గ్రేట్‌ ఫాదర్‌.. మా నాన్నహీరో

my father a hero says shruthi chaturvedi - Sakshi

‘నాన్నంటే మా నాన్నలా ఉండాలి’ అంటోంది శృతి చతుర్వేది. నిజమే... నాన్న అయినా, అమ్మ అయినా పిల్లలకు అండగా నిలవాల్సింది వాళ్లను సమాజం వేలెత్తి చూపించిన క్షణంలోనే. ఆ క్షణంలో మిగిలిన వారికంటే ముందుగా తల్లిదండ్రులే పిల్లలను నేరస్థులుగా చూడడం మొదలు పెడుతుంటారు. మరికొందరు తల్లిదండ్రులు సమాజానికి భయపడి పిల్లలను దూరంగా ఉంచి, అలా దూరంగా ఉంచడాన్ని తమ నిక్కచ్చితనానికి, కచ్చితత్వానికి కొలమానంగా భావిస్తుంటారు. శృతి చతుర్వేది తండ్రి హరీశ్‌ చతుర్వేది కూతురు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు అండగా నిలిచాడు. కూతురి వెనుక జరిగిన కుట్రను ఛేదించడంలో సహకరించాడు. తమ ఇంట్లో ఆశ్రయం పొంది, ఘాతుకానికి ఒడిగట్టిన ద్రోహుల్ని ఇంటినుంచి తరిమికొట్టి కూతుర్ని అక్కున చేర్చుకున్నాడు. అందుకే శృతి చతుర్వేది తన తండ్రి గురించి అంత గొప్పగా చెప్పగలిగింది.

అసలేం జరిగింది?
శృతి ఫొటోలు మార్ఫింగ్‌కు గురయ్యాయి. గౌరవంగా జీవించే ఆ కుటుంబం గురించి బంధువులు, స్నేహితులు అసభ్యంగా మాట్లాడుకునే పరిస్థితి ఎదురైంది. ఒకరకంగా సామాజిక బహిష్కరణ వంటిది. శృతి తండ్రి ప్రతి ఫొటోనీ నిశితంగా గమనించాడు. నిజానికి ఆ ఫొటోలన్నీ ఆయన గతంలో చూసినవే. అయితే కొత్త పరిసరాల్లో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కొత్తగా కనిపిస్తున్నాయి. తమ కుటుంబం పిక్‌నిక్‌కి వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలో శృతి పక్కన ఆమె కాలేజ్‌ స్నేహితుల్లో అబ్బాయిల ఫొటోలున్నాయి. గ్రూప్‌ ఫొటోల నుంచి ఆ అబ్బాయి ఫొటోను క్రాప్‌ చేసి శృతి పిక్‌నిక్‌ ఫొటోతో జత చేశారెవరో. అలాగే మరికొన్ని ఫొటోల్లో శృతిలాగానే కనిపిస్తోంది. కానీ దేహం శృతిది కాదు. మరెవరి దేహానికో శృతి ముఖాన్ని అతికించారు. ఫొటోలను మార్ఫింగ్‌ చేయడంతోపాటు ఆ ఫొటోలను తమ కుటుంబానికి ఆత్మీయులైన వాళ్లకు చేరేటట్లు చేశారు. ఇదంతా చేసింది ఎవరు? హరీశ్‌ చతుర్వేదికి ఒక సందేహం వచ్చింది. చివరికి అతడి సందేహమే నిజమైంది.

ఎలా జరిగింది!
శృతి చతుర్వేది వయసు 28. ఢిల్లీలో మీడియా మార్కెటింగ్‌ విభాగంలో ఉద్యోగి. ఆమె పద్దెనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ల కజిన్‌ అతడి భార్యతోపాటు శృతి ఇంటికి వచ్చాడు. అతడి ప్రేమను అతడి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి ప్రేమించిన అమ్మాయితోపాటు శృతి వాళ్ల ఇంటికి వచ్చి తలదాచుకున్నాడు. అలా వచ్చిన ఆ దంపతులు కొన్ని నెలల పాటు ఉండిపోయారు. ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక ల్యాప్‌టాప్‌ని అందరూ ఉపయోగించేవారు. శృతి ఇంట్లో అందరూ తెరిచిన పుస్తకంలా ఉండేవారు. ఎవరికీ ఏ రహస్యాలు లేని జీవితాలు వాళ్లవి. ఇంట్లో అందరి ముఖ్యమైన సమాచారంతోపాటు పిక్‌నిక్‌లకు వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలు కూడా అదే ల్యాప్‌టాప్‌లో ఉండేవి. శృతి కజిన్‌ దంపతులకు ఉద్యోగ ప్రయత్నాల కోసం ఆ ల్యాప్‌టాప్‌నే ఇచ్చారు శృతివాళ్లు. శృతి కజిన్‌ భార్య కంప్యూటర్‌ ఇంజనీర్‌. ఇదంతా చేసింది ఆమే. ఫొటోషాప్‌లో శృతి ఫొటోలను మార్ఫింగ్‌ చేసింది. వాళ్లకు ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో తమకు ఆశ్రయం ఇచ్చిన ఇంటి వాళ్లనే అభాసుపాలు చేశారు.

ఇలా ఉండాలి!
శృతి అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ ‘‘ఆ రోజు మా నాన్న అంత హుందాగా వ్యవహరించి ఉండకపోతే ఈ రోజు నేను ఒక సక్సెస్‌ఫుల్‌ పర్సన్‌గా నిలిచేదాన్ని కాదు. నాకు ధైర్యం చెప్పి, ఆ ద్రోహుల్ని ఇంటి నుంచి తరిమివేశాడు. తండ్రి పిల్లల్ని సమాజం వైపు నిలబడి చూడకూడదు. తన పిల్లల వైపు నిలబడి సమాజాన్ని ఎదుర్కోగలగాలి. ఇది ధైర్యవంతులకే సాధ్యం. మా నాన్న ధీరుడు’’ అంటోంది శృతి చతుర్వేది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top