనెటీగల పెంపకం సాగిస్తున్నారు.

చైనా, టర్కీ, భారత్, అర్జెంటీనా వంటి దేశాల్లో కృత్రిమంగా తేనెటీగల పెంపకం పెద్దస్థాయిలోనే జరుగుతోంది. గడచిన దశాబ్ద కాలంలో చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా తేనె ఉత్పాదనలో నెమ్మదిగా పెరుగుదల నమోదవుతోంది. చైనా, భారత్, టర్కీ, అర్జెంటీనా వంటి దేశాల్లో పెరుగుదల బాగానే ఉన్నా, అమెరికా, యూరోపియన్‌ దేశాలలో తగ్గుదల నమోదవుతోంది. కేంద్ర ప్రభుత్వం 2017లో ‘మిషన్‌ హనీ’ కార్యక్రమం ప్రారంభించాక భారత్‌లో తేనె ఉత్పాదన క్రమంగా పుంజుకుంటోంది. ఒకవైపు ఉత్పాదన పెరిగినా, ప్లాస్టిక్‌ బెడద వల్ల తేనె నాణ్యత తగ్గుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

తేనె నాణ్యతకు విఘాతం
ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు తేనె ఉత్పాదన నిలకడగా పెరుగుతూనే ఉన్నా, మరోవైపు తేనె నాణ్యత తగ్గుతోంది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల నుంచి సేకరించిన తేనె నమూనాల్లో రకరకాల ప్రమాదకర పదార్థాలు ఉంటున్నట్లు పరీక్షల్లో బయటపడుతున్నాయి. నగరాలకు, పారిశ్రామిక ప్రాంతాలకు చేరువలో ఉన్న తేనెగూళ్ల నుంచి సేకరించే తేనెలో మైక్రోప్లాస్టిక్స్, పురుగుమందులు, యాంటీబయోటిక్స్, భారలోహాల అవశేషాలు చేరి ఉంటున్నట్లు పలు పరీక్షల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. తేనె నాణ్యతపై పలు దేశాలు కఠిన నిబంధనలు పాటిస్తున్నాయి.

నిబంధనల అమలులో లోపాలు ఉన్న దేశాల్లో దొరికే తేనెలో ప్రమాదకర పదార్థాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. తేనెగూళ్లు ఉండే తావుల్లో రసాయనిక కాలుష్యాలను అరికట్టడం, సేకరించిన తేనెను మార్కెట్‌లోకి పంపేముందు కట్టుదిట్టమైన నాణ్యత పరీక్షలు జరపడం వంటి చర్యలు చేపట్టకుంటే, ఆరోగ్యం కోసం తేనె తీసుకునేవారికి చేదు ఫలితాలే మిగులుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement