వెండితెర బంగారం.. రవీనా టాండన్‌

Raveena Tandon to be the delegate at the W20 - Sakshi

రవీనా టాండన్‌ సుపరిచిత నటి. అయితే చాలామందికి ఆమెలో తెలియని కోణం సామాజిక స్పృహ. స్త్రీల హక్కులు, చైతన్యం, సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల్లో రవీనా టాండన్‌ చురుగ్గా పాల్గొంటుంది. జీ–20కి సంబంధించిన ఉమెన్స్‌ ఎంపర్‌మెంట్‌ వింగ్‌–డబ్ల్యూ20 డెలిగేట్‌గా రవీనాకు సామాజిక స్వరాన్ని మరోసారి వినిపించే అవకాశం లభించింది.

డైరెక్టర్‌ రవీ టాండన్‌ కుమార్తెగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన రవీనా టాండన్‌ భిన్నమైన పాత్రలు చేసి తనను తాను నిరూపించుకుంది. నటిగా జాతీయ అవార్డ్‌తోపాటు ఎన్నో అవార్డ్‌లు అందుకుంది.‘కాలం కంటే కాస్త ముందుగా ఆలోచించే వ్యక్తి’గా గుర్తింపు సంపాదించింది. తన కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు 21 సంవత్సరాల వయసులో ‘సింగిల్‌ మదర్‌’గా పదకొండు సంవత్సరాల పూజా, ఎనిమిది సంవత్సరాల చయ్యలను దత్తత తీసుకుంది. సింగిల్‌ మదర్‌గా పిల్లలను దత్తత తీసుకోవడం ఆ తరువాత ట్రెండ్‌గా మారింది. మహారాష్ట్రలోని వసై నగరంలో కొందరి దుర్మార్గం వల్ల 30 మంది అమ్మాయిలు నిరాశ్రయులయ్యారు.

అందరూ ‘అయ్యో!’ అనే సానుభూతికే పరిమితమైన ఆ కాలంలో రవీనా వారికి అండగా నిలబడింది. తన ఇంట్లోనే 30 మందికి ఆశ్రయం కల్పించింది. ఆ తరువాత వసైలో సొంత ఖర్చులతో అనాథాశ్రమం కట్టించి అందులో వారికి ఆశ్రయం ఇచ్చింది. ఇక అప్పటి నుంచి సామాజికసేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూనే ఉంది. సినిమాల్లో తన నటన కంటే 30 మంది అమ్మాయిలకు ఆశ్రయం కల్పించిన విషయం గురించే రవీనాతో చాలామంది మాట్లాడుతుంటారు. ఆ సందర్భం నుంచి తాము ఎలా స్ఫూర్తి పొందిందీ చెబుతుంటారు.

మంచి పనికి లభించే గుర్తింపు అది!
స్త్రీల హక్కులు, చైతన్యం, సాధికారతకు సంబంధించి యూనిసెఫ్‌తో... క్రై, వైట్‌ రిబ్బన్‌ (సేఫ్‌ మదర్‌హుడ్‌), స్మైల్‌ ఫౌండేషన్‌... మొదలైన స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది రవీనా. ‘పెటా’తో పాటు హైజీన్‌ ఆఫ్‌ యంగ్‌గర్ల్స్, మిషన్‌ సాహసి (ఆత్మరక్షణ)... మొదలైన కార్యక్రమాలకు అంబాసిడర్‌గా వ్యవహరించింది.

ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ఎంగేజ్‌మెంట్‌ వింగ్‌–జీ20 డెలిగేట్‌గా నియామకం అయిన రవీనా టాండన్‌....‘భారతీయ మహిళ ప్రతినిధిగా ఈ సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎన్నో రంగాలకు చెందిన ఎంతోమంది మహిళలు విశేష కృషి చేశారు. సామాజిక, ఆర్థిక రంగాలలో మహిళల హక్కులు, అవకాశాల గురించి చర్చించడానికి ఇదొక మంచి అవకాశం’ అంటోంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top