Jasmit Singh Arora మామిడి మొక్కలు ఉచితం! | Sagubadi Mango plants at free of cost where check here | Sakshi
Sakshi News home page

Jasmit Singh Arora మామిడి మొక్కలు ఉచితం!

Jun 11 2025 3:04 PM | Updated on Jun 11 2025 3:04 PM

Sagubadi Mango plants at free of cost where check here

మామిడి సీజన్‌లో బోలెడన్ని మామిడి విత్తనాలు కనిపిస్తాయి. అయితే, వాటిని వృథాగా పోనీయకుండా రైతులకు ఉపయోగపడేలా సద్వినియోగం చేద్దామని కోల్‌కత్తా నగరానికి చెందిన డాక్టర్‌ జస్మిత్‌ సింగ్‌ అరోరా (Jasmit Singh Arora)  నిర్ణయించుకొని ఆ దిశగా స్ఫూర్తిదాయక కృషి చేస్తున్నారు. నష్టదాయకంగా మారిన వరి వంటి పంటలను ఏటేటా రసాయనిక పద్ధతుల్లో పండించి నష్టపోతున్న రైతులు దీర్ఘకాలిక పండ్ల తోటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించుకుంటే జీవితం బాగుపడుతుందని ఆయన సూచిస్తున్నారు.  

చదవండి: బ్యాంకు ఉద్యోగం వదిలేసి, ఆధునిక సేద్యం : కోట్లలో ఆదాయం

డా. అరోరా వైద్యవృత్తి నిపుణుడు అయినప్పటికీ వ్యాపారవేత్తగా మారారు. ఐటి, ఫార్మా రంగాల్లో మూడు దశాబ్దాలుగా కృషి చేసి ఉన్నత స్థాయికి ఎదిగారు. ‘గుట్లి మాన్‌ ఆఫ్‌ ఇండియా’ (Gutli Man of India) గా పేరుగాంచారు. ఎంత ఎదిగినా మనసులో ఏదో వెలితి. ప్రజలకు, పర్యావరణానికి ఉపయోగపడే పనులు చేస్తే ఈ వెలితి తీరుతుందని భావించారు. గ్రామీణ  ప్రాంతాల్లో పర్యటిస్తూ వృద్ధ రైతులు దశాబ్దాలుగా వరి సాగు చేస్తూ నానా బాధలు పడుతుండటం గమనించారు. వరి సాగుతో చాలీ చాలని ఆదాయంతో యాతన పడేకన్నా పండ్ల సాగు చేపడితే రైతుల భవిష్యత్తు బాగుంటుందని భావించారు.  

ఇదీ చదవండి: పట్టుచీరలపై నూనె మరకా? ఎప్పటికీ కొత్తవాటిలా మెరవాలంటే!

2019 నుంచి అనేక రకాల పండ్ల మొక్కలు పెంచి రైతులకు ఉచితంగా ఇస్తున్నారు. ఆ క్రమంలో ఎక్కువ ఆదాయం వచ్చే మామిడి మొక్కలను పెంచి, రైతులకు పంచిపెట్టాలని గత ఏడాది తలపెట్టారు. మామిడి పండ్లు తింటున్నారా అయితే విత్తనాలు మాకివ్వండి అని కోరుతూ గత ఏడాది అతని కుమార్తె ఒక వీడియో చేసి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘ఆ వీడియో వైరల్‌ అయ్యింది. అనూహ్యమైన ఒక అద్భుతమే జరిగింది. దేశం నలుమూలల నుంచి ఏకంగా 11 లక్షల విత్తనాలు వచ్చిపడ్డాయి! ఆ దెబ్బకు ఆయనకు ‘గుట్లిస్‌ మాన్‌’ అని పేరు పడిపోయింది. గుట్లిస్‌ అంటే మామిడి విత్తనాలు అని అర్థం. ఈ విత్తనాలతో నాలుగైదు అడుగుల చెట్లు పెంచి, లంగ్డ లేదా గులాబ్‌ ఖాస్‌ వంటి రకాలతో గ్రాఫ్టింగ్‌ చేసి రైతులకు పంచుతాను అంటున్నారు డా. జస్మిత్‌ సింగ్‌ అరోరా.
 

Advertisement
 
Advertisement
Advertisement