న్యూస్‌మేకర్
‘మానవులుగా మనం గీసుకునే గీతలు, సరిహద్దు రేఖలు అన్నీ మనం సృష్టించుకున్నవే. వాటికి ఎలాంటి అస్తిత్వం లేదు’ అనే క్రిస్టినా కోచ్ శాస్త్రీయ విషయ సంపన్నురాలే కాదు, సామాజిక స్పృహ మూర్తీభవించిన మహిళ. చంద్రుడిని చుట్టి రావడానికి, ‘ఆర్టెమిస్–2’ మిషన్‌లో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన నలుగురు వ్యోమగాములలో ఆమె ఒకరు. అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడిపిన మహిళగా గతంలో రికార్డ్ సృష్టించిన కోచ్ తాజాగా... చంద్రుడి కక్ష్యలో ప్రయాణించనున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు.
మిచిగాన్ (అమెరికా)లోని గ్రాండ్ రాపిడ్స్‌లో జన్మించి, నార్త్ కరోలినాలోని జాక్సన్‌విల్లేలో పెరిగిన క్రిస్టినా కోచ్ నార్త్ కరోలినా యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీలు చేశారు. ఆమెకు నాసా మిషన్‌లు కొత్తేమీ కాదు. 2013లో తొలిసారిగా నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు.
రికార్డ్ సృష్టించి...
2019లో అంతరిక్షంలో 328 రోజుల పాటు సుదీర్ఘకాలం గడిపిన మహిళగా రికార్డ్ సృష్టించారు కోచ్. అక్టోబర్ 2019లో జెస్సికా మీర్‌తో కలిసి ఆల్ ఫిమేల్ స్పేస్ వాక్‌లో కూడా కోచ్ పాల్గొన్నారు. అల్ఫా మాగ్నెటిక్ స్పెక్ట్రోమీటర్ అప్‌గ్రేడ్ కోసం రోబోటిక్స్ చేయడం, ఫార్మాస్యూటికల్ పరిశోధన కోసం ప్రోటీన్ క్రిస్టల్స్ పెంచడం, సూక్ష్మ గురుత్వాకర్షణలో 3డీ బయోలాజిక్ ప్రింటర్‌లను పరీక్షించడం... మొదలైనవి ఆమె చేపట్టిన శాస్త్రీయ పరిశోధనలు.
అంటార్కిటికాలో...
‘ఆర్టెమిస్–2’ మిషన్‌కు ఎంపిక కావడానికి ముందు ‘నాసా’ ఆస్ట్రోనాట్ ఆఫీస్‌లో అసైన్డ్ క్రూ బ్రాంచ్‌కు చీఫ్‌గా... నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌లో సెంటర్ డైరెక్టర్‌కు టెక్నికల్ ఇంటిగ్రేషన్ అసిస్టెంట్‌గా పనిచేశారు కోచ్. ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న కోచ్ అంటార్కిటికాలోని స్కాట్ సౌత్ పోల్ స్టేషన్, పామర్ స్టేషన్‌లలో అగ్నిమాపక, శోధన, రక్షణ బృందాలలో పనిచేశారు.
అంతరిక్ష యోగా!
‘మనసు ఉండాలేగానీ మార్గం ఉంటుంది’ అని చెబుతారు పెద్దలు. క్రిస్టినా కోచ్‌కు యోగా చేయడం అంటే ఇష్టం. మరి అంతరిక్షంలో అది సాధ్యపడుతుందా?
‘యస్’ అంటున్నారు కోచ్.
తన గత అంతరిక్ష యాత్రలో యోగా ప్రముఖ పాత్ర పోషించిందని చెబుతుంటారు కోచ్. ‘నేను ఐఎస్‌ఎస్‌లో ఉన్నప్పుడు చాలాసార్లు యోగా చేశాను. అక్కడ యోగా చేయడం చాలా కష్టం అనుకుంటారు. కాని అది నిజం కాదు. కొన్ని ఆసనాలు చేయడం కష్టంగా అనిపించినప్పటికీ అక్కడ యోగా చేయడం చాలా సరదాగా ఉంటుంది. యోగా అనేది అద్భుతమైనది.
మైక్రో గ్రావిటీ (బరువు లేని స్థితి) లో కూడా అన్వేషించడానికి అనేక రకాల ఆసనాలు ఉంటాయి. అంతరిక్షంలో సాధన చేసినా, భూమిపై చేసినా యోగా ఎప్పటికీ యోగానే. అది అంతరిక్షం అయినా సరే, అన్వేషణ మన నుంచి దూరం కాదు. అన్వేషణ అనేది ఎందుకు మానవ సహజమో మనకు అక్కడ అర్థమవుతుంది. అన్వేషణ అనేది మన డీఎన్‌ఏలోనే ఉంది. మనం ఇష్టపడే వాటిని కొత్త వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవడం మనం సహజంగా చేసే పని’ అంటారు క్రిస్టినా కోచ్.
శాస్త్ర ప్రపంచానికి ఆవల కోచ్‌కు సర్ఫింగ్, ఐస్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్, సామాజిక సేవ అంటే ఇష్టం.
రికార్డ్‌లు బద్దలు కావాల్సిందే!
→ మీరు ఇప్పటికే సుదీర్ఘమైన అంతరిక్ష యాత్రకు సంబంధించిన రికార్డ్‌ను బద్దలు కొట్టారు. మరో రికార్డ్‌ను కూడా సృష్టించడానికి రెడీ కావడం ఉలా ఉంది?
క్రిస్టినా కోచ్: నేను రికార్డ్‌లు, వ్యక్తిగత విజయాల గురించి ఆలోచించను. మరొకరికి స్ఫూర్తినివ్వడం గురించి, అత్యాధునిక సాంకేతికతకు సంబంధించిన విషయాలను ప్రజలకు తెలియజేయడం గురించి ఆలోచిస్తాను. ఇక రికార్డ్‌ల విషయానికొస్తే... మీరు ఎక్కడికి వెళ్లారు? అంతరిక్షంలో ఎన్ని రోజులు గడిపారు... అనేది ముఖ్యం కాదు. ఆ సమయంలో మీరు ఏం చేశారు అనేది ముఖ్యం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నా లక్ష్యం ఎప్పుడూ అదే. రికార్డ్‌లు వీలైనంత త్వరగా బద్దలు కావాలనేది నా కోరిక. రికార్డ్‌లు బద్దలు కావడం అంటే దాని అర్థం మనం నిరంతరం విస్తరిస్తున్నామని!
→ శాస్త్రీయ అన్వేషణకు సంబంధించి నాసా వైఖరి?
కోచ్: ఒక శాస్త్రీయ అన్వేషణకు మనం స్పందించి, మానవాళి మొత్తానికి ప్రాతినిధ్యం వహించడం ముఖ్యమని నాసా చాలాకాలం క్రితమే నిర్ణయం తీసుకుంది. ఇది సంతోషకరమైన విషయం. వ్యోమగాముల బృందం మానవాళి మొత్తానికి ప్రతినిధిగా ఉంది. అన్వేషణకు సంబంధిన ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ వ్యోమగాముల బృందంలో భాగమయ్యేలా చేసుకోవడమే విజయానికి అత్యత్తమ మార్గం.
→ అంతరిక్ష అనుభూతి గురించి...
కోచ్: అంతరిక్షం నుంచి వెనక్కి తిరిగి భూమిని చూడడం అనేది అద్భుత అవకాశం. అనంతమైన విశ్వంలో భూమి ఎలా కనిపిస్తుందో చూడడం అనేది జీవితంలో ఎన్నో అనుభవాల కంటే అతి ముఖ్యమైనది. వాతావరణానికి సంబంధించి పలుచని నీలి గీతను చూడడం ద్వారా మన మధ్య తేడాల కంటే పోలికలే ఎక్కువగా ఉన్నాయని, మనమందరం సంతోషంగా జీవించడానికి ఒకే విధానంపై ఆధారపడుతున్నామని, మానవులుగా మనం గీసుకునే గీతలు, సరిహద్దు రేఖలు, విభజనలు అన్నీ మనం సృష్టించుకున్నవే అని, నిజానికి వాటికి ఎలాంటి అస్థిత్వం లేదని స్పష్టంగా అర్థమవుతుంది.


