నీటి విలువ నేర్పుదాం! | Geetha Bhascker create awareness about the importance of art in a child life | Sakshi
Sakshi News home page

నీటి విలువ నేర్పుదాం!

May 17 2026 5:54 AM | Updated on May 17 2026 5:54 AM

Geetha Bhascker create awareness about the importance of art in a child life

సమ్మర్‌ కిడ్స్‌

సినీ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్‌ తల్లి గీతాభాస్కర్‌. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్‌ టీచర్‌గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్‌ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్‌ కోర్సులను అందిస్తున్నారు ఆమె. ప్రస్తుతం ‘ఇండ్‌ఫేమ్‌’ పేరుతో పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్‌ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్‌ ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

→ ‘‘పిల్లలకు థియరీగా చెప్పడం కంటే వారి నుంచి క్రియేటివిటీని రాబట్టడం ద్వారా మనో వికాసాన్ని కలిగించడం సులువు. కాకపోతే వారు చేస్తున్న పనుల్లో మనమూ ఇన్‌వాల్వ్‌ అవ్వాలి. 
→ పిల్లలకు ఊహ తెలుస్తున్న దగ్గరనుంచే వారిచేత వివిధ రకాల యాక్టివీటీస్‌ చేయించవచ్చు. ఈ ప్రయత్నంలో భాగంగా మన జీవనానికి ఆధారమైన ‘నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం’ ఇలా పంచభూతాల గురించి ఈ వేసవిలో పరిచయం చేద్దాం.
→ పంచ భూతాలలో నీరు ప్రాణాధారమైనదనే విషయం పెద్దలుగా మనకు తెలుసు. ఈ విషయాన్ని పిల్లలకు ఎలా చెప్పాలి..?! తల్లిదండ్రులు లేదా టీచర్లు పిల్లల వయసును బట్టి 5 విభాగాలుగా తీసుకోవాలి.
→ నర్సరీ, ప్రీ ప్రైమరీ నుంచి 2 వ తరగతి వరకు, 3–5 తరగతులు, 6–7 తరగతుల వారీగా తీసుకొని, విజువల్‌ ఆర్ట్‌ ద్వారా చూపించమనాలి.  

ఇలా చెప్పి చూడండి... 
నీటిచుక్క పరిమాణం, నీళ్లు వివిధ పాత్రలలో పోస్తే వచ్చే మార్పు.. ను డ్రాయింగ్‌ ద్వారా చూపమనవచ్చు.

నీటి మాట
→ నీటి ద్వారా ఎలక్ట్రిసిటీ వస్తుంది. పంటలు పండుతాయి. ఇలాగే ఇంకేం లభిస్తాయి? పిల్లలనే అడగండి. 
→ నీటి వనరులు లేని చోట వాతావరణం ఉండే విధానం, పరిష్కారం కూడా సూచించమనాలి.
→ నీటి శుభ్రత గురించి ఏమేం చేయవచ్చో వారినే ఆలోచించి, ప్రెజెంట్‌ చేయమనాలి.
→ వాటర్‌ వర్డ్స్‌ .. నీటికి సంబంధించిన పదాలతో క్రాస్‌ పజిల్స్, డూడుల్స్, సాంగ్స్‌... కళాత్మకమైన సందేశాన్ని ఇవ్వమని చెప్పవచ్చు. 
→ రోజువారీ జీవన విధానంలో నీటి ప్రాముఖ్యత గురించి పిల్లలను చెప్పమని ప్రోత్సహిస్తూ, వారిచేత వివిధ రకాల యాక్టివిటీస్‌ను చేయించవచ్చు. ఆరోగ్యకరమైన పోటీని కూడా పిల్లల మధ్య పెట్టవచ్చు. పిల్లలు నీటి గురించి చేసే ఎన్నో విన్యాసాలకు వాళ్లే కాదు, పెద్దలూ నవ్వుతారు. తమ గురించి స్వచ్ఛమైన మనసులు పడే తపనను చూసి నీటి చుక్కలు కూడా అందంగా నవ్వుతాయి.

ఇలా చెబుదాం...
→ దాహం వేసినప్పుడు ఏం తాగుతాం. 
→ నీళ్లను ట్రేలో పోసి, ఫ్రిజ్‌లో పెడితే ఐస్‌క్యూబ్స్‌గా ఎలా అవుతాయి. బయటకు తీస్తే ఐస్‌ క్యూబ్‌ కరిగిపోయి తిరిగి నీళ్లుగా ఎలా మారుతాయి. 
→ హిమాలయాలు ఎందుకు అంతగా చల్లగా ఉంటాయి, అవి కరగడం వల్లనే నీళ్లు మన దాకా వస్తున్నాయా?
→ కూరగాయలు, పండ్లు ఎలా వస్తాయి? 
→ నీళ్లతో స్నానం చేస్తే మైండ్, బాడీ కూల్‌ అండ్‌ ఫ్రెష్‌ ఎందుకు అవుతుంది.
→ వేసవిలో చెరువు నీళ్లలోకి దిగి ఈత కొట్టాలనిపిస్తుంది కదా, అలా దిగినప్పుడు ఆ నీళ్లు చల్లగా ఎందుకు ఉంటాయి. 
→ చెరువులు, కుంటలు, నదులు, బ్యాక్‌ వాటర్, సముద్రం... భూమి మీద నీరు ఎక్కడెక్కడ ఉంటుంది, భూమిలోపలకు నీళ్లు ఎలా చేరుతాయి, మనం ఎన్ని విధాలుగా నీళ్లను వాడుకుంటున్నాం. చెట్లు నీళ్లు ఎలా తాగుతాయి.. ఇవన్నీ పిల్లలనే అడగాలి. ఇలా నీటికి సంబంధించిన ప్రతీ ఉపయోగం.. కథ, నాటకం, డ్రాయింగ్, ప్రయోగ రూపం... ఏదైనా పిల్లల నుంచే వచ్చినదై ఉండాలి.

పొదుపు ఇలా...
తాగు నీళ్ల కోసం కుళాయిల వద్ద, వేసవిలో ట్యాంకర్ల వద్ద జరిగే నీటి యుద్ధాల గురించి మనకు పరిచయమే. ఈ విషయాన్ని పిల్లలకు చెప్పలేం. భవిష్యత్తులో నీటియుద్ధాలు రాకుండా ఉండాలంటే నీటి పొదుపు గురించి వారి ఆలోచనల ద్వారానే చెప్పించవచ్చు.
→ షవర్‌తో కాకుండా బకెట్‌ నీళ్లతో స్నానం చేయమనాలి. పూర్తి బకెట్‌ నీళ్లు కాకుండా అందులో నుంచి మరికొన్ని తగ్గించి వాడమనాలి ∙బట్టలు ఉతికిన నీళ్లను తిరిగి ఏ విధంగా ఉపయోగించవచ్చో చెప్పమనాలి.
→ నీళ్లు తిరిగి భూమిలోకి ఎలా ఇంకుతాయో చూపమనాలి. ఈ విధానం వల్ల నీటి పిల్లల్లో నీటి వృధాను తగ్గించవచ్చు అనే ఆలోచన వస్తుంది.

నిర్వహణ: నిర్మలారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement