
ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ‘హ్యూమన్ కోరియానిక్ గొనాడోట్రాపిన్’ (హెచ్‌సీజీ) అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఒకరకంగా ఈ హర్మోన్ మహిళ దేహానికి ఓ సందేశం ఇస్తుంది. ‘ఇక గర్భధారణ ప్రక్రియ మొదలైంది. కాబట్టి నెలసరి వచ్చే ప్రక్రియను ఆపేసి, గర్భధారణ ప్రక్రియ కోసం అవసరమైన ప్రోజెస్టెరాన్‌ను స్రవించమనీ, తద్వారా... అండం ఇమిడి ఉండే ఎండోమెట్రియమ్–యుటెరైన్ పొరలను మరింత మందంగా చేసి, గర్భాన్ని కాపాడమ’ని చెప్పేదే ఈ హెచ్‌సీజీ హార్మోన్.
ఇది కొద్దిమందిలో చాలా తక్కువగానూ, మరికొందరిలో ఎక్కువగానూ విడుదల అవుతుంది. ఆ ప్రభావంతో మహిళల్లో వారి వారి శరీర తత్త్వాన్ని బట్టి కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఎక్కువగానూ వాంతులు అవుతుంటాయి. మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళలకు తమకు చాలా ఎక్కువగా వాంతులు అవుతున్నాయనీ, దాంతో కడుపులోని బిడ్డకు అందాల్సిన పోషకాలు అందవేమోనని ఆందోళనపడాల్సిన అవసరం లేదు.
ఇలాంటి మహిళలు రోజూ కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తింటుండాలి. కొవ్వులు, మసాలాలూ ఎక్కువ మోతాదులో ఉండే హెవీ ఫుడ్ కాకుండా... చాలా తేలిగ్గా ఉండి, సులువుగా జీర్ణమయే ఆహారం తీసుకుంటూ ఉండటం మేలు. దవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. అంటే... కొబ్బరినీళ్లు, మజ్జిగ, పండ్లరసాలు, ఎలక్ట్రాల్ ద్రవాలు, గ్లూకోజునీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు కూడా ఎక్కువగానే తింటూ ఉండటం మంచిది. పచ్చళ్లు, నూనెవస్తువులు వీలైనంత తక్కువగా తీసుకోవాలి.
వాంతులు అవుతున్నా దాన్ని విస్మరించి, ఏదో ఒకటి తింటూ ఉండండి. ఎందుకంటే... వాంతులవుతున్నందున అసలే తినకపోతే ఎసిడిటీ వల్ల కడుపులో యాసిడ్ పేరుకొని పసరువాంతులు, రక్తపువాంతులు అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటివారు అవసరమైనప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని యాంటాసిడ్ మందులు, వాంతులను, వికారాన్ని తగ్గించే మందులైన యాంటీఎమెటిక్ మందులను వాడవచ్చు. మరీ నీరసంగా ఉంటే సెలైన్ ఎక్కించుకోవడం/గ్లూకోజ్ పెట్టించుకోవడం కూడా అవసరం కావచ్చు. అలాంటప్పుడు తప్పనిసరిగా డాక్టర్/గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.