నమ్మకమే ముఖ్యం కొంచెం నిఘా కూడా..

Sakshi Exclusive Interview With Actress Preethi Nigam, Nagesh Karra

పేరెంటింగ్‌

ప్రీతీ నిగమ్, నగేష్‌ కర్రా ఇద్దరూ టీవీ, సినిమా ఆర్టిస్టులు. వీరి కొడుకు ఆర్యన్‌ కర్రా వరల్డ్‌ రోలర్‌ ఇన్‌లైన్‌ హాకీ 2019కి తెలంగాణ నుంచి పాల్గొన్న ఏకైక ప్లేయర్‌. కూతురు అదితి ‘లా’ చదువుతోంది. భార్య టాలెంట్‌ను ప్రోత్సహించడంతో పాటు కొడుకు అథ్లెటిక్స్‌లో రాణించడానికి వెన్నుదన్నుగా ఉండాలని నగేష్‌ తను చేస్తున్న ఐటీ జాబ్‌ను వదులుకున్నారు. పిల్లలపైన ఎప్పుడూ నమ్మకం ఉంచడంతో పాటు కొద్దిగా నిఘా కూడా అవసరం అంటారు తల్లిగా ప్రీతీ. తల్లిదండ్రులిద్దరూ గ్లామర్‌ ప్రపంచంలో ఉంటూ పిల్లలిద్దరినీ వారికిష్టమైన రంగంలో ప్రోత్సహిస్తున్న ప్రీతీ నిగమ్, నగేష్‌ కర్రా పేరెంటింగ్‌ గురించి అడిగితే ఇలా ఎన్నో విషయాలు పంచుకున్నారు.

యాక్టింగ్, పేరెంటింగ్‌ ఎలా బ్యాలెన్స్‌ చేస్తున్నారు?
నగేష్‌ కర్రా: యాక్టింగ్‌ నా ప్యాషన్‌. మొదట సీరియల్స్‌ లో నటిస్తుండేవాడిని. కార్వి గ్రూప్‌లో ఐటీ జాబ్‌ చేసేవాడిని. ఆర్యన్‌ మూడేళ్ల వయసు నుంచి టీవీలో ఒలంపిక్‌ గేమ్స్‌ వచ్చినప్పుడు చాలా ఆసక్తిగా చూసేవాడు. అది గమనించి స్పోర్ట్స్‌లో ప్రోత్సహించాలనుకున్నాం. అలా, జిమ్నాస్టిక్స్‌ స్కూల్లో జాయిన్‌  చేశాం. బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇప్పించాం. ఎనిమిదేళ్ల వయసులో జిమ్నాస్టిక్స్‌  లో సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. అప్పుడనుకున్నాను జాబ్, యాక్టింగ్‌ అంటూ బిజీగా ఉంటే పిల్లల టాలెంట్‌కి సపోర్ట్‌ ఉండదని, ముఖ్యంగా కొన్నాళ్లు ఆర్యన్‌ వెన్నంటే ఉండటం అవసరం అనుకున్నాను. ఇదే విషయం ప్రీతికి చెప్పాను. మంచి జాబ్‌ వదులుకోవడం ఎందుకు, యాక్టింగ్‌ మానేస్తాను అంది. తనకు నటనలో మంచి టాలెంట్‌ ఉంది. మానుకోవద్దని చెప్పాను. మాది మధ్య తరగతి కుటుంబం. డబ్బు ఇబ్బందులు రాకుండా ఎలా చూసుకోవాలో ఇద్దరం చర్చించుకున్నాం. అన్నీ ఓకే అనుకున్నాక పదేళ్ల క్రితం జాబ్‌కి రిజైన్‌ చేశాను. పాప స్కూల్‌ ఏజ్‌లోనే తన గోల్‌ ఏంటో చెప్పేసింది. అలా తనని ‘లా’ వైపు ప్రోత్సహించాం.

ప్రీతీ నిగమ్‌: 14 ఏళ్ల వయసులోనే ఆర్యన్‌ ఇండియన్‌ ఇన్‌లైన్‌ హాకీ టీమ్‌లో పాల్గొన్నాడు. వాడి కృషి వెనక వాళ్ల నాన్న సపోర్ట్‌ ఎక్కువ. ఇప్పుడంటే పిల్లలు కొద్దిగా పెద్దవారయ్యారు. వాళ్లను వాళ్లు చూసుకోగలరనే ౖధైర్యం మా ఇద్దరికీ వచ్చేసింది. చిన్నప్పుడు కొంచెం కష్టంగానే ఉండేది. మా అమ్మనాన్న ఇద్దరూ టీచర్లుగా చేసి, రిటైర్‌ అయ్యారు. వారితో మేం ఉండటం వల్ల పిల్లలకు మంచి క్రమశిక్షణ అలవడింది. ఆ విధంగా మేం ఎంతో అదృష్టవంతులం.

► ఇద్దరూ బిజీగా ఉంటారు, టైమ్‌ ప్లానింగ్‌ ఎలా ఉంటుంది?
నగేష్‌: ఉదయం ఐదు గంటలకల్లా అందరం నిద్ర లేస్తాం. ఆర్యన్‌ మా కన్నా ఎక్కువ కష్టపడతాడు. ఉదయం 4:30 కి నిద్రలేస్తే తిరిగి పడుకోవడానికి రాత్రి 11 అవుతుంది. రోజూ ఉదయం ఐదారు కిలోమీటర్లు జాగింగ్‌ చేస్తాడు. తర్వాత జిమ్‌. ఆ తర్వాత కాలేజీ. ఇంటికి వస్తూనే తిరిగి 4కి మళ్లీ ప్రాక్టీస్‌కి వెళతాడు.

ప్రీతి: ముందే రాత్రే షెడ్యూల్‌ ప్రిపేర్‌ చేసుకుంటాను. దానిని బట్టి పనులు అవుతూ ఉంటాయి. ఇంట్లో అందరం బిజీ అవడంతో పిల్లలు వారి పనులు వారు చేసుకునేలా అలవాటయ్యారు.

► పిల్లలకు సంబంధించిన విషయాల్లో వారి ఫుడ్‌ హ్యాబిట్స్‌ ప్రధానంగా ఉంటాయి. వీటి గురించి..
నగేష్‌: ఆర్యన్‌ స్పోర్ట్స్‌ వైపుగా ఉండటం వల్ల ఇంట్లో అందరికీ పోషకాహారం పట్ల అవగాహన ఉంది. ఆర్యన్‌ డైట్‌ చార్ట్‌ ఫాలో అవుతాడు. ఎనర్జీ లెవల్స్‌ పడిపోకుండా  బ్యాలెన్స్‌ చేస్తాడు.

ప్రీతి: చిన్నప్పుడు పిల్లలిద్దరూ జంక్‌ఫుడ్‌ తినేవాళ్లు. కాఫీ, టీ, కూల్‌ డ్రింక్స్‌ మూడేళ్ల నుంచి ఇద్దరూ మానేశారు వాటి సైడ్‌ ఎఫెక్ట్‌ అర్ధమై. ఆర్యన్‌ తన టీమ్‌ లో మిగతా వారికి ఫుడ్‌ విషయంలోనూ  రోల్‌ మోడల్‌గా ఉండాలని  చెబుతుంటాడు.

► అమ్మాయి.. అబ్బాయి అనే తేడాలు చూపడం గురించి..
ప్రీతి: ‘అమ్మాయివి నువ్వు ఈ పనులే చేయాలి, అబ్బాయి ఫలానా పనులే చేయాలి’ అని చెప్పను. మా అమ్మనాన్నలు కూడా అలాంటి తేడాలు చూపలేదు. కానీ, అక్కను బాగా చూసుకోవాలని మాత్రం ఆర్యన్‌కి చెబుతుంటాను.

నగేష్‌: వేరు వేరుగా చూడాలనే ఆలోచన మా పెద్దల నుంచే రాలేదనుకుంటాను. సేవా గుణంలోనూ ఇద్దరూ ముందుంటారు. ఈ గుణం కూడా మా పెద్దల నుంచి వచ్చిందనుకుంటాం.

► మనీ మేనేజ్‌మెంట్‌ గురించి పిల్లలకు సూచనలు ఏమైనా..?
నగేష్‌:
మా కష్టాన్ని పిల్లలిద్దరూ అర్ధం చేసుకుంటారు. ఆర్యన్‌ స్పోర్ట్‌ కొంచెం ఖర్చుతో కూడుకున్నదే. నేషనల్‌ ఇంటర్నేషనల్‌ లెవల్స్‌కి వెళ్లాలంటే రాష్ట్రాలు, దేశాలు దాటాలి. కానీ, అన్నీ బడ్జెట్‌లోనే చూసుకుంటాడు. వెళ్లాల్సిన చోటు, టికెట్, రూమ్‌ బుకింగ్‌ అన్నీ మ్యానేజ్‌ చేసుకుంటాడు. ఈ గేమ్‌కి గవర్నమెంట్‌ ఫండింగ్‌ లేకపోవడంతో వాళ్ల టీమ్‌లో ఉన్నవారితో ఖర్చులు కలిసి వచ్చేలా షేర్‌ చేసుకుంటాడు. దీనివల్ల ఖర్చు ఎంత, అమ్మనాన్నలు ఎలా కష్టపడుతున్నారు అనే విషయాల మీద  అవగాహన వచ్చేసింది. అదితి కూడా అంతే. చాలా బాగా అర్థం చేసుకుంటుంది.

ప్రీతి: మా పిల్లలు రూపాయి ఖర్చు చేయాల్సి వచ్చినా మాకు చెప్పనిదే చేయరు. పిల్లల ముందు డబ్బు విషయాలు కూడా చర్చకు వస్తాయి. ఖర్చు పెట్టాలనుకునే ప్రతీ రూపాయి విలువ తెలుసుకోవాలని చెబుతుంటాను.
► స్పోర్ట్స్‌ .. చదువు బ్యాలెన్స్‌ ఎలా?
ప్రీతి: పిల్లలిద్దరూ చదువులో ముందుంటారు. ఆర్యన్‌ గేమ్స్‌ అంటూ వేరే స్టేట్స్‌కి వెళ్లినా, వస్తూనే క్లాస్‌కి వెళ్లిపోతాడు. వాడిని వాళ్ల లెక్చరర్లు బాగా అభిమానిస్తారు. క్రమశిక్షణ గురించి చెప్పడం కన్నా మనం ఆచరిస్తూ పిల్లలను ఆచరించేలా చేయాలనేది మా పద్ధతి. కొంతమంది టీనేజ్‌ అమ్మాయిలు, అబ్బాయిలు యాక్టింగ్‌ పీల్డ్‌లోకి వస్తాం అంటుంటారు. అలాంటప్పుడు ముందు డిగ్రీ పూర్తి చే యండి, దాంతో పాటు ఏదైనా ఒక అంశంలో నైపుణ్యం సాధించమని చెబుతాను. అదితి లా చేస్తుంటే.. ఆర్యన్‌ బిబిఎ చేస్తున్నాడు.

నగేష్‌: టాలెంట్‌ ఉండాలి. దీంతో పాటు చదువూ ఉండాలి. అప్పుడే, మరింత ఉన్నతంగా ఎదగలరు. స్పోర్ట్స్‌లో ఉన్నాం కదా అని చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకోవాలి. లక్కీగా ఆర్యన్‌కి చదువుపై మంచి ఇంట్రస్ట్‌ ఉంది. వాళ్ల ఇండియన్‌ టీమ్‌ కెప్టెన్‌ డిఎస్‌పి కూడా. దీంతో చదువులో కూడా రాణించాలనేది ఆర్యన్‌ పట్టుదల. పిల్లలు బయటి ప్రపంచాన్ని కూడా చూస్తుంటారు కాబట్టి, వారేం కావాలో కూడా వారే డిసైడ్‌ చేసుకుంటారు. పేరెంట్స్‌గా మన గైడెన్స్, సపోర్ట్‌ ఉంటే చాలు.

► టీనేజ్‌ పిల్లల తల్లిదండ్రులుగా మీ పెంపకం?
నగేష్‌: నేను కొంచెం స్ట్రిక్ట్‌గానే ఉంటాను. వాళ్లమ్మ దగ్గర మాత్రం గారాలు పోతుంటారు. ఆర్యన్‌ది చాలా సాఫ్ట్‌ నేచర్‌. చెప్పింది అర్ధం చేసుకుంటాడు. ఇప్పుడు ఆర్యన్‌ వయసు 18. అదితి టీనేజ్‌ కంప్లీట్‌ అయ్యింది. వాడిలో నచ్చే మరో గుణం అహంకారం అస్సలు చూపకపోవడం. ఇది వాళ్ల అమ్మను చూసి నేర్చుకున్నాడని అనిపిస్తుంది నాకు. ప్రీతికి యాక్టింగ్‌లో నేషనల్‌ అవార్డులూ వచ్చాయి. అమితాబచ్చన్, శ్యామ్‌బెనగల్‌... వంటి వారితో వర్క్‌ చేసింది. అయినా తను ఎక్కడా అహం చూపదు. పెద్దలను గమనిస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు కూడా అలాగే ఉంటారు. పిల్లల కెరియర్‌కు ఉపయోగపడేలా వారి సబ్జెక్ట్స్‌కు సంబంధించిన చర్చలు కూడా ఇంట్లో ఉంటుంటాయి.

ప్రీతి: నా చిన్నతనంలో అమ్మనాన్నలు, ఇప్పుడు నగేష్‌ నాకు ఫ్రీడమ్‌ ఇచ్చారు. నా మీద నమ్మకం ఉంచారు.  అదే నమ్మకం నేను పిల్లల మీద ఉంచుతాను. స్వేచ్ఛను ఇస్తూనే గమనింపు కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. ఒకసారి వదిలేయాలి. ఇంకొసారి తెలియజేసేలా చెప్పాలి. పట్టుకొని పీడించి, వాదిస్తే మొండితనం మొదలవుతుంది. ఎనిమిదేళ్ల వయసు నుంచి ఆర్యన్‌ రోజూ గాయత్రి చేస్తాడు. దీని వల్ల ఆధ్యాత్మిక భావన కూడా ఎక్కువే. కొంచెం కామ్‌ మెంటాలిటీ. అక్కాతమ్ముడికి షేరింగ్, కేరింగ్‌ కూడా ఎక్కువే కాబట్టి ఈజీగా బ్యాలెన్స్‌ అవుతుంటుంది. అబ్బాయిలు ముందు ఇంట్లో ఆడవాళ్లను గౌరవిస్తే బయటా అలాగే ఉంటారనే విషయాలు మాత్రం తరచూ చెబుతుంటాను.

– సంభాషణ: నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top