వ్యాయామం చేస్తుంటే పట్టేసిన కండరం.. మళ్లీ అదే వ్యాయామంలోనే?

Muscle Spasm While Exercising It will Be Relieved same exercise again Or Not - Sakshi

సాధారణంగా జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఏదైనా కండరం పట్టేసిందనుకోండి. మళ్లీ అదే వ్యాయామం చేస్తున్న సమయంలోనే, అది విడుస్తుందనీ... అప్పుడే రిలీఫ్‌ వస్తుందని, అందుకే వ్యాయామం ఆపకూడదంటూ కొందరు సలహా ఇస్తుంటారు. ఇది వాస్తవం కాదు. ఏదైనా వ్యాయామం చేస్తున్నప్పుడు కండరం పట్టేసినా, బ్యాలెన్స్‌ తప్పడం వల్ల తీవ్రమైన నొప్పి వచ్చినా... అది పూర్తిగా తగ్గే వరకు ఆ వ్యాయామం చేయకూడదు.

ఉదాహరణకు లోహపు కడ్టీకి రెండువైపులా బరువులు (ప్లేట్స్‌) వేసుకుని, భుజం మీద దాన్ని పెట్టుకుని చేసే ‘స్క్వాట్స్‌’  వ్యాయామంలో భుజాలపై బ్యాలెన్స్‌ తప్పి  బరువు పడటం వల్ల గానీ, లేదా కాళ్లపై  బాలెన్స్‌ తప్పి బరువు పడటం గానీ జరిగితే... ఎక్కడైనా కండరం పట్టేయడం లేదా అధికబరువు పడటం వల్ల భుజాలూ, కాళ్లూ, పిక్కలూ, పాదాలు...ఇలా ఏ భాగంలోనైనా నొప్పి రావచ్చు. ఇలా జరిగితే... నొప్పి తగ్గే వరకు అదే వ్యాయామం  చేయకపోవడం మంచిది.  చాలా కండరాలపై భారం పడే అవకాశం ఉన్నందున ‘స్క్వాట్స్‌’ను ఉదాహరణ కోసం చెప్పినప్పటికీ... ఈ నియమం ఏ వ్యాయామానికైనా వర్తిస్తుంది.

గాయపడ్డ కండరంపై మళ్లీ మళ్లీ ఒత్తిడి పడేలా అదే వ్యాయామాన్ని మాటిమాటికీ  చేస్తుండటం వల్ల  గాయం మళ్లీ మళ్లీ రేగి... ‘రిపిటీటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజరీ’ అయి  పూర్తిగా కోలుకోకముందే అది మళ్లీ మళ్లీ గాయపడటం జరుగుతుంటుంది. ఇదెంతమాత్రమూ మంచిది కాదు. ఏదైనా వ్యాయామ సమయంలో గాయపడినా/కండరాలు పట్టేసినా వెంటనే ఫిజీషియన్‌/స్పోర్ట్స్‌ మెడిసిన్‌ లేదా ఫిట్‌నెస్‌ నిపుణులు లేదా ఆర్థోపెడిక్‌ నిపుణులను సంప్రదించాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top