సంకల్పమే శక్తి స్వరూపం..! | dussehra 2025: Heroine Geeth Saini Said Her festival dasar Celebrations | Sakshi
Sakshi News home page

సంకల్పమే శక్తి స్వరూపం..!

Oct 2 2025 9:47 AM | Updated on Oct 2 2025 9:47 AM

dussehra 2025: Heroine Geeth Saini Said Her festival dasar Celebrations

పల్లెటూరి అమ్మాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలనుకుంటుంది. కానీ ఎన్నో అడ్డంకులు. ఆటంకాలు. ఆడపిల్లకు అవసరమా అని ప్రశ్నలు. అయితే సంకల్పమే శక్తిగా ఆ అమ్మాయి అనుకున్నది సాధిస్తుంది. ఓటీటీలో విశేష ఆదరణ పొందుతున్న ‘కన్యాకుమారి’లో హీరోయిన్‌ గీత్‌ షైనీతన సంకల్పాల గురించి దసరా దాండియా గురించి చెబుతున్న విశేషాలు. 

‘నేను చిన్నప్పటి నుంచి ఎంతో బాగా చదువుకున్నాను. స్కూలు ఫస్ట్‌ వచ్చాను. కాలేజీ ఫస్ట్‌ వచ్చాను. ఎంసెట్‌లో ర్యాంక్‌ తెచ్చుకున్నాను. అయినా సరే నా కోరికలు ఏవీ మీరు పట్టించుకోలేదు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అవుతానంటే డిగ్రీలో చేర్పించారు. ఇంత తెలివి పెట్టుకుని చీరల కొట్టులో సేల్స్‌గర్ల్‌లా చీరలు అమ్ముకుంటున్నాను’ అని తల్లిదండ్రులను, అన్నయ్యను నిలదీసి తన వేదనను చెప్పుకుంటుంది కన్యాకుమారి అనే అమ్మాయి ‘కన్యాకుమారి’ సినిమాలో.కన్యాకుమారిది ఒకటే కల. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలనేది. 

కాని ఇంటి పరిస్థితులు, అమ్మాయి అనే కారణంతో చదివించక΄ోవడం... ఇవన్నీ ఆమె కలలను సగంలోనే తుంచేస్తాయి. కాని కన్యాకుమారి తన కలను లోలోపల సజీవంగా ఉంచుకుంటుంది. తను ప్రేమించిన వ్యక్తి ప్రేమను గౌరవిస్తూనే, రైతుగా ఉండాలనే అతని అభిలాషను గౌరవిస్తూనే తన లక్ష్యం తీవ్రతను అందరికీ తెలియచేసి హైదరాబాద్‌కు వెళ్లి సాఫ్ట్‌వేర్‌ కోర్సులు చేయడమే కాదు పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని అమెరికాకు కూడా వెళ్లి వచ్చి అప్పుడు పెళ్లి చేసుకుంటుంది.

ఇటీవల ఇలాంటి పట్టుదల ఉన్న అమ్మాయి కథ తెలుగులో లేదు. అందుకే ఓటీటీలో ‘కన్యాకుమారి’ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆ పాత్ర పోషించిన గీత్‌ సైనీకి ప్రేక్షకులు ఫుల్‌మార్కులు వేస్తున్నారు. గీత్‌తో సంభాషణ:

మీ పేరు తెలుగు పేరనిపించడం లేదు.
గీత్‌ సైనీ: మా పూర్వికులది రాజస్థాన్‌. మా తాతల కాలంలోనే అదిలాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. అదిలాబాద్‌లో నేను పుట్టి పెరిగాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో మా కుటుంబం సెటిల్‌ అయ్యింది. మా నాన్న టీచర్‌. అమ్మ హౌస్‌ వైఫ్‌. 

యాక్టింగ్‌ మీద ఆసక్తి ఎలా?
జ: స్కూల్లో బాగా అల్లరి చేసేదాన్ని. టీచర్లను ఇమిటేట్‌ చేసి ఫ్రెండ్స్‌ను నవ్వించేదాన్ని. డాన్సర్‌ కావాలనుకున్నాను. అయితే టెన్త్‌ క్లాస్‌ అయ్యాక అందరు ఫ్రెండ్స్‌ నా ఆటోగ్రాఫ్‌ బుక్‌లో ‘నువ్వు మంచి నటివి అవుతావు’ అని రాశారు. వారు రాసింది చూశాక నేను నటిని కావాలనుకునే కోరిక నాలో నా చుట్టూ ఉందనిపించింది. 

తొలి అవకాశం ఎలా వచ్చింది?
జ: నేను ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివాను. థర్డ్‌ ఇయర్‌లో ఉండగా కాలేజీ ఈవెంట్లో డాన్స్‌ చేస్తే ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ చూసి ‘అల’ అనే షార్ట్‌ఫిల్మ్‌ కోసం నన్ను సంప్రదించారు. అయితే ఈ అవకాశం వచ్చినట్టు నాన్నకు చెప్పే ధైర్యం లేక మెసేజ్‌ చేశాను– ఇలా చాన్స్‌ వచ్చింది... నో చెప్పేశాను అని. నాన్న కాసేపటికి ఫోన్‌ చేసి ‘మంచి డైరెక్టర్‌ అంటున్నావు కదా బేటా చేయి’ అన్నారు. చాలా ఆశ్చర్యపోయాను.

తొలి సినిమా అవకాశం?
జ: సృజన్‌ అట్టాడ తన ‘పుష్పక విమానం’ కోసం కాస్టింగ్‌ కాల్‌ ప్రకటన ఇస్తే నా ఫ్రెండ్‌ నా ఫొటోలు పంపింది. అలా ఆ సినిమాలోని రెండు ఫిమేల్‌ లీడ్‌ క్యారెక్టర్లలో ఒకటిగా చేశాను. అయితే సృజన్‌ తీయబోతున్న ‘కన్యాకుమారి’ లో నాకు హీరోయిన్‌ చాన్స్‌ వస్తుందనుకోలేదు. శ్రీకాకుళం అమ్మాయిగా మారి ఆడిషన్‌ ఇచ్చాక ఆయన సంతృప్తి చెంది ఈ అవకాశం ఇచ్చారు. 

కన్యాకుమారి పాత్రను ఎలా ఓన్‌ చేసుకున్నారు?
జ: నేను బయట మామూలుగా చాలా కామ్‌గా ఉంటాను. ఎవరైనా బాగా పరిచయమైతే ఇక నా వాగుడు తట్టుకోవడం కష్టం. ఆ లోపలి మనిషిని ఈ పాత్ర కోసం బయటకు తెచ్చాను. ఆడపిల్లలు తమ రెక్కలను పూర్తిగా సాచాలి. సీతాకోక చిలుకల్లా ఎగరాలి. అందుకే పోస్టర్‌లో సీతాకోక చిలుక ఉంటుంది. అలాంటి గట్టి పాత్ర చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అందులో చీరల పేర్లన్నీ చెప్పే క్లిప్‌ బాగా వైరల్‌ అవుతోంది. 

చిన్నపుడు మీరు దసరా ఎలా జరుపుకునేవారు?
జ: ఆదిలాబాద్‌లో మిక్స్‌డ్‌ కల్చర్‌ ఉంటుంది. సరిహద్దు ప్రాంతం కాబట్టి. దసరా వస్తే బాగా దాండియా ఆడేవాళ్లం. బతుకమ్మ కూడా ఆడేదాన్ని. కన్యాకుమారి షూట్‌ సమయంలో శ్రీకాకుళంలో ఉన్నప్పుడు దసరా వచ్చింది. అక్కడ దసరా సందడి వేరేగా అనిపించింది. వీధి వీధికి దుర్గ మంటపాలు, కోలాటం... చాలా సందడి చేశాం అందరం.

నేటి అమ్మాయిలకు ఏం చెబుతారు?
జ: ఏ సందర్భంలోనూ ఓటమి ఒప్పుకోవద్దు. కల ముగిసిపోయిందని అనుకోవద్దు. మరుగున పడ్డ లక్ష్యాలను తిరిగి సజీవం చేసుకుని పోరాడాలి. ఏదో ఒకరోజుకు గెలుస్తాం.
– సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి 

(చదవండి: Vijayadashami: స్త్రీ శక్తే విజయ దశమి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement