కొరియన్ డ్రామా, కే–సిరీస్, కే–పాప్, కొరియన్ ఫిల్మ్స్.. గత కొన్నేళ్లుగా ఇదొక గ్లోబల్ ట్రెండ్. కొరియన్ డ్రామాలకు, యాక్టర్లకు, కొరియన్ స్టైల్, ఫ్యాషన్‌కు గ్లోబల్ ఫ్యాన్స్ ఉన్నారు. అంతెందుకు కొరియన్ ఫుడ్ కూడా కొత్త ట్రెండ్. దేశంతో పాటు హైదరాబాద్ నగరంలోనూ విశేష ఆదరణ పొందుతున్న కొరియన్ ట్రెండ్ నేపథ్యంగా కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. నగరంలోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్‌లో సోమవారం ప్రారంభమైన ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ప్రముఖ కే–డ్రామా దర్శకుడు, నిర్మాత ‘యూ ఇన్‌షిక్’ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొరియన్ టెలివిజన్ వేదికగా తానొక ఉప్పెన.., ఎక్స్‌ట్రా ఆర్డినరీ అటార్నీ వూ, డాక్టర్ రొమాంటిక్, వాగాబాండ్ వంటి సిరీస్‌లతో కొరియాలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి ఫ్యాన్‌బేస్ సంపాదించుకున్నారు. ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ‘యూ ఇన్‌షిక్’ సాక్షితో తన అనుభవాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
నేను ఇండియా రావడం ఇదే మొదటి సారి. భారత్ ఎంతో వైవిధ్యమున్న దేశం. సంస్కృతి–సంప్రదాయాల పరంగా భారతీయత ఇష్టం. ముఖ్యంగా హైదరాబాద్ రాగానే తిన్న బిర్యానీ నచి్చంది. వాస్తవానికి భారత్‌కు కొరియాకు సాంస్కృతికంగా, చరిత్ర పరంగా దగ్గరి పోలికలున్నాయి. సినిమాల పరంగా చూస్తే.. కొరియా సంస్కృతి, ప్రేమ కొంచెం విభిన్నమైనవి.
నా డ్రామాలకు దర్శకత్వం వహిస్తున్న సమయంలో ఇంతలా హిట్ అవుతాయని అస్సలు అనుకోలేదు. ఓటీటీలు, గ్లోబల్ సినిమా వేదిక ద్వారా నా జీవితమే మారిపోయింది. హైదరాబాద్ వచ్చాక నా డ్రామాలన్నీ చూస్తున్నారా అని షాక్ అయ్యాను. ఫ్యాన్స్ కొరియన్ సిరీస్‌లు, డ్రామాలు సజెస్ట్ చేయమని అడిగారు. వారందరికీ.. నా డా.రొమాంటిక్, యాక్షన్ ఫేం వాగాబాండ్ చూడమని చెబుతాను. అంతేకాకుండా 60 ఎపిసోడ్స్ ఉన్న ఫేమస్ కొరియన్ సిరీస్ జాయింట్ డ్రామా రిఫర్ చేస్తున్నా.
ట్రిపుల్ ఆర్.. త్రీ ఇడియట్స్ ఇష్టం..
కల్చరల్ షేరింగ్‌లో భాగంగా ఇండియన్ సినిమా–కొరియన్ సినిమాలు కలిసి పనిచేసే ఆవశ్యకత ఉంది. అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద సినిమా మార్కెట్ భారత్‌లో ఉంది. ఇక్కడి స్కిల్, టెక్నాలజీ, వీఎఫ్‌ఎక్స్ ప్రమాణాలు అద్భుతం. హిట్ సిరీస్ స్క్విడ్ గేమ్‌లో భారతీయ నటుడు అనుపమ్ త్రిపాఠి నటించారు. మరో కే పాప్‌లో ఇండియన్ గర్ల్ కూడా చేశారు.
భారతీయ సినిమాల్లో ఆర్‌ఆర్‌ఆర్, త్రీ ఇడియట్స్, వైట్ టైగర్ సినిమాలంటే చాలా ఇష్టం. దర్శకుని ఇమాజినేషన్ చూసి ఆశ్చర్యపోయా. మా సినిమాల్లోని ఏడుపు, సంతోషం అన్నీ కలిసి రేపు ఎలా బతకాలో నేరి్పస్తాయి. అయితే హింస ఎక్కువుందనుకుంటారు. కానీ సెన్సార్ చాలా కఠికంగా ఉంటుంది. స్మోకింగ్ సీన్స్ అనుమతి కోసం చాలానే కష్టపడాల్సి వచ్చింది.
(చదవండి: ‘జయ హో’ ..! ప్రతికూల పరిస్థితుల్లో ఆనందాన్ని వెతుక్కోవడం అంటే ఇదే..!)


