
కొడుకు వైష్ణవ్‌తో మాధురి
ఈ రెండు ఫొటోలు చూడండి. ఇక్కడ ఉన్నది 40 ఏళ్ల తల్లి.. 17 సంవత్సరాల కుమారుడు. ఇద్దరూ ఒకేసారి సేమ్ కాలేజీలో డిగ్రీ కోర్సు చేరారు. వేరే వేరే గ్రూపులే. కాని లాంగ్వేజ్ క్లాసుల్లో కలిసి కూచుంటారు. తల్లీ కొడుకు ఒకే కాలేజీలో ఒకే క్లాసులో కలిసి చదువుకుంటూ ఉంటే చదువుకునే వారికి అడ్డు లేదనిపిస్తుంది. అక్షరాస్యత మెండుగా ఉన్న కేరళలోది ఈ దృశ్యం.
ఎర్నాకుళం నుంచి గంటన్నర దూరంలో ఉండే చిన్న ఊరు సత్యమంగళం. అక్కడే ఉంది ఎం.ఏ. డిగ్రీ కాలేజీ. రోజూ ఉదయాన్నే ఆ కాలేజీకి ఈ సంవత్సరం ఒక స్కూటీ వస్తోంది. ముందు తల్లి కూచుని నడుపుతూ ఉంటుంది. వెనుక కొడుకు కూచుని ఆమెతో పాటు వస్తారు. చూసేవారు కొడుకును కాలేజీలో దించి ఆమె వెళ్లిపోతుందని అనుకుంటారు. తప్పు. ఆమె స్కూటీని పార్క్ చేసి చక్కా ఒక క్లాస్‌లోకి వెళుతుంది. కొడుకు మరో క్లాస్‌లోకి వెళతారు. అందాక వాళ్లు తల్లీకొడుకులు. కాలేజీలో అడుగు పెట్టాక డిగ్రీ విద్యార్థులు. చాలా అరుదుగా కనిపించే ఈ దృశ్యం ఎందరికో ముచ్చట గొలుపుతోంది. చదువు మధ్యలో ఆపిన తల్లులు తమ పిల్లలతో పాటు కాలేజీ చదువు కొనసాగిస్తే ఎంతో బాగుంటుంది కదా.
తల్లి బి.ఏ.. కొడుకు బి.కామ్
40 ఏళ్ల మాధురి ఈ సంవత్సరం ఎం.ఏ కాలేజీలో బి.ఏలో చేరింది. ఆమె కొడుకు వైష్ణవ్ బీకాంలో చేరాడు. ఇద్దరివీ వేరే వేరే గ్రూప్‌లైనా లాంగ్వేజ్ క్లాసులు కామన్‌గా వినాలి. అప్పుడు పక్కపక్కన కూచుని హాయిగా క్లాసులు వింటారు. మధ్యాహ్నం ఇద్దరూ కలిసి భోజనం చేసి మళ్లీ క్లాసులకు చలో. కాలేజీ పూర్తయ్యాక స్కూటీ మీద ఆమె కొడుకును వెంటబెట్టుకుని ఇల్లు చేరుకుంటుంది.
మలయాళ సాహిత్యం అంటే ఆసక్తి ఉన్న మాధురి బి.ఏ ఇంగ్లిష్‌లో చేరడం ఇష్టమే అంటోంది. మంచి ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన వైష్ణవ్ స్పోర్ట్స్ కోటాలో బి.కామ్. సీటు సాధించాడు. ఇప్పుడు తల్లి తనతో పాటు కాలేజీకి రావడంతో సంతోషంగా ఉన్నాడు. ‘మీ ఫ్రెండ్స్ ఏమైనా ఎగతాళి చేస్తున్నారా మీ అమ్మను చూసి’ అనంటే ‘ఎగతాళి ఎందుకు... ఇందులో వాళ్లు ఎగతాళి చేయడానికి ఏమీ లేదు... నేను ఇబ్బంది పడే విషయం అంతకన్నా లేదు. ఆమె చదువుకోవడానికి కాలేజీకి వచ్చింది’ అంటాడు వైష్ణవ్.
ఎన్నో ఏళ్ల కల
మాధురికి డిగ్రీ చదవాలని ఎప్పటి నుంచో ఉంది. కాని ఇంటర్ కావడంతోటే పెళ్లి... వెంట వెంటనే ఇద్దరు పిల్లలు.. సంసారంలో పడి కుదరలేదు. కాని బస్ కండక్టర్‌గా పని చేసే ఆమె భర్త బిను భార్య కోరికను గౌరవించాడు. చదువుకోమని చాలాసార్లు కోరాడు. ఇన్నాళ్లకు మాధురికి కుదిరి బి.ఏ.లో చేరింది. ‘క్లాసులో ఉన్న విద్యార్థులు నా వయసు కాకపోయినా వెంటనే స్నేహం చేశారు. వారితో కలగలిసి పోవడం నాకు ఇబ్బంది కాలేదు’ అంది మాధురి.
ఇలా తల్లీకొడుకు చదువుకోవడం పట్ల కాలేజీ అధ్యాపకులు, ప్రిన్సిపాల్ కూడా సంతోషంగా ఉన్నారు. ‘ప్రతి ఒక్కరికీ చదువుకునే హక్కు ఉంది. మనం అవకాశం కల్పించాలి’ అన్నాడా కాలేజీ ప్రిన్సిపాల్. మాధురిలా చదువుకోవాలని ఉన్న గృహిణులు ప్రయత్నిస్తే సాధ్యం అవుతుంది. ప్రయత్నించాలి అంతే.