breaking news
preeti nigam
-
వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నటి ప్రీతినిగమ్
కొమ్మాది: రుషికొండలో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం సీరియల్ నటి ప్రీతినిగమ్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుమల తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనుభూతి కలిగిందన్నారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్‌లో బిజీగా ఉన్నానని, పాపే నా జీవనజ్యోతి సీరియల్‌కు మంచి గుర్తింపు వస్తుందని ఆమె తెలిపారు. -
నమ్మకమే ముఖ్యం కొంచెం నిఘా కూడా..
ప్రీతీ నిగమ్, నగేష్ కర్రా ఇద్దరూ టీవీ, సినిమా ఆర్టిస్టులు. వీరి కొడుకు ఆర్యన్ కర్రా వరల్డ్ రోలర్ ఇన్లైన్ హాకీ 2019కి తెలంగాణ నుంచి పాల్గొన్న ఏకైక ప్లేయర్. కూతురు అదితి ‘లా’ చదువుతోంది. భార్య టాలెంట్‌ను ప్రోత్సహించడంతో పాటు కొడుకు అథ్లెటిక్స్‌లో రాణించడానికి వెన్నుదన్నుగా ఉండాలని నగేష్ తను చేస్తున్న ఐటీ జాబ్‌ను వదులుకున్నారు. పిల్లలపైన ఎప్పుడూ నమ్మకం ఉంచడంతో పాటు కొద్దిగా నిఘా కూడా అవసరం అంటారు తల్లిగా ప్రీతీ. తల్లిదండ్రులిద్దరూ గ్లామర్ ప్రపంచంలో ఉంటూ పిల్లలిద్దరినీ వారికిష్టమైన రంగంలో ప్రోత్సహిస్తున్న ప్రీతీ నిగమ్, నగేష్ కర్రా పేరెంటింగ్ గురించి అడిగితే ఇలా ఎన్నో విషయాలు పంచుకున్నారు. యాక్టింగ్, పేరెంటింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? నగేష్ కర్రా: యాక్టింగ్ నా ప్యాషన్. మొదట సీరియల్స్ లో నటిస్తుండేవాడిని. కార్వి గ్రూప్‌లో ఐటీ జాబ్ చేసేవాడిని. ఆర్యన్ మూడేళ్ల వయసు నుంచి టీవీలో ఒలంపిక్ గేమ్స్ వచ్చినప్పుడు చాలా ఆసక్తిగా చూసేవాడు. అది గమనించి స్పోర్ట్స్‌లో ప్రోత్సహించాలనుకున్నాం. అలా, జిమ్నాస్టిక్స్ స్కూల్లో జాయిన్ చేశాం. బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇప్పించాం. ఎనిమిదేళ్ల వయసులో జిమ్నాస్టిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించాడు. అప్పుడనుకున్నాను జాబ్, యాక్టింగ్ అంటూ బిజీగా ఉంటే పిల్లల టాలెంట్‌కి సపోర్ట్ ఉండదని, ముఖ్యంగా కొన్నాళ్లు ఆర్యన్ వెన్నంటే ఉండటం అవసరం అనుకున్నాను. ఇదే విషయం ప్రీతికి చెప్పాను. మంచి జాబ్ వదులుకోవడం ఎందుకు, యాక్టింగ్ మానేస్తాను అంది. తనకు నటనలో మంచి టాలెంట్ ఉంది. మానుకోవద్దని చెప్పాను. మాది మధ్య తరగతి కుటుంబం. డబ్బు ఇబ్బందులు రాకుండా ఎలా చూసుకోవాలో ఇద్దరం చర్చించుకున్నాం. అన్నీ ఓకే అనుకున్నాక పదేళ్ల క్రితం జాబ్‌కి రిజైన్ చేశాను. పాప స్కూల్ ఏజ్‌లోనే తన గోల్ ఏంటో చెప్పేసింది. అలా తనని ‘లా’ వైపు ప్రోత్సహించాం. ప్రీతీ నిగమ్: 14 ఏళ్ల వయసులోనే ఆర్యన్ ఇండియన్ ఇన్లైన్ హాకీ టీమ్‌లో పాల్గొన్నాడు. వాడి కృషి వెనక వాళ్ల నాన్న సపోర్ట్ ఎక్కువ. ఇప్పుడంటే పిల్లలు కొద్దిగా పెద్దవారయ్యారు. వాళ్లను వాళ్లు చూసుకోగలరనే ౖధైర్యం మా ఇద్దరికీ వచ్చేసింది. చిన్నప్పుడు కొంచెం కష్టంగానే ఉండేది. మా అమ్మనాన్న ఇద్దరూ టీచర్లుగా చేసి, రిటైర్ అయ్యారు. వారితో మేం ఉండటం వల్ల పిల్లలకు మంచి క్రమశిక్షణ అలవడింది. ఆ విధంగా మేం ఎంతో అదృష్టవంతులం. ► ఇద్దరూ బిజీగా ఉంటారు, టైమ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది? నగేష్: ఉదయం ఐదు గంటలకల్లా అందరం నిద్ర లేస్తాం. ఆర్యన్ మా కన్నా ఎక్కువ కష్టపడతాడు. ఉదయం 4:30 కి నిద్రలేస్తే తిరిగి పడుకోవడానికి రాత్రి 11 అవుతుంది. రోజూ ఉదయం ఐదారు కిలోమీటర్లు జాగింగ్ చేస్తాడు. తర్వాత జిమ్. ఆ తర్వాత కాలేజీ. ఇంటికి వస్తూనే తిరిగి 4కి మళ్లీ ప్రాక్టీస్‌కి వెళతాడు. ప్రీతి: ముందే రాత్రే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటాను. దానిని బట్టి పనులు అవుతూ ఉంటాయి. ఇంట్లో అందరం బిజీ అవడంతో పిల్లలు వారి పనులు వారు చేసుకునేలా అలవాటయ్యారు. ► పిల్లలకు సంబంధించిన విషయాల్లో వారి ఫుడ్ హ్యాబిట్స్ ప్రధానంగా ఉంటాయి. వీటి గురించి.. నగేష్: ఆర్యన్ స్పోర్ట్స్ వైపుగా ఉండటం వల్ల ఇంట్లో అందరికీ పోషకాహారం పట్ల అవగాహన ఉంది. ఆర్యన్ డైట్ చార్ట్ ఫాలో అవుతాడు. ఎనర్జీ లెవల్స్ పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తాడు. ప్రీతి: చిన్నప్పుడు పిల్లలిద్దరూ జంక్‌ఫుడ్ తినేవాళ్లు. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ మూడేళ్ల నుంచి ఇద్దరూ మానేశారు వాటి సైడ్ ఎఫెక్ట్ అర్ధమై. ఆర్యన్ తన టీమ్ లో మిగతా వారికి ఫుడ్ విషయంలోనూ రోల్ మోడల్‌గా ఉండాలని చెబుతుంటాడు. ► అమ్మాయి.. అబ్బాయి అనే తేడాలు చూపడం గురించి.. ప్రీతి: ‘అమ్మాయివి నువ్వు ఈ పనులే చేయాలి, అబ్బాయి ఫలానా పనులే చేయాలి’ అని చెప్పను. మా అమ్మనాన్నలు కూడా అలాంటి తేడాలు చూపలేదు. కానీ, అక్కను బాగా చూసుకోవాలని మాత్రం ఆర్యన్‌కి చెబుతుంటాను. నగేష్: వేరు వేరుగా చూడాలనే ఆలోచన మా పెద్దల నుంచే రాలేదనుకుంటాను. సేవా గుణంలోనూ ఇద్దరూ ముందుంటారు. ఈ గుణం కూడా మా పెద్దల నుంచి వచ్చిందనుకుంటాం. ► మనీ మేనేజ్మెంట్ గురించి పిల్లలకు సూచనలు ఏమైనా..? నగేష్: మా కష్టాన్ని పిల్లలిద్దరూ అర్ధం చేసుకుంటారు. ఆర్యన్ స్పోర్ట్ కొంచెం ఖర్చుతో కూడుకున్నదే. నేషనల్ ఇంటర్నేషనల్ లెవల్స్‌కి వెళ్లాలంటే రాష్ట్రాలు, దేశాలు దాటాలి. కానీ, అన్నీ బడ్జెట్లోనే చూసుకుంటాడు. వెళ్లాల్సిన చోటు, టికెట్, రూమ్ బుకింగ్ అన్నీ మ్యానేజ్ చేసుకుంటాడు. ఈ గేమ్‌కి గవర్నమెంట్ ఫండింగ్ లేకపోవడంతో వాళ్ల టీమ్‌లో ఉన్నవారితో ఖర్చులు కలిసి వచ్చేలా షేర్ చేసుకుంటాడు. దీనివల్ల ఖర్చు ఎంత, అమ్మనాన్నలు ఎలా కష్టపడుతున్నారు అనే విషయాల మీద అవగాహన వచ్చేసింది. అదితి కూడా అంతే. చాలా బాగా అర్థం చేసుకుంటుంది. ప్రీతి: మా పిల్లలు రూపాయి ఖర్చు చేయాల్సి వచ్చినా మాకు చెప్పనిదే చేయరు. పిల్లల ముందు డబ్బు విషయాలు కూడా చర్చకు వస్తాయి. ఖర్చు పెట్టాలనుకునే ప్రతీ రూపాయి విలువ తెలుసుకోవాలని చెబుతుంటాను. ► స్పోర్ట్స్ .. చదువు బ్యాలెన్స్ ఎలా? ప్రీతి: పిల్లలిద్దరూ చదువులో ముందుంటారు. ఆర్యన్ గేమ్స్ అంటూ వేరే స్టేట్స్‌కి వెళ్లినా, వస్తూనే క్లాస్‌కి వెళ్లిపోతాడు. వాడిని వాళ్ల లెక్చరర్లు బాగా అభిమానిస్తారు. క్రమశిక్షణ గురించి చెప్పడం కన్నా మనం ఆచరిస్తూ పిల్లలను ఆచరించేలా చేయాలనేది మా పద్ధతి. కొంతమంది టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు యాక్టింగ్ పీల్డ్లోకి వస్తాం అంటుంటారు. అలాంటప్పుడు ముందు డిగ్రీ పూర్తి చే యండి, దాంతో పాటు ఏదైనా ఒక అంశంలో నైపుణ్యం సాధించమని చెబుతాను. అదితి లా చేస్తుంటే.. ఆర్యన్ బిబిఎ చేస్తున్నాడు. నగేష్: టాలెంట్ ఉండాలి. దీంతో పాటు చదువూ ఉండాలి. అప్పుడే, మరింత ఉన్నతంగా ఎదగలరు. స్పోర్ట్స్‌లో ఉన్నాం కదా అని చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. లక్కీగా ఆర్యన్‌కి చదువుపై మంచి ఇంట్రస్ట్ ఉంది. వాళ్ల ఇండియన్ టీమ్ కెప్టెన్ డిఎస్పి కూడా. దీంతో చదువులో కూడా రాణించాలనేది ఆర్యన్ పట్టుదల. పిల్లలు బయటి ప్రపంచాన్ని కూడా చూస్తుంటారు కాబట్టి, వారేం కావాలో కూడా వారే డిసైడ్ చేసుకుంటారు. పేరెంట్స్‌గా మన గైడెన్స్, సపోర్ట్ ఉంటే చాలు. ► టీనేజ్ పిల్లల తల్లిదండ్రులుగా మీ పెంపకం? నగేష్: నేను కొంచెం స్ట్రిక్ట్‌గానే ఉంటాను. వాళ్లమ్మ దగ్గర మాత్రం గారాలు పోతుంటారు. ఆర్యన్‌ది చాలా సాఫ్ట్ నేచర్. చెప్పింది అర్ధం చేసుకుంటాడు. ఇప్పుడు ఆర్యన్ వయసు 18. అదితి టీనేజ్ కంప్లీట్ అయ్యింది. వాడిలో నచ్చే మరో గుణం అహంకారం అస్సలు చూపకపోవడం. ఇది వాళ్ల అమ్మను చూసి నేర్చుకున్నాడని అనిపిస్తుంది నాకు. ప్రీతికి యాక్టింగ్‌లో నేషనల్ అవార్డులూ వచ్చాయి. అమితాబచ్చన్, శ్యామ్‌బెనగల్... వంటి వారితో వర్క్ చేసింది. అయినా తను ఎక్కడా అహం చూపదు. పెద్దలను గమనిస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు కూడా అలాగే ఉంటారు. పిల్లల కెరియర్‌కు ఉపయోగపడేలా వారి సబ్జెక్ట్స్‌కు సంబంధించిన చర్చలు కూడా ఇంట్లో ఉంటుంటాయి. ప్రీతి: నా చిన్నతనంలో అమ్మనాన్నలు, ఇప్పుడు నగేష్ నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. నా మీద నమ్మకం ఉంచారు. అదే నమ్మకం నేను పిల్లల మీద ఉంచుతాను. స్వేచ్ఛను ఇస్తూనే గమనింపు కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. ఒకసారి వదిలేయాలి. ఇంకొసారి తెలియజేసేలా చెప్పాలి. పట్టుకొని పీడించి, వాదిస్తే మొండితనం మొదలవుతుంది. ఎనిమిదేళ్ల వయసు నుంచి ఆర్యన్ రోజూ గాయత్రి చేస్తాడు. దీని వల్ల ఆధ్యాత్మిక భావన కూడా ఎక్కువే. కొంచెం కామ్ మెంటాలిటీ. అక్కాతమ్ముడికి షేరింగ్, కేరింగ్ కూడా ఎక్కువే కాబట్టి ఈజీగా బ్యాలెన్స్ అవుతుంటుంది. అబ్బాయిలు ముందు ఇంట్లో ఆడవాళ్లను గౌరవిస్తే బయటా అలాగే ఉంటారనే విషయాలు మాత్రం తరచూ చెబుతుంటాను. – సంభాషణ: నిర్మలారెడ్డి -
నా జీవితమే ఓ పుస్తకం
బుల్లితెర నటి ప్రీతినిగమ్ ‘సంతోషం’, ‘స్టూడెంట్ నంబర్-1’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఖ్యాతిగాంచిన ప్రీతినిగమ్‌ను గుర్తుపట్టారా? వెండితెర కంటే బుల్లితెరపై తళుక్కున మెరిసిన తార ఆమె. అద్భుతమైన పాత్రలతో మహిళాభిమానులను సంపాదించుకున్న ప్రీతి తన జీవితమే ఒక పుస్తకం అంటున్నారు. కౌతవరంలో బుధవారం జరిగిన లఘు చిత్రాల షూటింగ్‌కు వచ్చిన ఆమె కొద్దిసేపు ‘సాక్షి’తో మాట్లాడారు. - కౌతవరం (గుడ్లవల్లేరు) తెలుగులో మీకు పేరు తెచ్చిన సీరియల్స్..? కస్తూరి, రుతురాగాలు, ఆడది, కావ్యాంజలి, ఎండమావులు, చక్రవాకం, చంద్రముఖి, శ్రావణ సమీరాలు, స్వాతి చినుకులు. సాక్షి : మీ జీవితంలో సాధించిన విజయాలు? ప్రీతి : మొదట్లో నాకు ఈత రాదు. 30ఏళ్ల వయసులో నేర్చుకున్నా. గుర్రపు స్వారీ నేర్చుకోవాలని ఉంది. వంట, ఇంటి పనులు కూడా అందరి మహిళల్లా చేస్తాను. న్యూస్‌రీడర్‌గా కూడా పనిచేశాను. లండన్, మారిషస్, పారిస్, యూఎస్ఏ వంటి దేశాల్లో నృత్యంలో వేలాది ప్రదర్శనలు ఇచ్చాను. విద్యార్థి దశలో ఎన్సీసీ, ఫొటోగ్రఫీ, టీటీసీలో కూడా శిక్షణ పొందాను. సాక్షి : సీరియల్స్‌లో లేడీ విలన్‌గా నటించడంపై మీ స్పందన.. ప్రీతి : ప్రేక్షకులు నన్ను తిట్టుకుంటేనే నేను బాగా నటించినట్లు. సాక్షి : మీ కుటుంబ నేపథ్యం ఏమిటీ? ప్రీతి : మాది హైదరాబాద్. అమ్మానాన్న ఇద్దరూ ఉపాధ్యాయులే. భర్త నగేష్‌ది అమలాపురం. ఆయన కూడా నాతో పాటు సీరియల్స్‌లో నటిస్తున్నారు. పాప అతిథిశ్రీ, బాబు ఆర్యన్. సాక్షి : బుల్లితెరలోకి ఎలా అడుగుపెట్టారు. ప్రీతి : నేను డ్యాన్సర్‌ని. సీరియల్స్‌లో నటులకు కూచిపూడి, కథక్, ఫోక్ డ్యాన్సులపై శిక్షణ ఇచ్చేదాన్ని. నా కళ్లు పెద్దవిగా ఉంటాయని సీరియల్స్‌లో నటించమని అడిగారు. తొలిసారిగా 1989లో ‘అంబేద్కర్ డాక్యుమెంటరీ’లో బాల్యంలో ఉన్న అంబేద్కర్‌కు అత్తగా నటించా. సాక్షి : డ్యాన్స్‌లో మీ గురువులు ఎవరు? ప్రీతి : కూచిపూడిలో అనిల్‌కుమార్, కథక్ ఏవీ శ్రీధర్ దగ్గర నేర్చుకున్నాను. సాక్షి : ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్‌లో నటించారు? ప్రీతి : వందకుపైగానే. తొలి డైలీ సీరియల్ ‘రుతురాగాలు’. అప్పట్లో హిందీ సీరియల్లో కూడా చేశాను. సాక్షి : తొలి సినిమా? ప్రీతి : డెరైక్టర్ శ్యామ్‌బెనగల్‌తో నటించాలని ప్రతి బాలివుడ్ నటికీ ఉంటుంది. ఆయన డెరైక్షన్‌లో 20ఏళ్ల క్రితమే హిందీ ఆర్ట్ ఫిల్మ్‌లో నటించా. హరీబలీ, వెల్డనబ్బా, సంక్రాంతి హిందీ సినిమాల్లో నటించాను. తెలుగులో నా మొదటి సినిమా ‘స్టూడెంట్ నంబరు 1’ సాక్షి : ఇంకా ఏయే సినిమాలు చేశారు.. ప్రీతి : సంతోషం, శ్రీరామ్, ఔను వాళ్లిద్దరూ ఇష్ట పడ్డారు, సై, కబడ్డీ కబడ్డీ, ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాల్లో నటించా. ఉర్దూలో ఇటీవల నటించిన ‘ఇన్కీ ఐసీకీతైసీ’ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ నెల 14న స్టెప్నీ అనే మరో సినిమా విడుదల కానుంది. అలాగే, ‘ఐలమ్మ’ పేరిట తెలంగాణలో ఓ సందేశాత్మక రియల్ స్టోరీతో సినిమా విడుదలైంది. సాక్షి : కొత్తనటులకు మీరిచ్చే సందేశం? ప్రీతి : అబద్ధంలో కాకుండా నిజంలో బతకాలి. సంస్కృతీ సంప్రదాయాల్ని మట్టు పెట్టే విధంగా నాగరికత పేరిట విచ్చలవిడిగా మారకూడదు. -
తెలంగాణ వీరవనిత పాత్రలో నటించడం నా అదృష్టం
హుజూర్నగర్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలు, ఆత్మ బలిదానాల ఇతివృత్తంతో నిర్మిస్తున్న జయహో తెలంగాణ సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు సినీనటి ప్రీతి నిగమ్ అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్‌లో జరిగిన ‘త్యాగాల వీణ- జయహో తెలంగాణ’ సినిమా షూటింగ్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసిన డీఎస్పీ నళిని పాత్రలో తాను నటించడం ఆనందంగా ఉందన్నారు. పముఖ దర్శకుడు ఎం.రవికుమార్ మొదటిసారిగా చిత్రీకరించిన ‘చాకలి అయిలమ్మ’ సినిమాలో వీరనారి అయిలమ్మ పాత్రలో తాను నటించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కవులు, కళాకారులు, నటీనటులకు కొదవ లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వారిని ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నటీనటులతో ఈ ప్రాంతంలోనే రూపుదిద్దుకుంటున్న సినిమాలను తెలంగాణ ప్రజలు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ప్రస్తుత తరుణంలో భావి తరాలకు రాష్ట్ర చరిత్రను తెలియజేసేందుకు ఇటువంటి సినిమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆమె వెంట సినీ దర్శకుడు ఎం.రవికుమార్, నిర్మాత సతీష్‌బాబు, నటులు శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.