breaking news
Bhagathsingh
-
షహీద్ భగత్ సింగ్ : స్వాతంత్య్ర విప్లవ జ్వాల
మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆశయాలను చంపలేరని చాటిచెప్పిన విప్లవ వీరుడు సర్దార్ భగత్‌సింగ్ (Bhagat Singh). ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిల్చి, స్వరాజ్య సాధన పోరాటంలో చిరు ప్రాయంలోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడు. ఆయన పేరు వింటే చాలు యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. 1907 సెప్టెంబర్ 28న నేడు పాకిస్తాన్లో ఉన్న లాహోర్ సమీపంలోని ఒక గ్రామంలో భగత్ సింగ్ జన్మించారు. రష్యాలో మాదిరిగా భారతదేశంలో కూడా సోష లిస్టు రాజ్యం, సమసమాజం ఏర్పడాలని భావించారు. జైలుకు వెళ్లడానికి ముందూ, జైల్లో ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఆయన విస్తృతంగా మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేసి... మారు పేర్లతో పత్రికలకు రహస్యంగా వ్యాసాలు రాశారు. తన వ్యాసాల్లో ఆయన మతతత్వ ప్రమాదం గురించి దూరదష్టితో కచ్చితమైన హెచ్చరిక చేశారు. మతవాదుల పట్ల ఉదాసీనత ప్రమాదకరం అని బోధించారు. తనకు గురు తుల్యుడు, తండ్రి సమానులైన లాలా లజపత్ రాయ్ ‘హిందూ మహాసభ’కు అనుకూలంగా మారినప్పుడు ఆయన ఘాటుగా విమర్శించారు. భగత్‌సింగ్ కార్య కలాపాలపై లాలా కూడా విరుచుకు పడ్డారు. నన్ను లెనిన్ లా మార్చడానికి భగత్‌సింగ్ ప్రయత్నిస్తున్నాడనీ, అతను రష్యన్ ఏజెంట్ అనీ నిందించారు. అయినప్పటికీ లాలాను బ్రిటీష్ పోలీసులు కొట్టి చంపడాన్ని భగత్‌సింగ్ సహించలేదు. ప్రతిగా బ్రిటిష్ పోలీస్ అధికారిని తుపాకీతో కాల్చి చంపారు. ‘విప్లవం అంటే బాంబులు, తుపాకుల సంస్కృతి కాదు. పరిస్థితుల్లో మార్పు తేవడమనే ఒక న్యాయమైన ప్రణాళికపై ఆధారపడి జరగాలి’ అంటూ వివరించారు. మతతత్వం పట్ల ఆనాడు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల పట్ల భగత్ సింగ్ అసమ్మతి వ్యక్తం చేశారు. ఒక మతానికి చెందిన ప్రజలు పరస్పరం ఇతర మతస్థు లను శత్రువులుగా భావిస్తున్నారనీ, రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేయడమే దీనికి పరిష్కారం అనీ, మతం వ్యక్తిగతమైన విషయం కాబట్టి దానిలో ఎవరూ జోక్యం చేసుకోకూడదనీ భగత్‌సింగ్ అన్నారు. మతతత్వాన్ని నిర్మూ లించడానికి ఏకైక మార్గం వర్గచైతన్యమే అని అన్నారు. ‘పెంపుడు కుక్కను ఒళ్లో కూర్చోబెట్టుకుంటాం. కానీ, సాటిమనిషిని ముట్టుకుంటే మైలపడిపోతాం. ఎంత సిగ్గుచేటు?’ అని ‘అఛూత్ కా సవాల్’ (అంటరానితనం సమస్య) అనే వ్యాసంలో భగత్ సింగ్ ప్రస్తావించారు. సంకుచిత స్వపక్ష దురభిమానులను భగత్‌సింగ్ ప్రజల శత్రువుగా చూశారు. నేడు దేశంలో వేళ్లూనుకుపోయిన కుల, మత మౌఢ్యాలు పోవాలంటే లౌకిక, ప్రజాస్వామిక శక్తులు భగత్‌సింగ్ స్ఫూర్తితో దేశ ప్రజలను చైతన్య పరచాలి.– నాదెండ్ల శ్రీనివాస్ మధిర -
ఆ ఎయిర్‌పోర్ట్‌కు భగత్ సింగ్ పేరు.. మోదీ కీలక ప్రకటన!
న్యూఢిల్లీ: చండీగఢ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో వెల్లడించారు. ‘గొప్ప స్వతంత్ర సమరయోధుడికి నివాళులర్పించటంలో భాగంగా.. చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు షాహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించాం.’ అని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో సెప్టెంబర్ 28 ఒక ముఖ్యమైన రోజు. ఆ రోజున భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. మన్ కీ బాత్‌లో భాగంగా వాతావరణ మార్పులు సహా పలు అంశాలపై మాట్లాడారు మోదీ. వాతావరణ మార్పు అనేది జీవావరణ వ్యవస్థకు అతిపెద్ద ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవటంలో నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాల్ ఉపాధ్యాయ్‌కు నివాళులర్పించారు మోదీ. ఆయన దేశ మహోన్నతమైన కుమారుడిగా పేర్కొన్నారు. ఇటీవలే భారత్‌కు చేరుకున్న చీతాలు.. 130 కోట్ల ప్రజలకు గర్వకారణమన్నారు. టాస్క్‌ఫోర్స్ వాటి పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతోందని, ప్రజల సందర్శన అనుమతులపై వారే నిర్ణయం తీసుకంటారని చెప్పారు. మరోవైపు.. అమరవీరుల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ చిన్న చూపు చూస్తోందని చెప్పేందుకే బీజేపీ పేరు మార్పునకు పూనకుందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే.. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం భగత్ సింగ్ గ్రామం ఖట్కార్ కలాన్‌లోనే నిర్వహించారు. భగత్‌సింగ్ ఉపయోగించిన పసుపు టర్బన్స్‌ను సూచిస్తూ ప్రాంగణం మొత్తం పసువు రంగులతో నింపేశారు. అలాగే.. మార్చి 23న భగత్ సింగ్ వీరమరణం పొందిన రోజును సెలవుదినంగా ప్రకటించారు. ఇదీ చదవండి: పంజాబ్ సీఎంకు ఊరట.. ప్రత్యేక అసెంబ్లీకి గవర్నర్ ఓకే -
పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌కు నివాళి
కోదాడ: దేశభక్తితో బ్రిటీష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన యువకిశోరం షహీద్ భగత్‌సింగ్‌ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందూరు సాగర్ అన్నారు. బుధవారం కోదాడలోని లాల్‌బంగ్లాలో భగత్‌సింగ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చందర్రావు, మురళి,సైదులు, ఉదయగిరి, ఉమేష్, శివాజీ, సాయి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.