
హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల సమ్మేళనంతో పాటు విభిన్న కళలకు గమ్యస్థానంగా నిలుస్తోంది. ఈ ఆనవాయితీ ఈనాటిది కాదు. నిజాం కాలం నుంచే వినూత్న, విదేశీ కళలకూ ప్రసిద్ధిగాంచింది. ఇందులో భాగంగానే నగర వేదికగా ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎఫ్) నిర్వహించనున్నారు. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి విభిన్న నగరాల నుంచి ప్రముఖ ఆర్టిస్టులు ఈ కళా ఉత్సవంలో తమ కళలను ప్రదర్శించనున్నారు.
2011 నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబయి నగరాల్లో నిర్వహించే ఈ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ రెండో ఎడిషన్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ట్ ఫెస్టివల్‌తో పాటు ఫ్యూజన్ షోలు, లైవ్ మ్యూజిక్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ‘ది ఎటర్నల్ కాన్వాస్ – 12,000 ఇయర్స్ జర్నీ త్రూ ఇండియన్ ఆర్ట్’ ప్రదర్శన హైలైట్‌గా నిలువనుంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ప్రదర్శనలో ప్రతి రాష్ట్రం నుంచి కళాకారులు పాల్గోనున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా 25 ఆర్ట్ గ్యాలరీలతో, 100 ఎయిర్ కండిషన్డ్ స్టాల్స్, దేశవ్యాప్తంగా 50 మంది దిగ్గజ కళాకారులతో పాటు దాదాపు 200 మంది ప్రముఖ, యువ, ఔత్సాహిక కళాకారులు రూపొందించిన 3,500 పైగా వైవిధ్యమైన పెయింటింగ్స్, శిల్పాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆర్ట్ ఫెస్టివల్ రేతిబౌలి (మెహదీపట్నం) పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 68 దగ్గరున్న కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్‌లో ఏప్రిల్ 4 నుంచి 6వ తేదీ వరకూ 11:00 నుంచి రాత్రి 8:00 గంటల వరకూ కొనసాగుతుంది.
ప్రముఖ కళాకారుల ప్రదర్శన..
ప్రముఖ కళాకారులు జోగెన్ చౌదరి, మను పరేఖ్, క్రిషేన్ ఖన్నా, శక్తి బర్మన్, సీమా కోహ్లీ, పరేశ్ మెయితీ, యూసుఫ్ అరక్కల్, ఎస్ జి వాసుదేవ్, అంజోలీ ఎలా మీనన్, అతుల్ దోడియా, లక్ష్మా గౌడ్, టి వైకుంఠం, చింతల జగదీశ్, గిగి సర్కారియా, ఎంవి రమణా రెడ్డి, లక్ష్మణ్ ఏలె, అశోక్ భౌమిక్, గురుదాస్ షెనాయ్, జతిన్ దాస్, పి జ్ఞాన, రమేశ్ గోర్జాల తదితర ప్రముఖ కళాకారుల కళారూపాలు
ప్రదర్శనలో కనువిందు చేయనున్నాయి.
వైవిధ్యమైన కళావేదిక..
కళాకారులు తమ నెట్‌వర్క్ మరింతగా పెంచుకోడానికి, భిన్న రంగాలకు చెందిన ప్రేక్షకుల ఎదుట తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది చక్కటి వేదిక. తమ ఇళ్లను చక్కని సృజనాత్మక కళాఖండాలతో అందంగా అలంకరించుకోవాలని ఉవ్విళ్ళూరే నగర యువతకు ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ చక్కని వేదికగా నిలుస్తుంది.
చదవండి: స్మితా సబర్వాల్ అలా అనడం బాధాకరం
యువ, మిడ్–కెరీర్ కళాకారులు తమ కళాకృతులను పలువురు దిగ్గజ కళాకారులతో పాటు ప్రదర్శించడానికి ‘వన్–స్టాప్ ఆర్ట్ షాప్’గా ఈ వేదిక నిలుస్తుంది. హైదరాబాద్ నగరం నుంచి ఆర్ట్స్‌బ్రీజ్ ఆర్ట్ గ్యాలరీ, గ్యాలరీ సెలెస్టే, ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ, స్నేహా ఆర్ట్స్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వంటి సంస్థలు తమ కళాకృతులను ప్రదర్శిస్తున్నారు.
– రాజేంద్ర, డైరెక్టర్ –ఇండియా ఆర్ట్ ఫెస్టివల్