ఆమెదే ఆస్కార్‌! | Women Dominated The 98th Academy Awards | Sakshi
Sakshi News home page

ఆమెదే ఆస్కార్‌!

Mar 17 2026 4:04 AM | Updated on Mar 17 2026 4:05 AM

Women Dominated The 98th Academy Awards

ఉత్తమ చిత్రం ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’, దర్శకుడు పాల్‌ థామస్‌ ఆండర్సన్, నటుడు మైఖేల్‌ బి. జోర్డాన్, నటి జెస్సీ బక్లీ

నాలుగు అవార్డులు సాధించిన ‘సిన్నర్స్‌’

ఆస్కార్‌లో ఆమె నిలిచింది... చరిత్ర సృష్టించేలా గెలిచింది... కెమెరాలో ‘ఆమె’, క్యాస్టింగ్‌లో ‘ఆమె’, సాంగ్‌లో ‘ఆమె’, కాస్ట్యూమ్స్‌లో ‘ఆమె’, యానిమేషన్‌ నిర్మాణంలో ‘ఆమె’... ఇలా సాంకేతిక విభాగాల్లో పురుషులతో పోటీ పడి ‘ఆమె’ ఆస్కార్‌ దక్కించుకుంది. 98వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ‘ఆమె’ తన సత్తా చాటింది. ప్రతిభతో ‘ఆస్కార్‌ ఆమెదే’ అని నిరూపించింది. టోటల్‌గా ఈసారి ‘ఫిమేల్‌ డామినేషన్‌’ కనిపించింది.  ఇంకా ఆస్కార్‌ అవార్డులు సాధించిన విజేతలు, ఇతర విశేషాల్లోకి...

‘‘ఈ రోజు నేను ఆస్కార్‌ వేదికపై ఉన్నానంటే ఇందుకు కారణం సిడ్నీ పోయిటియర్, డెంజెల్‌ వాషింగ్టన్, హాలీ బెర్రీ, జేమీ ఫాక్స్, ఫారెస్ట్‌ విటేకర్, విల్‌ స్మిత్‌ (జోర్డాన్‌ కంటే ముందు ఆస్కార్‌ అవార్డులు అందుకున్న నల్లజాతి నటులు). ఈ దిగ్గజాల బాటలో నిలబడటాన్ని గౌరవంగా భావిస్తున్నాను.  నాకు అండగా నిలుస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్న నా తల్లికి, నా కోసం ఘనా నుంచి ఇక్కడకు వచ్చిన నా తండ్రికి ధన్యవాదాలు. 
– ఉత్తమ నటుడు మైఖేల్‌ బి. జోర్డాన్‌


⇒  ఈ సినిమా కథను నా పిల్లల (పెర్ల్, లూసిల్లే, జాక్, మిన్నీ) కోసమే రాశాను. మనం వాళ్లకు ఓ గందరగోళ ప్రపంచాన్ని అందిస్తున్నాం. ఇందుకు వారికి మనం ముందుగా క్షమాపణలు చె΄్పాలి. అదే సమయంలో మనల్ని మనం కూడా సరిదిద్దుకోవాలని, మానవత్వాన్ని తిరిగి ఇచ్చేయాలనే ఓ ఆశతో కూడా ఈ కథ రాశాను. నా ప్రయాణంలో భాగమైన నా భార్య మాయా రుడాల్ఫ్‌కు థ్యాంక్స్‌. ఈ అత్యున్నత పురస్కారాన్ని అందించిన అకాడమీకి థ్యాంక్స్‌. – ఉత్తమ దర్శకుడు పాల్‌ థామస్‌ ఆండర్సన్‌

ఒక్క షాట్‌తో క్రికెటర్‌ సిక్సర్‌ కొట్టినట్లు ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ ఆస్కార్‌ వేదికపై సిక్సర్‌ కొట్టింది. ఆరు అవార్డులు సాధించి, హాట్‌ టాపిక్‌గా నిలిచింది. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో డాల్బీ థియేటర్‌ వేదికగా మార్చి 15న (భారతీయ కాలమానం ప్రకారం సోమవారం) హాలీవుడ్‌ హాస్య నటుడు కోనన్‌ ఓబ్రియన్‌ వ్యాఖ్యాతగా 98వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మొత్తం 24 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశారు.

పాల్‌ థామస్‌ అండర్సన్‌ దర్శకత్వం వహించిన అమెరికన్‌ బ్లాక్‌ కామెడీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ సినిమా ఆరు విభాగాల్లో (ఉత్తమ చిత్రం, దర్శకుడు, సహాయ నటుడు, అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, క్యాస్టింగ్‌) సిక్సర్‌ కొట్టింది. ఆస్కార్‌ చరిత్రలోనే అత్యధికంగా 16 నామినేషన్స్‌ను దక్కించుకుని, అందరి దృష్టినీ ఆకర్షించిన అమెరికన్‌ హారర్‌ ఫిల్మ్‌ ‘సిన్నర్స్‌’ నాలుగు విభాగాల్లో (ఉత్తమ నటుడు, ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్‌ స్కోర్‌) మాత్రమే అవార్డులు సాధించింది. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ డ్రామా ‘ఫ్రాంకైన్‌ స్టీన్‌’కు మూడు అవార్డులు లభించాయి. ‘కే పాప్‌ డిమాన్‌ హంటర్స్‌’ చిత్రాన్ని రెండు అవార్డులు వరించాయి.

‘వెపన్స్, అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్, ఎఫ్‌1, సెంటిమెంటల్‌ వేల్యూ’ చిత్రాలు ఒక్కో అవార్డును గెలుచుకున్నాయి. ఉత్తమ నటుడిగా మైఖేల్‌. బి. జోర్డాన్, నటిగా జెస్సీ బక్లీ, సహాయ నటి విభాగంలో ఎమీ మాడిసన్‌ తొలిసారి ఆస్కార్‌ అవార్డులు అందుకోగా, ఉత్తమ సహాయ నటుడు విభాగంలో సీన్‌ పెన్‌కు  మూడో ఆస్కార్‌ అవార్డు వచ్చింది. ఉత్తమ దర్శకుడిగా పాల్‌ థామస్‌ ఆండర్సన్‌ అవార్డును అందుకున్నారు. 98 ఏళ్ల ఆస్కార్‌ చరిత్రలో సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డు సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు ఆటం డ్యూరాల్డ్‌ అర్కాపా. అలాగే ఈ ఏడాది తొలిసారి ప్రవేశపెట్టిన బెస్ట్‌ క్యాస్టింగ్‌ విభాగంలో కాసాండ్రా కులుకుండిస్‌ అవార్డు అందుకుని, ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా, తొలి మహిళగా నిలిచారు.

ఆరో నల్ల జాతీయుడు... తొలి ఐరిష్‌ మహిళ
‘సిన్నర్స్‌’ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి, అద్భుతమైన నటన కనబరిచిన మైఖేల్‌ బి. జోర్డాన్‌కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ఆస్కార్‌ అవార్డు సాధించిన ఆరో నల్ల జాతీయుడిగా మైఖేల్‌ రికార్డు సృష్టించారు. అంతేకాదు... ఉత్తమ నటుడు విభాగంలో తొలిసారి లభించిన నామినేషన్‌తోనే మైఖేల్‌ ఆస్కార్‌ అవార్డును ముద్దాడటం విశేషం. ఇక ‘హామ్నెట్‌’లో ఆగ్నేస్‌ పాత్రలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన జెస్సీ బక్లీ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. జెస్సీకి ఇదే తొలి ఆస్కార్‌ అవార్డు. అలాగే ఉత్తమ నటి విభాగంలో ఆస్కార్‌ అవార్డు అందుకున్న తొలి ఐరిష్‌ మహిళగా కూడా ఆమె రికార్డులకెక్కారు.

⇒ ముచ్చటగా మూడు: దర్శకుడు పాల్‌ థామస్‌ అండర్సన్‌ ఆస్కార్‌ కల నెరవేరింది. 98వ ఆస్కార్‌ అవార్డులకు ముందు ఆయనకు పదకొండు ఆస్కార్‌ నామినేషన్స్‌ ఉన్నాయి. కానీ ఒక్క అవార్డు కూడా రాలేదు. కాగా 98వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ఆయన (ఉత్తమ చిత్రం, దర్శకుడు, అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే) విభాగాల్లో నామినేషన్స్‌ సాధించారు. ఈ మూడు విభాగాల్లోనూ అవార్డులు లభించాయి.

సీన్‌... అన్‌సీన్‌!
‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’కి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు గెలుచుకున్న సీన్‌ పెన్‌ వేడుకకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. సీన్‌... అన్‌సీన్‌ అని గుసగుసలు వినిపించాయి. అతను ఉక్రెయిన్‌లో ఉండటం వల్ల హాజరు కాలేదనే ప్రచారం జరుగుతోంది. ఇక యాక్టింగ్‌ విభాగంలో మూడు ఆస్కార్‌ అవార్డులు సాధించిన ఎనిమిదో వ్యక్తిగా సీన్‌ పెన్‌ నిలిచారు.

‘‘ఇక్కడ ఉన్న అద్భుతమైన మహిళలందరికీ ధన్యవాదాలు. మీ ప్రతిభ నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఇక ఫ్రెడ్‌ (భర్తని ఉద్దేశించి)... నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నువ్వు అద్భుతమైన నాన్నవి... నా బెస్ట్‌ ఫ్రెండ్‌వి. ఇక మా చిన్న అమ్మాయి ఇస్లా వయసు ఎనిమిది నెలలు. ఏం జరుగుతుందో తనకు తెలియదు. బహుశా పాలు కావాలని కలలు కంటూ ఉంటుంది.

నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ నీ తల్లిగా ఉండటానికి ఇష్టపడతాను. నా ఐరిష్‌ కుటుంబం ఇక్కడ ఉంది. కలలు కనడం, వాటిని సాకారం చేసుకునేలా అండగా నిలబడటం నుంచి అన్ని నేర్పించినందుకు ధన్యవాదాలు అమ్మానాన్న. ఈ రోజు యూకేలో మదర్స్‌ డే. ఈ వారం మా పాపకి ఒక పన్ను వచ్చింది. ఈ రోజు ఉదయం నా గుండెలను హత్తుకుని నిద్రపోయింది. ఈ తల్లి సాధించిన అవార్డుని నీ అందమైన హృదయానికి అంకితం చేయాలనుకుంటున్నాను’’.          – నటి జెస్సీ బక్లీ

ఆస్కార్‌ ఇన్‌ మెమోరియమ్‌లో కోట
ఆస్కార్‌ అవార్డు వేడుకలో భాగంగా ‘ఇన్‌ మెమోరియమ్‌’ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా సినీరంగం కోసం కృషి చేసిన గొప్ప కళాకారులను స్మరించుకుంటూ వీడియోను ప్రదర్శించారు. ఆస్కార్‌ కమిటీ నివాళులర్పించిన వారిలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కోట శ్రీనివాసరావు, బాలీవుడ్‌కి చెందిన ధర్మేంద్ర, మనోజ్‌ కుమార్, దక్షిణాది తార బి. సరోజాదేవి వంటి దిగ్గజాలు ఉన్నారు.

అయితే వీరి గురించి వేదికపై ప్రస్తావించినప్పుడు ధర్మేంద్రను చూపించకపోవడం భారతీయ ప్రేక్షకులను ఆగ్రహానికి గురి చేసింది. ధర్మేంద్ర అభిమానులు ఆస్కార్‌ ప్రతినిధులపై మండిపడుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. సమయాభావం వల్ల వీడియోలో కొందరినే చూపారని... ఆ తర్వాత అందరి పేర్లను ఆస్కార్‌ అధికారిక వెబ్‌ సైట్‌లో పొందుపరిచారని టాక్‌.

‘‘నేత కార్మికులకు, కళాకారులకు, నా టీమ్‌కి, మా పనిని గుర్తించిన అకాడమీకి ధన్యవాదాలు’’ అంటూ కన్నీళ్లు ఆపుకోవడానికి కష్టపడుతూనే కాస్ట్యూమ్‌ విభాగంలో ‘ఫ్రాంకైన్‌స్టైన్‌’ సినిమాకి అవార్డు అందుకున్న ఆనందాన్ని పంచుకున్నారు కేట్‌ హాలే. అలాగే తాను చేసే సరదా పనులు, చిరాకు పెట్టే పనులను భరిస్తున్న తన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారామె.

‘‘అవార్డ్స్‌లో కొత్తగా క్యాస్టింగ్‌ కేటగిరీని చేర్చినందుకు అకాడమీకి థ్యాంక్స్‌. ఒక సినిమాకి నటీనటులను సెట్‌ చేయడానికి అవిశ్రాంతంగా పోరాడుతున్న క్యాస్టింగ్‌ డైరెక్టర్లకు థ్యాంక్స్‌. సినిమాలో తమ పేరు కూడా రాని క్యాస్టింగ్‌ డైరెక్టర్లకు ఈ అవార్డుని అంకితం చేస్తున్నా’’.–  కాసాండ్రా  కులుకుండిస్‌

‘వెపన్‌’ సినిమాలోని నటనకు గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో ఎమీ మాడిగన్‌ తొలిసారి ఆస్కార్‌ అవార్డును సాధించారు. కాగా 1986లో జరిగిన 58వ ఆస్కార్‌ అవార్డుల్లో ఇదే విభాగంలో అవార్డు కోసం ‘ట్వైస్‌ ఇన్‌ ఏ లైఫ్‌టైమ్‌’ అనే చిత్రంలోని నటనకు గాను ఎమీ మాడిగన్‌కు నామినేషన్‌ దక్కినా, అవార్డు రాలేదు. ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత ఆమెకు 98వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ఉత్తమ సహాయ నటి విభాగంలోనే నామినేషన్‌ లభించి, అవార్డు రావడం విశేషం. ఇలా ఒక ఆస్కార్‌ నామినేషన్‌కి, మరో ఆస్కార్‌ నామినేషన్‌కు మధ్య 40 ఏళ్ల గ్యాప్‌ ఉండి, అవార్డు సాధించిన ఘనత మాత్రం ఎమీ మాడిగన్‌కే దక్కుతుంది.

కెమెరా... ఆమె మూడో కన్ను
ఉత్తమ సినిమాటోగ్రఫీకి అకాడమీ అవార్డు గెల్చుకున్న తొలి మహిళగా, శ్వేతజాతియేతర తొలి మహిళగా చరిత్ర సృష్టించారు అమెరికన్‌ సినిమాటోగ్రాఫర్‌ ఆటం డ్యూరాల్డ్‌ అర్కాపావ్‌. ‘సిన్నర్స్‌’ సినిమాకు ఆస్కార్‌ అందుకున్నారు. కాలేజీ చదువు పూర్తయిన తరువాత ఆటం కొంతకాలం ప్రకటనల రంగంలో పని చేశారు. ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగు పెట్టి,  కెమెరా అసిస్టెంట్‌గా పని చేశారు. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సినిమాటోగ్రాఫర్స్‌లో సభ్యురాలిగా చేరారు.

2025 చిత్రం ‘సిన్నర్స్‌’ సినిమాను ఐమాక్స్‌15–పెర్ఫ్‌ అండ్‌ అల్ట్రా పానా విజన్‌ 70 కెమెరాలను ఉపయోగించి 65 ఎంఎం ఫిల్మ్‌పై చిత్రీకరించారు.‘నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. నా బాల్యం, కుటుంబంపై ప్రభావం చూపిన వ్యక్తి’ అని పోరాట యోధుడైన తన తాత పాగన్‌ బటిస్టా గురించి చెబుతుంటారు ఆటం. ‘నేను ఇక్కడ నిలబడడాన్ని  గౌరవంగా భావిస్తున్నాను.  ఇంకా ఎంతోమంది మహిళలు ఇక్కడ నిలబడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు లేకుండా నేను ఇక్కడకి రాలేను అని నాకు తెలుసు’ అంటూ చిత్రపరిశ్రమలో పని చేస్తున్న మహిళలకు ఆస్కార్‌ వేడుకలో కృతజ్ఞతలు తెలియజేశారు ఆటం.

ఆస్కార్‌ విజేతలు 
⇒ ఉత్తమ చిత్రం: వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌ ∙దర్శకుడు: పాల్‌ థామస్‌ ఆండర్సన్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌) ⇒  నటుడు: మైఖేల్‌ బి. జోర్డాన్‌ (సిన్నర్స్‌) ∙నటి: జెస్సీ బక్లీ (హామ్నెట్‌) ∙సహాయ నటుడు: సీన్‌ పెన్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌) ∙సహాయ నటి : ఎమీ మాడిగన్‌ (వెపన్స్‌) ∙సినిమాటోగ్రఫీ: ఆటం డురాల్డ్‌ అర్కపా (సిన్నర్స్‌) 

⇒ ఎడిటింగ్‌: యాండీ జుర్గెన్‌సన్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌) 
⇒ఒరిజినల్‌ స్కోర్‌: లుడ్విగో గోరాన్సన్‌ (సిన్నర్స్‌)
⇒  ఒరిజినల్‌ సాంగ్‌: గోల్డెన్‌ సాంగ్‌ (కె–పాప్‌ డిమాన్‌ హంటర్స్‌) 
⇒ అంతర్జాతీయ చిత్రం: సెంటిమెంటల్‌ వేల్యూ (నార్వే) 

⇒ సౌండ్‌: గరేత్‌ జాన్, ఏఐ నెల్సన్, గ్వెన్‌డాలిన్‌ యేట్స్‌ విర్టల్, గేరీ ఎ. రిజో, జాన్‌ పెరల్ట (ఎఫ్‌ 1) 
⇒ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిలిం: మిస్టర్‌ నోబడీ ఎగైన్‌స్ట్‌ పుతిన్‌ 
⇒ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం: ఆల్‌ ద ఎమ్టీ రూమ్స్‌ 
⇒ విజువల్‌ ఎఫెక్ట్స్‌: జో లెటరి, రిచర్డ్‌ బనెహం, ఎరిక్‌ సైండన్, డేనియల్‌ బారెట్‌ (అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌)

⇒్రపొడక్షన్‌ డిజైన్‌: టమరా డేవెరల్, షేన్‌ వ్యూ (ఫ్రాంకైన్‌స్టీన్‌) ∙ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ర్యాన్‌ కూగ్లర్‌ (సిన్నర్స్‌)
⇒ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: పాల్‌ థామస్‌ ఆండర్సన్‌ (వన్‌ బాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌) 
⇒ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: మైక్‌ హిల్, జోర్డాన్‌ సామ్యూల్, క్లియోనా ఫ్యూరే (ఫ్రాంకెన్‌స్టీన్‌) 

⇒ కాస్ట్యూమ్‌ డిజైన్‌: కేట్‌ హాలే (ఫ్రాంకెన్‌స్టీన్‌) 
⇒ క్యాస్టింగ్‌: కాసాండ్రా కులుకుండిస్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌) 
⇒ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం: ద గర్ల్‌ హు క్రైడ్‌ పాల్స్‌ 

⇒ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిలిం: కె–పాప్‌ డిమాన్‌ హంటర్స్‌
లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం: ద సింగర్స్, టూ పీపుల్‌ ఎక్సే ్చంజింగ్‌ సలైవా.

ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, రిలయన్ ్స అధినేత ముఖేశ్‌ అంబానీ కుమార్తె ఈషా అంబానీ భర్త ఆనంద్‌ పిరమాల్‌తో కలిసి ఆస్కార్‌ వేడుకలో పాల్గొన్నారు. ప్రముఖ ఇటలీ డిజైనర్‌ వాలెంటినో ఫాల్‌/వింటర్‌ వింటేజ్‌ కలెక్షన్  గౌను, చోకర్‌ స్టైల్‌ డైమెండ్‌ నెక్లెస్‌లో ఈషా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ప్రతిబింబించడంతో పాటు ఇండియన్  సినిమాకు మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈషా అంబానీ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆస్కార్‌ వేడుకలో పాల్గొనడం ఆమెకు ఇదే తొలిసారి

98వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో భారతీయ నటి ప్రియాంకా చోప్రా సందడి చేశారు. స్పానిష్‌ నటుడు జేవియర్‌ బార్డెమ్‌తో కలిసి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో అవార్డు సాధించిన నార్వేజియన్‌ డ్రామా ‘సెంటిమెంటల్‌ వేల్యూ’ సినిమా యూనిట్‌కు అవార్డు అందించారామె. ఈ విభాగంలో అవార్డు సాధించిన తొలి నైజీరియన్‌ ఫిల్మ్‌గా ‘సెంటిమెంటల్‌ వేల్యూ’ నిలిచింది. అవార్డును ప్రదానం చేసే సమయంలో ‘యుద్ధం వద్దు... పాలస్తీనాకు స్వేచ్ఛ కావాలి’ అన్నట్లుగా జేవియర్‌ నినాదం చేయగా, ప్రియాంకా చోప్రా మద్దతు ఇస్తున్నట్లుగా హావభావాలు పలికించారు. ఆస్కార్‌ వేదికపై ఇది చర్చనీయాంశమైంది.

బెస్ట్‌ లైవ్‌ యాక్షన్  షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో టై అవడం విశేషంగా నిలిచింది. ఈ విభాగంలోని అవార్డుకు ‘టూ పీపుల్‌ ఎక్సే ్చంజ్‌ సలైవా’, ‘ది సింగర్స్‌’ చిత్రాలు పోటీపడ్డాయి. ఈ రెండు సినిమాల్లో ఏ మూవీకి అవార్డు వస్తుందోననే ఆసక్తి నెలకొంది. బెస్ట్‌ లైవ్‌ యాక్షన్  షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ‘టూ పీపుల్‌ ఎక్సే ్చంజ్‌ సలైవా’, ‘ది సింగర్స్‌’ విజేతలుగా నిలిచాయి. ఈ జాబితా టై అయింది’ అని ప్రజెంటర్‌ కుమాయిల్‌ నంజియాని తెలిపారు. ఈ విభాగంలోని రెండు చిత్రాల విజేతలకు నటుడు కుమాయిల్‌ నంజియాని అవార్డు అందించారు. కాగా 98 ఏళ్ల ఆస్కార్‌ చరిత్రలో ఇలా టై అవడం ఇది ఏడోసారి అట.

ఈ అవార్డు కొరియన్ల కోసమే... 
‘కేపాప్‌ డిమాన్‌ హంటర్స్‌’ సినిమాకు యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్, ఒరిజినల్‌ సాంగ్‌ (‘గోల్డెన్‌’ పాటకు) విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులు వచ్చాయి. యానిమేషన్‌ విభాగంలో డిస్నీ, పిక్సార్‌ సంస్థలు నిర్మించిన సినిమాలు కాకుండా వేరే యానిమేటెడ్‌ సినిమాకు రెండు ఆస్కార్‌ అవార్డులు రావడం ఇదే తొలిసారి. సౌత్‌ కొరియన్‌ సాంగ్‌ రైటర్లు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో అవార్డులు సాధించారు. ‘కేపాప్‌ డిమాన్‌ హంటర్స్‌’ చిత్రాన్ని మాగీ కాంగ్, క్రిస్‌ అపెల్‌హాన్స్‌ ద్వయం దర్శకత్వంలో  మిచెల్లీ వాంగ్‌ నిర్మించారు.

యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డును స్వీకరించే సమయంలో మాగీ కాంగ్‌ మాట్లాడుతూ – ‘ఈ అవార్డు కొరియా కోసం... ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొరియన్ల కోసం’ అంటూ కాస్త ఉద్వేగంగా మాట్లాడారు. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో అవార్డును స్వీకరిస్తూ కిమ్‌ యున్‌–జే భావోద్వేగానికి లోనయ్యారు. ‘నన్ను తక్కువగా చూసేవారి మధ్య పెరిగాను. ఇప్పుడు వారందరూ మా పాటలు పాడుతున్నారు. అంతటా కొరియన్‌ లిరిక్స్‌ వినిపిస్తున్నాయి. ఇది సక్సెస్‌ మాత్రమే కాదు. ధైర్యానికి స్ఫూర్తి’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement