అవసరమే ఆవిష్కరణ..

Peddapalli, Mahaboob Nagar Model School Students Wins Telangana Innovation Challenge Awards - Sakshi

టాలెంట్‌

బిడ్డా.. ఈ గోలీ ఎప్పుడు వేసుకోవాలి.. గిది చూసిపెట్టు... ఇది పరగడుపున వేసుకునేదా... పడుకునే ముందు వేసుకునే గోలీనా... ఇలా ప్రతినిత్యం అమ్మ టాబ్లెట్స్‌ టైమ్‌కు తీసుకోవడానికి çపక్క వారి సహాయం కోసం ఎదురు చూడటం నుంచే ఈ ఎకోఫ్రెండ్లీ మెడిసిన్స్‌ టైమ్‌ టేబుల్‌ బ్యాగ్‌ తయారు చేయాలనే ఆలోచన వచ్చేలా చేసింది. ఈ ఆలోచనే రాష్ట్రస్థాయిలో పెద్దపల్లి పిల్లలను రాష్ట్ర ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ విజేతగా నిలిపింది. అలాగే మహిళలు పబ్లిక్‌ ప్రదేశాల్లో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారంగా పోర్టబుల్‌ అంబరిల్లా రూమ్‌ను ఆవిష్కరించిన మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు రెండవ బహుమతి అందుకున్నారు. 

మరిన్ని ఆవిష్కరణలు చేస్తా 
మేం తయారు చేసిన మినీ పోర్టబుల్‌ రూమ్, అంబరిల్లా టాయిలెట్స్‌ ఆవిష్కరణకు ఇంత మంచి స్పందన వస్తుందని అనుకోలేదు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచినందుకు సంతోషంగా ఉంది. పెద్ద పెద్ద సార్ల చేతుల మీదుగా బహుమతి అందుకున్నాం. ఇప్పుడు మరిన్ని అవిష్కరణలు తయారు చేయాలనే సంకల్పం కల్గింది. మా సార్లు కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని ప్రయోగాలు చేస్తాం. 

– రితిక, 10వ తరగతి, నెల్లికుదురు మోడల్‌స్కూల్, మహబూబాబాద్‌ 

సంతోషంగా ఉంది 
ఎగ్జిబిట్‌ను తయారు చేయడానికి వారం రోజులకు పైగా కష్టపడ్డాం. సార్లు మంచిగా చెప్పి తయారు చేయించారు. ఎగ్జిబిట్‌ గురించి చెప్పేటప్పుడు ముందుగా భయం వేసింది. తర్వాత వివరించడం సులువయ్యింది. ఇకనుంచి ప్రతి సంవత్సరం ఎగ్జిబిట్స్‌ తయారు చేస్తా. మా సార్లు, అమ్మానాన్న, మా ఊరిలోని వారు అందరూ మెచ్చుకుంటున్నారు. సంతోషంగా ఉంది.  

– కీర్తన, 6వ తరగతి, టీఎస్‌ మోడల్‌ స్కూల్, నెల్లికుదురు, మహబూబాబాద్‌ 

అమ్మ తిప్పలు చూడలేక...
సైన్స్‌ ఇన్నోవేషన్స్‌ ఛాలెంజ్‌ కోసం ఐదు నెలల క్రితం నోటిఫికేషన్‌ వచ్చింది. అప్పుడు మెంటర్‌ శివకృష్ణ సర్‌ ఆధ్వర్యంలో తమన్నా, నేను సర్టిఫికేషన్‌ కోర్సు చేశాం. ఇందులో ఆన్‌లైన్‌లో 10 వీడియోలు చూసి, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు. వాటికి సరైన సమాధానం చెప్పిన వారికి సర్టిఫికేట్‌ ఇచ్చారు. అందులో గెలిచిన వారి నుంచి సమాజంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం కొన్ని సూచనలు చేయాలని చెప్పారు. దాని గురించి రెండు – మూడు ఆలోచనలు చేశాం. అందులో అమ్మ ప్రతిరోజూ టాబ్లెట్స్‌ వేసుకోవడానికి పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపితే బాగుంటుందని నా ఆలోచన గురించి చెప్పా.

నాన్న గల్ఫ్‌లో పనిచేస్తున్నాడు. అమ్మ బీడీలు చుడుతుంది. నాకు చెల్లి, తమ్ముడు ఉన్నారు. అమ్మకు ఒంట్లో బాగుండదు. ప్రతి రోజూ మందులు తీసుకోవాలి. ఆమెకు ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలో తెలిసేది కాదు. నేను సహాయం చేస్తుంటాను. అమ్మలాంటి నిరక్షరాస్యులందరిదీ ఇదే సమస్య కదా అనిపించింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మందులు సులువుగా తెలుసుకోవడానికి అరలతో సంచి చేద్దాం అనుకున్నాను. ఇలాంటి సంచి ఉంటే ఒక సమయంలో వేసుకోవాల్సిన మందులను మరొక సమయంలో తీసుకోవటం వంటి పొరపాట్లు జరగవు. ఈ ఆలోచనను పైకి పంపించగా మా ప్రాజెక్టు సెలెక్టు అయ్యింది. 

– జి. శివాని

అంధులకు సైతం ఉపయోగపడాలని... 
తెలంగాణ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ కోసం మేము అబ్దుల్‌ కలాం అనే గ్రూప్‌గా ఏర్పడి ఎకో ఫ్రెండ్లీ మెడిసిన్‌ టైమ్‌ టేబుల్‌ బ్యాగ్‌ను రూపొందించాం. మొదట కేవలం నిరక్షరాస్యుల కోసం బ్యాగ్‌ తయారు చేయాలనుకున్నాం. తర్వాత మనం తయారు చేసే ప్రాజెక్టు నిరక్షరాస్యులతోపాటు, అంధులు సైతం ఉపయోగించేలా పర్యావరణ హితంగా రూపకల్పన చేస్తే బాగుంటుందనిపించి, నా ఆలోచనను సార్‌తో పంచుకున్నాను. మా సర్‌ సహకరించారు. ఒక్కో పూటకు ఒక్కో బ్యాగ్‌ అనుకున్నాం. కానీ ఎక్కువ బ్యాగ్‌లు ఐతే ఇబ్బంది అవుతుందని ఒక్కటే బ్యాగ్‌గా తయారు చేసి ముందు వైపు నాలుగు పాకెట్లు, వెనుక రెండు పాకెట్లు ఉండేలా తయారు చేశాం.

ఆ పాకెట్ల పై అందరూ సమయం గుర్తుపట్టేలా సింబల్స్‌ పెట్టాం. అంధుల కోసం ప్రత్యేకం గా బ్రెయిలీ లిపి గుర్తులు ఉంచాం. మందుల కోసం షాప్‌కి వెళ్లేటప్పుడు ఈ సంచిని తీసుకెళితే షాపు వాళ్లే ఏ పూట వేసుకోవాల్సిన మందులను ఆ అరలో సర్ది ఇవ్వగలుగుతారు. లేదంటే తర్వాత పిల్లలు కానీ తెలిసిన వాళ్ల సహాయం కానీ తీసుకోవచ్చు. నెలకోసారి ఇలా మెడికల్‌ టైమ్‌ టేబుల్‌ బ్యాగ్‌ను సర్దుకుంటే నెలంతా మరొకరి అవసరం లేకుండా సమయానికి మందులు వేసుకోవచ్చు. 

– బి. తమన్నా, 9వ తరగతి, తెలంగాణ స్టేట్‌ మోడల్‌ స్కూల్, ధర్మారం, పెద్దపల్లి జిల్లా 

శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లి 
ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top