‘సానుకూల శక్తి’కి నిలువెత్తు నిదర్శనం ఆమె..! | Hina Khan Was Searched The Most On Google | Sakshi
Sakshi News home page

పాజిటివ్‌ పవర్‌: హీనాఖాన్‌ ధైర్యానికి ఎవ్వరైన ఫిదా కావాల్సిందే..!

Dec 15 2024 11:40 AM | Updated on Dec 15 2024 11:42 AM

Hina Khan Was Searched The Most On Google

చెడు కాలం చెప్పి రాదు. కెరీర్‌లో బిజీగా ఉన్న టైమ్‌లో అలాంటి కాలం ఒకటి బాలీవుడ్‌ నటి హీనాఖాన్‌కు వచ్చింది. అయితే అది చెడు కాలం అని ఆమె అనుకోలేదు. ‘ఇది పరీక్ష కాలం’ అని మాత్రమే అనుకుంది. పరీక్షకు నిలబడాలంటే ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహమే శక్తి అవుతుంది. ఉత్సాహం దండిగా ఉన్న హీనాఖాన్‌ ఆ పరీక్షను తట్టుకొని నిలబడుతూ ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది.

‘గూగుల్‌ ఇయర్‌ ఇన్‌ సెర్చ్‌ గ్లోబల్‌ లిస్ట్‌–2024’లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన నటుల్లో హీనాఖాన్‌ 5వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఎంతో మంది ఖాన్‌ను అభినందిస్తున్నారు. ఆమె మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ‘చాలా మంది నన్ను అభినందించడం చూస్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే ఇది విజయం, గర్వించదగిన విషయం అనుకోవడం లేదు’ అని రాసింది. ఆరోగ్య సవాళ్ల కంటే వృత్తిపరమైన విజయాలతోనే తనను గుర్తించాలనే విషయాన్ని అంతర్లీనంగా చెప్పింది ఖాన్‌.

‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ అనే సీరియల్‌లో అక్షర పాత్రలో నటించి పాపులారిటీని పెంచుకున్న ఖాన్‌ బిగ్‌ బాస్, ఖత్రోస్‌ కే ఖిలాడీలాంటి రియాలిటీ షోలలో పాల్గొని పాపులారిటీని మరింత పెంచుకుంది. జూన్‌ 2024లో రొమ్ము క్యాన్సర్‌ గురించి బహిరంగంగా వెల్లడించింది హీనాఖాన్‌. ‘ఇది సవాలుతో కూడినది అయినప్పటికీ ధైర్యం కోల్పోలేదు. చికిత్స ఇప్పటికే మొదలైంది. దీని నుంచి మరింత బలంగా బయటపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది.

ప్రస్తుతం కీమో థెరపీ చేయించుకుంటున్న ఖాన్‌ తన చికిత్స గురించి, తన ఛాలెంజింగ్‌ జర్నీ గురించి ఎప్పటికప్పుడు ఫాలోవర్‌లతో అప్‌డేట్స్‌ పంచుకుంటోంది. వృత్తిపరమైన విజయాలతోనే తనను గుర్తించాలని హీనాఖాన్‌ కోరుకుంటున్నప్పటికీ క్లిష్టమైన సమయాల్లో ఆమె చూపిన ధైర్యానికి ఎంతో మంది అభిమానులు అయ్యారు. సినిమా కష్టాలు ఖాన్‌కు నిజంగానే వచ్చినప్పటికీ సానుకూల శక్తితో పెదవులపై చిరునవ్వు కోల్పోలేదు.గుండెలో ధైర్యం కోల్పోలేదు.

అందుకే నటిగానే కాదు ‘సానుకూల శక్తి’ విషయంలోనూ హీనాఖాన్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ‘హీనాఖాన్‌ అసాధారణ ధైర్యానికి ఉదాహరణగా నిలుస్తుంది. కారుచీకట్లో కూడా కాంతిని కనుగొనే సామర్థ్యం ఆమెలో ఉంది’ అంటూ నెటిజనులు ప్రశంసిస్తున్నారు.

ఎంత బిజీగా ఉంటే అంత సంతోషంగా ఉంటాను!
మంచి రోజులు, చెడు రోజులు ఉంటాయి. మంచి రోజుల్లో ఎలా ఉన్నా చెడు రోజుల్లో మాత్రం ఉత్సాహంగా ఉండాలి. ఆ ఉత్సాహమే సానుకూల శక్తి ఇస్తుంది. సానుభూతి మాటలు విని బేలగా మారిపోకూడదు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి. నాకు ఖాళీగా కూర్చోవడం కంటే పని చేయడం, బిజీగా ఉంటేనే ఉత్సాహంగా ఉంటుంది.
– హీనాఖాన్‌ 

(చదవండి: భారతీయ రెస్టారెంట్‌కు ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ పురస్కారం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement