ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)...మరింత సహజంగా | Mira Murati Thinking Machine Labs Reveal Interaction Model | Sakshi
Sakshi News home page

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)...మరింత సహజంగా

May 15 2026 6:00 AM | Updated on May 15 2026 6:00 AM

Mira Murati Thinking Machine Labs Reveal Interaction Model

టెక్నో ఉమెన్‌

‘రోబో’ సినిమాలో చిట్టి(రోబో) దూకుడు చూసి... ‘అయ్‌ బాబోయ్‌... ఎంతైనా యంత్రం యంత్రమేనండీ. అది మనిషిలా ఎందుకు స్పందిస్తుంది!’ అనుకున్నాం. ఏఐ టూల్స్‌ మొదట్లో అబ్బురపరిచినా...  మనుషులతో పోల్చితే ఎక్కడో ఏదో లోపం కనిపించడం మొదలైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ.ఐ. టూల్స్‌లో సహజమైన మానవీయ స్పందనలు తీసుకురావడానికి ‘ఇంటరాక్షన్‌ మోడల్స్‌’తో నడుం కట్టారు ‘ఓపెన్‌ ఏఐ’ మాజీ సీటీవో, ‘థింకింగ్‌ మెషిన్‌ ల్యాబ్స్‌’ ఫౌండర్‌ మీరా మురాటి.... ఏ.ఐ. విప్లవ కాలంలో ఉన్నాం మనం. అయితే ఏఐ అనేది చాలావరకు వాకి–టాకిలా పనిచేస్తోంది అనే అభిప్రాయం ఉంది.

భవిష్యత్‌ సూచన
మనం ఏదైనా అడుగుతాం. ఆగి, విని, ఆలోచించి చివరికి సమాధానం ఇస్తుంది ఏఐ సాధనం. ఆ తర్వాత మళ్లీ వేచి చూస్తుంది. చాట్‌జీపీటి, జెమిని, క్లాడ్, గ్రోక్‌... ఏది ఉపయోగిస్తున్నా దాదాపుగా ప్రతి ఏఐ సాధనం ‘టర్న్‌–బేస్డ్‌’ నమూనానే అనుసరిస్తోంది. మొదట మనుషులు మాట్లాడతారు. ఆ తరువాత యంత్రాలు స్పందిస్తాయి. ఈ విధానంపై సిలికాన్‌ వ్యాలీలోని ఏఐ దిగ్గజాలు పెదవి విరుస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఏఐ రంగానికి సంబంధించి ‘భవిష్యత్‌లో ఏం జరగబోతుంది?’ అనేదానికి సంబంధించి ‘థింకింగ్‌ మెషిన్‌ ల్యాబ్స్‌’ ఒక సిగ్నల్‌ ఇచ్చింది. కేవలం ప్రాంప్ట్‌లకు సమాధానం ఇవ్వడానికి కాకుండా, సూచనల కోసం వేచి చూసే చాట్‌బాట్‌లా కాకుండా కొలీగ్‌తో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలాంటి  సహజత్వాన్ని ఏఐ సాధనాలలో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది మీరా మురాటి.

ఇక ముందు అలా ఉండదు!
ఏఐ సాధనాలు ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తాయి. వినియోగదారులు(యూజర్‌లు) మాట్లాడినప్పుడు లేదా టైప్‌ చేసినప్పుడు మోడల్‌ ఆ అభ్యర్థనను ప్రాసెస్‌ చేసి ఆ తర్వాతే స్పందిస్తుంది. ఈ విధానాన్ని మార్చడానికి సంభాషణలను 200–మిల్లీ సెకన్‌ల చిన్న చిన్న భాగాలుగా ప్రాసెస్‌  చేసే సిస్టమ్‌లతో ప్రయోగాలు చేస్తోంది మీరా కంపెనీ థింకింగ్‌ మెషిన్‌ ల్యాబ్స్‌. దీనివల్ల వ్యక్తి మాట్లాడుతుండగానే ఏఐ స్పందించగలుగుతుంది.

తక్కువ లేటెన్సీ అంటే...
‘ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అభిప్రాయం ఏర్పడడానికి సంభాషణ మొత్తం పూర్తి కానక్కర్లేదు. ఇక ఏఐ సాధనాల విషయానికి వస్తే... అవి సంభాషణ మొత్తం ముగిసే వరకు వేచి ఉండి దానిని ప్రాసెస్‌ చేసి, ఆ తరువాతే  దాని గురించి ఆలోచిస్తాయి. తక్కువ లేటెన్సీ అంటే ఒక కంప్యూటింగ్‌ సిస్టమ్‌ లేదా నెట్‌వర్క్‌ తక్కువ ఆలస్యంతో ప్రతిస్పందించే సామర్థ్యం. ఈ నేపథ్యంలో మీరా మురాటి థింకింగ్‌ మెషిన్‌ ల్యాబ్స్‌ ప్రయోగాలు అతిపెద్ద బలంగా మారనున్నాయి. థింకింగ్‌ మెషిన్‌ ల్యాబ్స్‌కు సంబంధించి రియల్‌–టైమ్‌ ఇంటరాక్షన్‌ సిస్టమ్, ఇంటరాక్షన్‌ మోడల్స్‌ విషయానికి వస్తే మనతో మాట్లాడుతూనే ఈ మోడల్‌ ఆలోచించగలదు. చూడగలదు. ఇది చాలా శక్తిమంతమైన మోడల్‌’ అంటున్నారు ఏఐ ఎక్స్‌పర్ట్, ది కటింగ్‌ ఎడ్జ్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు అన్ష్‌ మెహ్రా.

భారీ మార్పు
ఏఐ రూపాన్ని గణనీయంగా తీర్చిదిద్దడంలో ఇంటరాక్షన్‌–మోడల్స్‌ కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఆదేశాలను ఎలా టైప్‌ చేయాలో, సమర్థవంతంగా ఎలా శోధించాలో, సూచనలను ఎలా ఇవ్వాలో యంత్రాలకు నేర్పించాం. ఇప్పుడు ఆ యంత్రాలు మావవ ప్రవర్తన, స్పందనలకు  మరింత సహజంగా అలవాటు పడేలా చేయడానికి ....‘టు మేక్‌ ఏఐ ఫీల్‌ లెస్‌ మెషిన్‌ అండ్‌ మోర్‌ హ్యూమన్‌’ నినాదంతో మీరా మురాటి మానస పుత్రికలు ‘ ఇంటరాక్షన్‌ మోడల్స్‌’ రంగం మీదికి వచ్చాయి.
 
భారీ మార్పు... ఇంటరాక్షన్‌– స్మాల్‌
‘ ఇంటరాక్షన్‌ మోడల్స్‌ రూపంలో భారీ మార్పు సాంకేతికపరమైనది మాత్రమే కాదు తాత్విక పరమైనది కూడా’ అంటున్నారు నిపుణులు. ‘ఇంటరాక్షన్‌–స్మాల్‌’  అని పిలువబడే ఈ సిస్టమ్‌ ప్రస్తుతం పరిశోధన దశలో ఉంది. దీని ఫలితాలు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

దీనిలో కొన్ని కీలక ఫీచర్లు...
’ సీమ్‌లెస్‌ డైలాగ్‌ మేనేజ్‌మెంట్‌:
మాట్లాడే మనిషి ఆలోచిస్తున్నారా, ఒత్తిడిలో ఉన్నారా...ఇలాంటి విషయాలను ఈ మోడల్‌ పరోక్షంగా ట్రాక్‌ చేస్తుంది.

’వెర్బల్‌ అండ్‌ విజువల్‌ ఇంటర్‌జెంక్షన్స్‌: యూజర్‌లు మాట్లాడడం పూర్తి చేసే వరకు వేచి చూడకుండా, సందర్భాన్ని బట్టి ప్రతిస్పందించడానికి ఈ మోడల్‌ అనుమతిస్తుంది

’సైమన్‌టెనీయస్లీ స్పీచ్‌
‘లైవ్‌ ట్రాన్స్‌లేషన్‌’లాంటి సందర్భంలో యూజర్, మోడల్‌ ఒకే సమయంలో మాట్లాడేలా వీలు కల్పిస్తుంది.

’ కంకరెంట్‌ టూల్‌ 
మాట్లాడుతూనే, వింటూనే శోధించడానికి, బ్రౌజ్‌ చేయడానికి, యుఐ (యూజర్‌ ఇంటర్‌ఫేస్‌) రూపొందించడానికి వీలుకల్పించే సాధనాలను ఏకకాలంలో ఉపయోగిస్తుంది.

’ టైమ్‌ అవేర్‌నెస్‌
సంభాషణల సమయంలో గడిచిన సమయాన్ని మోడల్‌కు తెలియజేస్తుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement