
అందాల పోటీలను వ్యతిరేకించిన మహిళా సంఘాలు
మహిళలను గౌరవించే, వారి ఔన్నత్యాన్ని చూపించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి (Mallu Laxmi) అన్నారు. మంగళవారం హైదరాబాద్ (Hyderabad) బాగ్‌లింగంపల్లిలోని ఐద్వా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. విభిన్నమైన కళా వారసత్వం ఉన్న తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలను స్వాగతిస్తున్నామని ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) అనడం బాధాకరమని అన్నారు. అందాల పోటీ లంటే మహిళల శరీరాలను అవమానించడం తప్ప మరోటి కాదని పేర్కొన్నారు.
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క (Vimalakka) మాట్లాడుతూ మహిళల అందాలను కొలతల చూపడం, అర్ధ నగ్న సౌందర్యాన్ని ప్రదర్శించడం అవమానకరమని అన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అందాల పోటీల మీద ఖర్చుపెట్టే బదులు ప్రజలకు విద్యా, వైద్య సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు అనసూయ, ఐద్వా అధ్యక్షురాలు అరుణజ్యోతి, కేఎన్ ఆశాలత, ఝాన్సీ, స్వరూప, ఇందిర పాల్గొన్నారు.
అందాల పోటీలు రద్దు చేయాలని ఆందోళన
భారతదేశ నైతిక విలువలు, సాంస్కృతిక నైతికతను దిగజార్చే అసభ్యకరమైన అందాల పోటీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేశారు. హైదరాబాద్‌లో మే 7 నుంచి 31 వరకు జరిగే 72వ మిస్ వరల్డ్–2025 (Miss World 2025) అందాల పోటీలను వ్యతిరేకిస్తూ మంగళవారం హిమాయత్‌నగర్ జంక్షన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగాభారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు సృష్టించడంలో, మహిళల భద్రతను పెంచడంలో, మహిళలపై హింసాత్మక చర్యలను అరికట్టడంలో విఫలమైందన్నారు. సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీనియర్ నాయకురాలు పి.ప్రేమ్ పావని మాట్లాడుతూ.. అసలే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం మరింత భారం కాదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పడాల నళిని, ఎస్.ఛాయాదేవి, ఫైమీద, ఎన్.కరుణ కుమారి, జ్యోతి శ్రీమాన్, షహనా అంజూమ్, రొయ్యల గిరిజ, ఎం.లక్ష్మి, కె.అరుణ వి.కమల, ఎ.దేవమ్మ, సీహెచ్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
చదవండి: హెచ్‌ఎండీఏ ‘మెగా మాస్టర్‌ప్లాన్–2050’పై భారీ కసరత్తు