శ్రీమతి ఆలోచన.. దుస్తులే సందేశం

Mrs World 2022: Navdeep Kaur won the award for the Best National Costume - Sakshi

‘ప్రపంచ పటంలో నా దేశాన్ని నాదైన ప్రత్యేకతతో చూపాలి’ అని బాల్యం నుంచి కలగన్న అమ్మాయి నవదీప్‌ కౌర్‌.  శ్రీమతి అయి, ఓ బిడ్డకు తల్లైన 32 ఏళ్ల నవదీప్‌ కౌర్‌ తన ప్రయత్నాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తూనే తనదైన ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తంగా చాటింది. సంకల్పం ఉంటే ఎవరైనా తమ కలలను సాధించవచ్చని నిరూపించింది. 

ఇటీవల అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ‘మిసెస్‌ వరల్డ్‌–2022’ పోటీలు జరిగాయి. ఈ పోటీలో వివిధ దేశాల నుంచి వచ్చిన పోటీదారులు తమ దుస్తుల ద్వారా వారి మాతృదేశ, సంప్రదాయ, ఆధ్యాత్మిక అంశాలను హైలైట్‌ అవాలనేది ప్రధానాంశం. బెస్ట్‌ నేషనల్‌ కాస్ట్యూమ్‌ ఎంట్రీ విజేతల విభాగంలో నవదీప్‌కౌర్‌ విజేతగా నిలిచింది. భారతదేశం నుంచి ఒడిశాలోని రూర్కెలా ప్రాంతంలో పుట్టి పెరిగిన శ్రీమతి నవదీప్‌ కౌర్‌ ధరించిన దుస్తులు చూసిన ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు తమలోని శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేశాయి.

పాము ముఖాన్ని పోలి ఉండే భారీ తలపాగా, పొడవాటి బంగారు బూట్లు, చేతి ఉపకరణాలతో సహా ఈ దుస్తుల డిజైన్‌లో అనేక పాము అంశాలు ఇమిడి ఉన్నాయి. నాగుపామును పోలిన ఆభరణాలు భుజాలపైన అలంకరించారు. కొత్తదనం, ఐశ్వర్యానికి సూచికగా ఆమె ధరించిన ఈ దుస్తులు మనిషిలోని మూలాధార చక్రం నుండి వెన్నెముక వరకు సూచించే కుండలినీ శక్తి కదలికలను సూచికగా ఈ డిజైన్‌ను తీసుకున్నారు. 

ప్రపంచ ప్రఖ్యాత అవాంట్‌ – గార్డె ఫ్యాషన్‌ హౌజ్‌లోని కళాకారిణి అగీ జాస్మిన్‌ ఈ దుస్తులను డిజైన్‌ చేసింది. వీటిని ధరించిన నవదీప్‌ కౌర్‌ ఫొటోలు, వీడియోలు చూపరులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. దేశ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచం ముందుకు దుస్తుల ద్వారా తీసుకువచ్చిన నవదీప్‌ కౌర్‌ అందరి అభినందనలు అందుకుంటోంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top