దుర్యోధనుడు ఏం చేశాడు? | Sakshi
Sakshi News home page

దుర్యోధనుడు ఏం చేశాడు?

Published Tue, Mar 9 2021 7:15 AM

Prashnottara Bharatam Draupadi Marriage Devotional Story - Sakshi

స్వయంవరానికి ఎవరెవరు వచ్చారు?
దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలుగా వంద మంది కౌరవులు, కర్ణుడు, అశ్వత్థామ, సోమదత్త, భూరిశ్రవుడు మొదలైన రాజులు వచ్చారు.

స్వయంవరానికి ఇంకా ఎవరెవరు వచ్చారు?
శల్యుడు, జరాసంధుడు, శకుని, అక్రూరుడు, సాంబు డు, సాత్యకి, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, కృతరవర్మ, అనిరుద్ధుడు, యుయుధానుడు మొదలైన యదు, వృష్టి, భోజ, అంధక వంశీయులు వచ్చారు. ఇంకా ఎంతోమంది రాజకుమారులు వచ్చారు.

ద్రౌపదిని చూసిన రాజులు ఏం చేశారు?
ద్రౌపదిని చూసిన రాజులు మక్కువతో, ధనుస్సు దగ్గరకు వెళ్లారు. కొందరు ధనుస్సు పట్టలేకపోయారు. కొందరు వంచలేకపోయారు. వారిని చూచి మరికొందరు ప్రయత్నం మానుకున్నారు.

కృష్ణుడు ఎవరెవరిని వారించాడు?
వృష్టి, భోజ, యాదవులను కృష్ణుడు వారించాడు.

ఎవరెవరు విఫలులయ్యారు?
శిశుపాల, జరాసంధ, శల్య, కర్ణులు ప్రయత్నించి విఫలులయ్యారు.

బ్రాహ్మణుల మధ్య నుంచి ఎవరు లేచారు?
అర్జునుడు బ్రాహ్మణుల మధ్య నుంచి లేవటంతో, బ్రాహ్మణులు సంతోషించారు.

అర్జునుడు ఏం చేశాడు?
ధనువు దగ్గరకు వచ్చి, గురువులకు నమస్కరించి, ధనుస్సుకు ప్రదక్షిణం చేసి, అవలీలగా ధనుస్సు అందుకుని, ఐదు బాణాలు వేశాడు. ఆకాశంలో ఉన్న మత్స్యయంత్రం పడగొట్టడంతో సభ ఆశ్చర్యపోయింది.

అందరూ అర్జునుడిని ఏ విధంగా కీర్తించారు?
మత్స్యయంత్రాన్ని ఇంత సులువుగా కొట్టినవాడు నరుడు కాడు, ఇంద్రుడో, రుద్రుడో, సూర్యుడో, కుమారస్వామియో అయి ఉంటారని కీర్తిస్తూ, పూల వాన కురిపించారు.

దుర్యోధనుడు ఏం చేశాడు?
దుర్యోధనుడు కోపంతో, ద్రుపదుడు తమను అవమానించాడనుకుని, ద్రుపదుని వధించాలని దండెత్తాడు.

భీముడు, అర్జునుడు ఏం చేశారు?
ఒక చెట్టు పెరికి నిలిచాడు, అర్జునుడు బాణం ఎక్కుపెట్టాడు. అర్జునుడికి కర్ణుడికి, భీముడికి శల్యుడికి మధ్య యుద్ధం జరిగింది. 

– నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ


 

Advertisement
Advertisement