‘ఆమె’ డ్రైవర్‌ | Pooja Devi Becomes Jammu&Kashmir First Woman Bus Driver | Sakshi
Sakshi News home page

‘ఆమె’ డ్రైవర్‌

Jan 25 2021 1:11 AM | Updated on Jan 25 2021 2:29 AM

Pooja Devi Becomes Jammu&Kashmir First Woman Bus Driver - Sakshi

జమ్మూ – కథువా – పఠాన్‌కోట్‌ రహదారి పెద్ద పెద్ద ట్రక్కులు, వాహనాలతో బిజీగా ఉంటుంది. అలాంటి రహదారి మీద కథువా నుండి జమ్మూ వెళ్లే ప్రైవేట్‌ బస్సులో ఉన్న ప్రయాణికులు మొదట ఆశ్చర్యపోయారు బస్సు డ్రైవర్‌ని చూసి. తర్వాత సందేహించారు. కారణం ‘ఆమె’ బస్సు నడపగలదా? అని. తర్వాత తమ ప్రయాణానికి ఢోకా లేదని నిశ్చింతంగా కూర్చున్నారు. బస్సు గమ్యస్థానానికి చేరింది. ప్రయాణికులు ఒక్కొక్కరుగా దిగుతూ బస్సు డ్రైవర్‌కి అభినందనలు తెలిపారు. ఆ బస్సు డ్రైవరు పేరు పూజా దేవి. జమ్మూ కాశ్మీర్‌లో మొదటిసారి బస్సు నడిపిన మహిళగా పేరుపొంది పూజాదేవి.

కతువా జిల్లాలోని సంధర్‌–భష్లో అనే మారుమూల గ్రామానికి చెందిన పూజాదేవికి డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టం. టీనేజ్‌ నుంచి కార్లు, మోటార్‌ సైకిళ్లు డ్రైవ్‌ చేస్తుండేది. ఆ వయసు నుంచే పెద్ద పెద్ద వాహనాలను నడపాలనుకునేది. పూజాదేవి తాను చేస్తున్న పని గురించి వివరిస్తూ ‘నా కుటుంబం మొదట్లో నాకు మద్దతు ఇవ్వలేదు. కానీ, నాకు వేరే ఉద్యోగం ఎంచుకునేంత పెద్ద చదువు లేదు. నాకు డ్రైవింగ్‌ పని వచ్చు. కుటుంబ పోషణకు డబ్బు కావాలి. నాకు వచ్చిన పని నుంచే ఉపాధి పొందవచ్చు కదా అనుకున్నాను. అందుకు ఇంట్లో వాళ్లు ఆడవాళ్లు అంత పెద్ద పెద్ద వాహనాలను ఎలా నడపగలరు.

శక్తి సరిపోదు అన్నారు. కానీ, నేను వారి మాటలను పట్టించుకోలేదు. కమర్షియల్‌ వెహికిల్స్‌ను ఎలా నడపాలో తెలుసుకోవడానికి ఇప్పటి వరకు టాక్సీ నడుపుతున్నాను. కతువా నుండి జమ్మూ వరకు ట్రక్కు కూడా నడిపాను. ఈ వారమే ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరాను. ఇప్పుడిలా ప్రయాణికులను చేరవేసే బస్సు నడపడంతో ఎప్పటి నుంచో నాకున్న కల నెరవేరింది’ అని సంతోషం వెలిబుచ్చిన పూజను కలిస్తే ఎవ్వరైనా అభినందించకుండా ఉండలేం. పురుషులు మాత్రమే ప్రయాణికుల బస్సులను నడపగలరనే మూసను ముక్కలు చేయాలనుకున్న విషయాన్నీ పూజ ప్రస్తావిస్తారు. డ్రైవింగ్‌ ద్వారా ఉపాధి పొందాలని కోరుకునే మహిళలకు వారి కుటుంబాలు మద్దతు ఇవ్వాలని చెబుతుంది పూజ

జమ్మూ కథువా పఠా¯Œ కోట్‌ రహదారి భారీ ట్రాఫిక్‌తో ఉంటుంది. ఇతర పురుష డ్రైవర్లు సైతం రాకపోకలు సాగించడం కష్టంగా ఉండి, సరిగ్గా విధులకు హాజరు కాకపోడంతో, ఈ ఉద్యోగం పూజకు ఇచ్చారు. తన శక్తిని నమ్మి డ్రైవింగ్‌ ఉద్యోగం ఇచ్చిన బస్సు యాజమాన్యానికి  కృతజ్ఞతలు తెలుపుతుంది పూజ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement