ఈ సరస్సులో నీళ్లు తాగినవారికి..

Prashnottara Bharatam In Telugu Devotional Article By Puranapanda Vyjayanthi - Sakshi

ప్రశ్నోత్తర భారతం

ప్రశ్న:  వేదవ్యాసుని ఘనత ఎటువంటిది?
జవాబు: వేదవ్యాసుడు తేజోవంతుడు, మహాజ్ఞాని.

ప్రశ్న: వేదవ్యాసుని చూడగానే పాండవులు ఏం చేశారు?
జవాబు: వేదవ్యాసునికి నమస్కరించారు, అర్ఘ్యపాద్యాలు ఇచ్చారు. ఆసనం అర్పించారు. వేదవ్యాసుడు కూర్చున్నాడు.

ప్రశ్న: పాండవులతో వ్యాసుడు ఏమని పలికాడు?
జవాబు: దుర్యోధనుడు దుర్మార్గుడు. పాపాత్ములను, దుష్టులను నమ్మకూడదు. మీకు మేలు చేయటానికి వచ్చాను.. అన్నాడు.

ప్రశ్న: పూర్వజన్మ ఫలితం గురించి వ్యాసుడు ఏమన్నాడు?
జవాబు: పూర్వజన్మ ఫలితం కారణంగా మీకు బంధు విరోధం కలిగింది. అందుకు దుఃఖించకూడదు. ముందుముందు మీకు మేలు కలుగుతుంది.. అన్నాడు.

ప్రశ్న: ఆ ప్రాంత మహత్మ్యం గురించి ఏమన్నాడు?
జవాబు: ఈ సరస్సులో నీళ్లు తాగినవారికి ఆకలిదప్పులు ఉండవు. ఈ చెట్టు కింద ఉన్నవారి చలి, ఎండ, వాన, అలసట వంటి బాధలు ఉండవు. మీరు కొంతకాలం ఇక్కడ నివసించండి. తరవాత ఏకచక్రపురానికి వెళ్లండి, మళ్లీ నేను మిమ్మల్ని కలుస్తాను... అన్నాడు.

ప్రశ్న: హిడింబ గురించి వ్యాసుడు ఏమన్నాడు?
జవాబు:హిడింబ పతివ్రత. ఈమె పేరు నేటి నుంచి కమలపాలిక. ఈమెను భీముడు వివాహం చేసుకోవాలి. ఈమెకు భీముని వలన పుత్రుడు కలుగును. అతడు మీకు ఆపదలలో సాయం చేయగలడు.. అని వ్యాసుడు చెప్పి అంతర్థానమయ్యాడు.

ప్రశ్న: భీముడు ఏం చేశాడు?
జవాబు: భీముడు హిడింబను భార్యగా స్వీకరించాడు. ఆమెకు పుత్రుడు కలిగేవరకు ఆమెతోఉండి, తరువాత ఆమెను వదలివేసేలా నియమం ఏర్పరిచాడు. 

ప్రశ్న: భీముడు, కమలపాలిక ఏం చేశారు?
జవాబు: భీముడు, కమలపాలిక పగలంతా అడవులపలోను, కొండలలోను విహరించారు. రాత్రులు పాండవుల దగ్గర ఉండి వారిని రక్షించారు.

ప్రశ్న: కొంతకాలం తరవాత ఏం జరిగింది?
జవాబు: కమలపాలిక సద్యోగర్భం కలిగి కుమారుడిని కన్నది. 

ప్రశ్న: కుమారుని ఆకారం ఎలా ఉంది?
జవాబు:  ముఖం భయంకరంగా ఉంది. కళ్లు వికారంగా ఉన్నాయి. నల్లని దేహం, భయంకరమైన కోరలు కలిగి, వికార రూపం కలిగి ఉంది. అతడు కామరూప ధరుడు, సకల శస్త్రాస్త్ర విద్యాలలో ఆరితేరినవాడు. వాడు ఘటోత్కచుడు.

ప్రశ్న: కొంతకాలం పాండవుల దగ్గర ఉన్నఘటోత్కచుడు పాండవులకు నమస్కరించి ఏమన్నాడు?
జవాబు: తండ్రులారా! నేను బయలుదేరతాను. రాక్షసులతో కలిసి ఉంటాను. మీకు నాతో పని ఉన్నప్పుడు నన్ను తలచుకోండి. నేను మీ దగ్గరకు వచ్చి వాలతాను.. అని, తల్లి కమలపాలికను వెంటబెట్టుకుని ఉత్తర దిక్కుకు వెళ్లిపోయాడు.
– నిర్వహణ: వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top