Mittal Patel: సంచారుల కేరాఫ్‌ అడ్రస్‌.. మిత్తల్‌ పటేల్‌

Mittal Patel has been putting nomadic and de notified tribes  - Sakshi

అవి చేద్దాం ఇవి చేద్దాం అని జీవితంలో ఎన్నో కలలు కంటుంటాం కానీ, అన్నీ నిజం కావు. కొంతమంది కలలు ఒకరకంగా ఉంటే వారి డెస్టినీ మాత్రం మరోలా ఉంటుంది. కొన్నిసార్లు కల చెదిరినప్పటికీ డెస్టినీ చూపిన మార్గంలో మరెంతోమంది కలలను నిజం చేసే అవకాశం లభిస్తుంది.  ఇలా లభించిన అవకాశంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది మిత్తల్‌ పటేల్‌. చిరునామా లేని వేలమందికి గుర్తింపు కార్డులతోపాటు, ఒక అడ్రెస్‌ను ఏర్పాటు చేసి, జనజీవన స్రవంతిలో కలుపుతోంది. 

గుజరాత్‌లోని సంఖల్‌పూర్‌లోని ఓ రైతు కుటుంబంలో పుట్టింది మిత్తల్‌ పటేల్‌. చిన్నప్పటి నుంచిఐఏఎస్‌ అధికారి కావాలనేది ఆమె కల. బీఎస్సీ అయ్యాక ఐఏఎస్‌ కోచింగ్‌ కోసం అహ్మదాబాద్‌ వెళ్లింది. ఒకపక్క ఐఏఎస్‌కు సన్నద్ధమవుతూనే గుజరాత్‌ విద్యాపీఠ్‌లో జర్నలిజం కోర్సులో చేరింది. ఇక్కడే ఆమె జీవితం పూర్తిగా మలుపు తిరిగింది. రెండు నెలల ఫెలోషిప్‌లో భాగంగా బార్డోలి గ్రామానికి వెళ్లింది మిత్తల్‌. అక్కడ ఓ సంచార తెగను చూసింది. ఈ తెగకు చెందిన వాళ్లలో కొందరు ఏవో చిన్నపాటి గుడ్డపీలికలు మాత్రమే ధరించడం, మరికొందరు అదీ లేకుండా అలాగే ఒకచోటనుంచి మరో చోటుకి వలస వెళ్తుండడం వల్ల రోజుల తరబడి తిండిలేక బక్కచిక్కిన శరీరాలను చూసి ఆమె చలించిపోయింది.

పేదరికం ఇంత దారుణంగా ఉంటుందా అనిపించింది మిత్తల్‌కు. వీరికోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది.   
 రెండేళ్ల పాటు సంచార జాతుల గురించి  పూర్తిగా తెలుసుకుని వారి కనీస అవసరాలు తీర్చి, వారికో గుర్తింపు ఇవ్వాలని పూనుకుంది. వీరి గురించి ఎంతోమంది అధికారులకు విన్నవించింది. వారికి సాయం చేయడానికి ఏ సీనియర్‌ అధికారీ ముందుకు రాలేదు. ప్రభుత్వ అధికారులే ఏం చేయలేనప్పుడు .. నేను ఆఫీసర్‌ను అయితే మాత్రం ఏం లాభం అనుకుంది. అప్పటిదాకా ఐఏఎస్‌ పరీక్షకు సిద్ధమైన మిత్తల్‌ ప్రిపరేషన్‌ను పక్కన పెట్టింది.  

 విచారత సంస్థాన్‌ 
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరిగే సంచార జాతులు ఒక్క గుజరాత్‌లోనే 40 రకాలు ఉన్నారు. ముఫ్పై నుంచి నలభై లక్షల వరకు జనాభా ఉండే ఈ సంచారులకు ఆధార్‌ కార్డు, ఓటరు కార్డు, జనన ధ్రువీకరణ, చిరునామా సంబంధిత పత్రాలు ఏవీలేవని గుర్తించింది. వీరికి కనీస అవసరాలు కల్పించడానికి పూర్తిస్థాయిలో పనిచేయాలనుకుంది. భర్త ప్రోత్సహించడంతో 2015 విచారత కమ్యునిటీ పేరిట ఎన్జీవోను ప్రాంభించింది. సంచార జాతులను వెతకడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.

వీరికి సంబంధించిన పెళ్లిళ్లు, ఇతర విందు వినోద కార్యక్రమాల వద్దకు వెళ్లి వారి గురించి వివరాలు అడిగేది. ఈమె ఎవరో ఏమిటో తెలియక మొదట్లో తిరస్కరించినప్పటికీ తరువాత ఆమెను నమ్మి తమ వివరాలు చెప్పేవారు. వాళ్లు నివసించే ప్రాంతంలో టెంట్‌ వేసుకుని మరీ వారి స్థితిగతులను అధ్యయనం చేసేది. ఈ క్రమంలోనే పద్నాలుగు వందల కుటుంబాలకు పక్కా ఇళ్లను సమకూర్చింది. విచారత ఆధ్వర్యంలో మూడు హాస్టల్స్‌ను నిర్మించింది. వీటిలో వందలమంది సంచారుల పిల్లలు చదువుకుంటున్నారు.  
ఐడెంటిటీతో అందర్ని కదిలించింది 
గుజరాత్‌ ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు అందరి చుట్టూ తిరిగి సంచారులకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని వినతి పత్రం సమర్పించింది. చివరికి 2010లో తొంబై వేలమంది సంచారులకు రాష్ట్రప్రభుత్వం ఐడెంటిటీ కార్డులు జారీ చేసింది. ఇదే సమయంలో విచారత సంస్థాన్‌ ‘అమె పన్‌ చియే’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా సంచారులకు ఐడెంటిటీ కార్డులు అందించారు.

అప్పట్లో ఈ కార్యక్రమం అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలను ఆకర్షించింది. దీంతో ఆ తరువాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోల్లో పార్టీలన్నీ సంచారులకు అనేక హామీలు ఇచ్చాయి. ఊరు, పేరు లేని సంచారులకు ఐడెంటిటీని కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషించిన మిత్తల్‌ని 2017లో ‘నారీ రత్న’ అవార్డు వరించింది. దాదాపు పదిహేనేళ్లుగా సంచారుల అభ్యున్నతికి పాటుపడుతోన్న మిత్తల్‌ ప్రస్తుతం రాజాస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలోని సంచార, బంజార జాతుల అభివృద్ధే లక్ష్యంగా నిర్విరామంగా కృషిచేస్తోంది.  

చదవండి: అన్నాఖబాలే దుబా..: సేవలో.. ది బెస్ట్‌!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top