
సెప్టెంబరు 28 భగత్ సింగ్ జయంతి
మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆశయాలను చంపలేరని చాటిచెప్పిన విప్లవ వీరుడు సర్దార్ భగత్‌సింగ్ (Bhagat Singh). ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిల్చి, స్వరాజ్య సాధన పోరాటంలో చిరు ప్రాయంలోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడు. ఆయన పేరు వింటే చాలు యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది.
1907 సెప్టెంబర్ 28న నేడు పాకిస్తాన్‌లో ఉన్న లాహోర్ సమీపంలోని ఒక గ్రామంలో భగత్ సింగ్ జన్మించారు. రష్యాలో మాదిరిగా భారతదేశంలో కూడా సోష లిస్టు రాజ్యం, సమసమాజం ఏర్పడాలని భావించారు. జైలుకు వెళ్లడానికి ముందూ, జైల్లో ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఆయన విస్తృతంగా మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేసి... మారు పేర్లతో పత్రికలకు రహస్యంగా వ్యాసాలు రాశారు. తన వ్యాసాల్లో ఆయన మతతత్వ ప్రమాదం గురించి దూరదష్టితో కచ్చితమైన హెచ్చరిక చేశారు. మతవాదుల పట్ల ఉదాసీనత ప్రమాదకరం అని బోధించారు. తనకు గురు తుల్యుడు, తండ్రి సమానులైన లాలా లజపత్ రాయ్ ‘హిందూ మహాసభ’కు అనుకూలంగా మారినప్పుడు ఆయన ఘాటుగా విమర్శించారు. భగత్‌సింగ్ కార్య కలాపాలపై లాలా కూడా విరుచుకు పడ్డారు. నన్ను లెనిన్ లా మార్చడానికి భగత్‌సింగ్ ప్రయత్నిస్తున్నాడనీ, అతను రష్యన్ ఏజెంట్ అనీ నిందించారు. అయినప్పటికీ లాలాను బ్రిటీష్ పోలీసులు కొట్టి చంపడాన్ని భగత్‌సింగ్ సహించలేదు. ప్రతిగా బ్రిటిష్ పోలీస్ అధికారిని తుపాకీతో కాల్చి చంపారు.

‘విప్లవం అంటే బాంబులు, తుపాకుల సంస్కృతి కాదు. పరిస్థితుల్లో మార్పు తేవడమనే ఒక న్యాయమైన ప్రణాళికపై ఆధారపడి జరగాలి’ అంటూ వివరించారు. మతతత్వం పట్ల ఆనాడు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల పట్ల భగత్ సింగ్ అసమ్మతి వ్యక్తం చేశారు. ఒక మతానికి చెందిన ప్రజలు పరస్పరం ఇతర మతస్థు లను శత్రువులుగా భావిస్తున్నారనీ, రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేయడమే దీనికి పరిష్కారం అనీ, మతం వ్యక్తిగతమైన విషయం కాబట్టి దానిలో ఎవరూ జోక్యం చేసుకోకూడదనీ భగత్‌సింగ్ అన్నారు. మతతత్వాన్ని నిర్మూ లించడానికి ఏకైక మార్గం వర్గచైతన్యమే అని అన్నారు. ‘పెంపుడు కుక్కను ఒళ్లో కూర్చోబెట్టుకుంటాం. కానీ, సాటిమనిషిని ముట్టుకుంటే మైలపడిపోతాం. ఎంత సిగ్గుచేటు?’ అని ‘అఛూత్ కా సవాల్’ (అంటరానితనం సమస్య) అనే వ్యాసంలో భగత్ సింగ్ ప్రస్తావించారు. సంకుచిత స్వపక్ష దురభిమానులను భగత్‌సింగ్ ప్రజల శత్రువుగా చూశారు. నేడు దేశంలో వేళ్లూనుకుపోయిన కుల, మత మౌఢ్యాలు పోవాలంటే లౌకిక, ప్రజాస్వామిక శక్తులు భగత్‌సింగ్ స్ఫూర్తితో దేశ ప్రజలను చైతన్య పరచాలి.
– నాదెండ్ల శ్రీనివాస్ మధిర