నేను గర్భిణిని, ఆ జబ్బు ఉందని రిపోర్ట్‌లో తేలింది!

Gestational Diabetes: Diagnosis, Treatment - Sakshi

సందేహం

మేడం.. నా వయసు 23 ఏళ్లు. నాకు పెళ్లయి రెండేళ్లవుతోంది. నాకిప్పుడు ఐదో నెల. ఇటీవల చేయించుకున్న పరీక్షల్లో నాకు డయాబెటిస్‌ ఉన్నట్లు తేలింది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
– ప్రమీల, నందికొట్కూరు

సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత హార్మోన్లలో మార్పుల వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ పెరగడం, అధిక బరువు, వయసు పెరగడం, శరీరతత్వం బట్టి, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల రక్తంలో షుగర్‌ శాతం పెరగడం జరుగుతుంది. దానిని డయాబెటిస్‌గా గుర్తిస్తారు. ముందు నుంచి షుగర్‌ లేకుండా గర్భధారణ సమయంలోనే షుగర్‌ పెరగడాన్ని జెస్టేషనల్‌ డయాబెటిస్‌ అంటారు. ఇది సాధారణంగా 6 నెలల తర్వాత బయటపడుతుంది. ముందు నుంచే ఘగర్‌ ఉండి తర్వాత గర్భం దాలిస్తే దానిని ప్రీ–డయాబెటిస్‌ అంటారు.

నీకు ఇప్పుడు వయసు 23 సంవత్సరాలే. నీ బరువు, ఎత్తు ఎంత ఉన్నావో రాయలేదు. ఈ వయసుకు ఐదో నెలకే డయాబెటిస్‌ ఉందని తేలింది. అంటే, మీ కుటుంబంలో తల్లిదండ్రుల్లో ఎవరికైనా డయాబెటిస్‌ ఉందా అని తెలియవలసి ఉంది. షుగర్‌ లెవెల్స్‌ ఇప్పుడే పెరిగాయా? ముందు రక్త పరీక్షలు చేయించుకోలేదు కాబట్టి ముందు నుంచే ఉండి తెలియకుండా ఉండవచ్చు కూడా. ఒకసారి రక్త పరీక్షలలో హెచ్‌బీఏ1సీ అనే పరీక్ష చేయించుకుంటే ముందు మూడు నెలల నుంచి రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది.

కాబట్టి, డయాబెటిస్‌ ముందు నుంచి ఉందా లేదా ఇప్పుడే వచ్చిందా అనేది అంచనా వెయ్యవచ్చు. డయాబెటిస్‌ ప్రెగ్నెన్సీలోనే వస్తే, సరైన చికిత్సతో షుగర్‌ లెవెల్స్‌ అదుపులో పెట్టుకుంటే తల్లికి, బిడ్డకి కాంప్లికేషన్స్‌ ఎక్కువ లేకుండా బయటపడచ్చు. ఒకవేళ నీకు హెచ్‌బీఏ1సీ ఎక్కువ ఉంటే డయాబెటిస్‌ ముందు నుంచే ఉండి ఉండవచ్చు. డయాబెటిస్‌ ముందు నుంచే ఉండి, షుగర్‌ అదుపులో లేకపోతే మొదటి మూడు నెలల్లో అబార్షన్లు, బిడ్డ ఎదుగుదలలో, గుండె, వెన్నుపూస వంటి అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఉమ్మనీరు పెరగటం, బిడ్డ బరువు అధికంగా పెరగటం, నెలలు నిండకుండా కాన్పు అవ్వటం, మరీ షుగర్‌ లెవెల్స్‌ అధికంగా ఉంటే బిడ్డ కడుపులోనే చనిపోవటం, సాధారణ కాన్పు సమయంలో ఇబ్బందులు, సిజేరియన్‌ ఆపరేషన్‌ అవసరం ఎక్కువగా ఉండడం, కాన్పు తర్వాత అధిక రక్తస్రావం వంటి సమస్యలు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే డయాబెటిక్, లేదా జనరల్‌ ఫిజీషియన్, లేదా ఎండోౖక్రెనాలజిస్ట్‌ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా షుగర్‌ టెస్టులు చేయించుకుంటూ, షుగర్‌ లెవెల్స్‌ నియంత్రణలో ఉంచుకోవటానికి, వారి సలహా మేరకు మెట్‌ఫార్మిన్‌ మాత్రలు, ఇన్సులిన్‌ ఇంజక్షన్‌లు తీసుకుంటూ, మితమైన ఆహార నియమాలు(ఆహారంలో అన్నం తక్కువ, తీపి పదార్థాలు తక్కువ తీసుకుంటూ) పాటించవలసి ఉంటుంది.

నీకు ఇప్పుడు ఐదవ నెల కాబట్టి, 18–20 వారాల సమయంలో టిఫా స్కానింగ్‌ చేయించుకుంటే అందులో బిడ్డలో అన్ని అవయవాలు సరిగా ఉన్నాయా, ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది తెలుస్తుంది. అలాగే 6వ నెలలో ఫీటల్‌ 2డి ఇకో స్కానింగ్‌ చేయించుకుంటే గుండెలో రంధ్రాలు, ఇంకా ఏమైనా లోపాలు ఉంటే తెలుస్తాయి. గైనకాలజిస్ట్‌ దగ్గర క్రమం తప్పకుండా చెకప్‌లు చేయించుకుంటూ, బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది అని 8వ నెలలో స్కానింగ్, 9వ నెలలో డాప్లర్‌ స్కానింగ్‌ వంటివి చేయించుకుంటూ, డాక్టర్‌ సూచనలు పాటిస్తూ, వారిచ్చిన ఐరన్, కాల్షియం ఇంకా అవసరమైన మందులను వాడుకుంటూ ఉంటే, కాంప్లికేషన్స్‌ ముందుగా గుర్తించే అవకాశాలు ఉంటాయి. అలాగే సమస్యలు ఎక్కువ కాకుండా తగిన సమయానికి పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు.
- డా.వేనాటి శోభ, గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top