ముగ్గులోనే ముగ్ధరూపాలు

Sakshi Family Story On Sankranthi Bhogi Muggu

వ్రతం చేసిన ఆండాళ్‌ భోగినాడు రంగనాథుడిలో ఐక్యం అయిందని ప్రతీతి. ధనుర్మాసంలో దాపున ఉన్న కోవెలలో ముగ్గులతోనే ఆధ్యాతిక ఆరాధన చేసింది హైదరాబాద్‌లో స్థిరపడ్డ కన్నడ చిత్రకారిణి లభ్య. ముగ్గులలోనే అందమైన దేవతా మూర్తులను తీర్చిదిద్దడం బాల్యంలో తన తాత వద్ద నేర్చుకున్నానని చెబుతోంది. లభ్య బొమ్మలు సంక్రాంతి కళకు వన్నె తెచ్చాయి.

‘ఇదంతా మా తాతయ్య చెలువయ్య చలువ’ అంది లభ్య తాను వేసిన ముగ్గు మూర్తులను చూపుతూ కొద్దిగా తెలుగు, మరింత కన్నడం భాషల్లో. హైదరాబాద్‌ బాచుపల్లిలోని ఒక గేటెడ్‌ కమ్యూనిటీలో నివసించే లభ్యది బెంగళూరు. ధనుర్మాసం మొదలయ్యాక కమ్యూనిటీలో ఉన్న గుడిలో ఆమె నిత్యం వేసే ముగ్గు బొమ్మలు చుట్టుపక్కల వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక్కో బొమ్మను తీర్చిదిద్దడానికి లభ్య ఏడెనిమిది గంటలు వెచ్చించాల్సి వచ్చింది.

‘మా తాత పేరు చెలువయ్య. ఆయన బెంగుళూరు జ్ఞానభారతి యూనివర్శిటీలో ప్రొఫెసర్‌ గా పని చేసేవారు. దీపావళి, సంక్రాంతి పండుగ సమయాల్లో ఇంటిముందు చక్కని ముగ్గులు రంగులతో వేసేవారు. చిత్రాన్ని జాగ్రత్తగా వేయడం, దాన్ని రంగులతో నింపడం ఆయన వద్దే నేర్చుకున్నా’ అంటుంది లభ్య.

తాత ప్రభావం వల్లే చిన్నప్పటి నుంచి బొమ్మలు గీస్తూ పెరిగిన లభ్య ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తూనే వివిధ రీతుల చిత్రకళని పరిశీలిస్తూ కుంచెకు పదును పెట్టుకుంటూ వచ్చింది. బెంగుళూరులో చిత్రకళ ఉపాధ్యాయినిగా కూడా పని చేసింది. వివాహానంతరం కొన్నాళ్లకి పూర్తి దృష్టి చిత్ర లేఖనం మీద పెట్టే ఉద్దేశ్యంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి గ్వాలియర్‌లోని రాజా మాన్‌సింగ్‌ తోమర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో చిత్రకళను అభ్యసించింది. కాని ఆమె ప్రత్యేకత అద్భుతమైన చిత్రాలను ముగ్గులుగా నేలమీద ఆవిష్కరించడంలో ఉంది. పండుగ సందర్భాల్లో దేవతామూర్తులను, పండగ సందర్భాన్ని రంగుల ముగ్గులుగా చిత్రిస్తుంది.‘ఈ ధనుర్మాసంలో తిరు΄్పావై పాశురాలకు దృశ్యరూపం ఇచ్చాను ముగ్గుల్లో’ అందామె.

వీణలో కూడా డిప్లొమా చేసిన లభ్య వద్ద చిత్రకళ నేర్చుకున్న విద్యార్థులు చాలామందే ఉన్నారు. కేవలం గీతలు రంగులు మాత్రమే కాక ఒక చిత్రాన్ని ప్రేమతో, భావోద్వేగంతో ఎలా అర్థం చేసుకోవాలో, భావనల్ని ఆలోచనలని సంప్రదాయకళగా, మోడర్న్‌ ఆర్ట్‌గా, ఫ్యూజన్‌ ఆర్ట్‌గా ఎలా మలచవచ్చో లభ్య తన విద్యార్థులకు నేర్పిస్తుంది. 2022 ముంబైలో జరిగిన ఇండియా ఆర్ట్‌ ఫెస్టివల్‌లో, బెంగుళూరులో జరిగే ‘చిత్ర సంతె’లో లభ్య చిత్రాలు అమ్ముడు΄ోయాయి. రాజా రవివర్మ చిత్రాలను ఎంతో ప్రతిభావంతంగా లభ్య పునః చిత్రీకరించింది. ఏ కళలో అయినా స్త్రీలు పురోగమించడానికి కుటుంబ బాధ్యతలు కొంత ఆటంకం కల్గిస్తాయని, పురుషులకు ఉన్న సౌకర్యం స్త్రీలకు ఎల్లవేళలా ఉండదంటోంది లభ్య. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top