పర్యావరణ హిత
‘జ్ఞానం లేకపోయినా వారసత్వ జ్ఞానం అయినా ఉండాలి’ అంటారు. మన తాతముత్తాతలు, మన పూర్వీకులు మన కోసం ఎన్నో దారులు ఏర్పాటు చేశారు. వారసత్వ జ్ఞానంతో కొందరు, సొంత జ్ఞానంతో కొందరు ‘దేశీయ ఫ్రిడ్జ్’లు తయారుచేస్తున్నారు. విద్యుత్ వినియోగాన్ని, కర్బన ఉద్గారాల తగ్గింపునకు పర్యావరణ హితమార్గాన్ని అనుసరిస్తున్నారు...
తీగలు, కంప్రెసర్లు, గ్యాస్ రీఫిల్ అవసరం లేదు. కొంచెం ఓపిక ఉంటే చాలు, ఒక్క యూనిట్ విద్యుత్ కూడా అవసరం లేకుండానే సంప్రదాయ శీతలీకరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే విధానాలు మన సంప్రదాయ చరిత్రలో ఉన్నాయి.
వారసత్వ జ్ఞానం... మళ్లీ ఒకసారి
రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాల నడిబొడ్డున వేసవి తాపం భరించలేనంతగా ఉండే చోట, సంప్రదాయ బంధానీ చీర కట్టుకున్న మహిళ చిన్న గుడిసెలాంటి నిర్మాణం వైపు వెళ్లింది. చిన్న తలుపు తెరిచి లోపల ఉన్న పాలు, పెరుగు, రొట్టెలు... మొదలైన వాటిని బయటకి తీసుకువచ్చింది.
ఇంతకీ ఆ చిన్న గుడిసె ఏమిటంటే... విద్యుత్ లేకుండా నిర్మించిన ఒక రిఫ్రిజిరేటర్!
మట్టి, ఆవుపేడ, ఖి్రపా గడ్డితో రూపొందించిన గుడిసె అది. విద్యుత్ అవసరం లేకుండానే సహజ శీతలీకరణ దీని ప్రత్యేకత.
ఈ దేశీయ ఫ్రిడ్జ్‌కు ఉపయోగించిన శాస్త్రం సూక్ష్మమైనది కానీ ప్రభావ వంతమైనది. రంధ్రాలు గల బంక మట్టి నీటిని నెమ్మదిగా ఆవిరైపోయేలా చేసి, లోపల ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. పైన కప్పిన గడ్డి ఒక ఇన్సొలేషన్‌లా పనిచేస్తూ, లోపలి భాగాన్ని తీవ్రమైన ఎండ నుండి కాపాడుతుంది. సహజంగా చల్లబడే ఈ గది వల్ల అధిక వేడిలో కూడా ఆహారపదార్థాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. తరతరాలుగా గ్రామీణ రాజస్థాన్‌లో ఇలాంటి ‘దేశీ ఫ్రీజ్’లు ఉన్నాయి.
ఈ దేశీ ఫ్రిజ్‌లు పాలు పాడవకుండా కాపాడతాయి. పెరుగు చక్కగా గడ్డకట్టడానికి సహాయపడతాయి. రొట్టెలను రోజంతా తాజాగా ఉంచుతాయి... ఇవన్నీ ఒక్క యూనిట్ విద్యుత్ అవసరం లేకుండా జరుగుతాయి!
ఒకప్పుడు అందరికీ సులభంగా అందుబాటులో ఉండే ఈ వ్యవస్థలు, వారసత్వ జ్ఞానం కనుమరుగవుతున్నట్లు కనిపించినా.... ఆ సంప్రదాయ పద్ధతులు తిరిగి వెలుగు చూస్తున్నాయి.
మిట్టీ కూల్
విద్యుత్ అవసరం లేకుండా ఆహారాన్ని తాజాగా ఉంచే ఫ్రిజ్ తయారుచేశాడు గుజరాత్‌కు చెందిన మన్సుఖ్ భాయ్. ఈ ఫ్రిజ్‌కు ‘మిట్టీ కూల్’ అని పేరు పెట్టాడు. ఈ మట్టి ఫ్రిజ్ బాష్పీభవన సూత్రంపై పనిచేస్తుంది. ఫ్రిజ్‌లో పై గదులలోని నీరు కిందికి కారి ఆవిరైపోతుంది. దీనివల్ల లోపల ఉన్న వేడి తొలగిపోయి, గదులు చల్లబడతాయి. పై గదిని నీటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. దానిపైన మట్టితో చేసిన చిన్న మూత ఉంటుంది. కిందిగదిలో ఆహారపదార్థాలను నిల్వ చేయడానికి రెండు అరలు ఉంటాయి. మొదటి అరలో కూరగాయలు, పండ్లు... మొదలైన వాటిని నిల్వ చేయడానికి, రెండవ అరలో పాలు మొదలైన వాటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. తాగడానికి నీటిని తీసుకోవడానికి ముందుభాగంలో చిన్న కుళాయి ఉంటుంది.
పాత సంప్రదాయాలతో... ప్రకృతికి దగ్గరగా...
కర్నాటక లోని ముగడ్ గ్రామానికి చెందిన 58 సంవత్సరాల శేఖప్ప కుంబార్ చెరువు మట్టి, యూపటోరియం మొక్కను ఉపయోగించి దేశీయ ఫ్రిజ్‌ను తయారుచేశాడు. దీనివెనుక 25 సంవత్సరాల కృషి ఉంది. కొన్నిసార్లు ప్రయోగాలు విఫలమైనా మళ్లీ మళ్లీ ప్రయత్నించి సఫలం అయ్యాడు.
కంబార్ తయారు చేసిన ఫ్రిజ్‌లో రెండు వారాల పాటు కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకోవచ్చు. ఈ ఫ్రిజ్ పదిహేను లీటర్‌ల సామర్థ్యంతో విశాలంగా ఉంటుంది. దీనిని రెండు, మూడు అంగుళాల ఖాళీ వదిలి ఇసుకతో నింపిన ఒక చిన్న బాక్స్‌లాంటి దానిలో ఉంచాలి. దీన్ని ఇటుకలతో తయారు చేసుకోవచ్చు. వారానికి ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది,తాను తయారుచేసిన ఫ్రిడ్జ్‌కు మంచి స్పందన లభిస్తోందని చెబుతున్నాడు కంబార్.
కంబార్ తయారు చేసిన ఫ్రిడ్జ్‌ను గత ఏడాదిగా వాడుతున్న వినాయక్ హోంగల్ ఇలా అంటున్నాడు...
‘కూరగాయలు, పండ్లను మట్టి శుద్ధి చేయగలదని మేము నమ్ముతాము. ఈ ఫ్రిజ్‌ను ఉపయోగించడం ద్వారా మేము విద్యుత్తును ఆదా చేస్తున్నాం’
‘గ్లోబల్ వార్మింగ్‌లో విద్యుత్ వాటా 26 శాతం. దేశీయ ఫ్రిజ్‌ల వల్ల విద్యుత్ వాడకాన్ని ఎంతో కొంత తగ్గించవచ్చు. పర్యావరణ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఇది ప్రశంసనీయం’ అంటున్నారు సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఎక్స్‌పర్ట్ డా.ప్రకాష్ భట్.
‘ఆహా’ అనుకోవడానికే కాదు ‘దేశీయ ఫ్రిడ్జ్’వంటి ప్రత్యామ్నాయాల ద్వారా విద్యుత్ వినియోగం, కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ప్రకృతికి దగ్గరలో ఉండే గత జీవిత విధానాలను, వారి సరళమైన జీవితాలను అర్థం చేసుకోవడానికి కూడా ఈ ఆవిష్కరణలు ఉపకరిస్తాయి.
పర్యావరణ స్పృహతో జీవితాన్ని గడపడానికి, ప్రకృతిని ప్రేమించడానికి మార్గనిర్దేశం చేస్తాయి.
కావి ఫ్లోరింగ్ ఎంతో చల్లగా...హాయిగా!
మన దేశంలో తరతరాలుగా పర్యావరణ హితమైన, సహజ పద్ధతులు ఉనికిలో ఉన్నాయి అని చెప్పడానికి మరో ఉదాహరణ... కేరళలో మూడు వందల ఏళ్లుగా వాడుకలో ఉన్న ఒక ప్రత్యేకమైన నేల నిర్మాణ పద్ధతి. ‘కావి ఫోర్లింగ్’ అని పిలిచే ఈ సాంకేతికత వేసవి తీవ్రతలోనూ ఇళ్లను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిలో సిమెంట్, రసాయనాలు వాడరు. వేసవిలో మధ్యాహ్నపు ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ ‘కావి ఫ్లోర్’ మీద అడుగుపెడితే హాయిగా, చల్లగా ఉంటుంది!
కావి ఫ్లోర్ ప్రత్యేకత... అద్భుతమైన మన్నిక. కాలం గడిచేకొద్దీ దీని ఉపరితలం మరింత మెరుస్తూనే ఉంటుంది. అడుగుల రాపిడి దీనిని అరిగించకపోగా మరింత మెరుగుపరుస్తుంది. ఎటువంటి గీతలు పడకుండా ఇది ఏకంగా దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా నిలిచి ఉంటుంది.


