
అమ్మవారిని తొమ్మిది రోజులు పూజిస్తే, ఏడాదంతా శుభప్రదంగా... జయకరంగా ఉంటుందని శాస్త్రోక్తి.
బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు త్రిమూర్తులనీ, వారికి సృష్టిస్థితి లయకారులనీ పేరు. వీరు ముగ్గురూ తామే ఆ కార్యక్రమాలని నిరాటంకంగా చేసేస్తున్నారా అంటే వారికి విలువ, అస్తిత్వం ఆధిక్యమనేవి తమ తమ భార్యల వల్లనే కలుగుతున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ఎందుకంటే బ్రహ్మకి గుడి, పూజలు లేకపోయినా, ఆయన నోట దాగిన ఆ సరస్వతి కారణంగానే ఆయనను పూజిస్తారు.అదేతీరుగా శ్రీహరికి గుర్తింపూ విలువా లక్ష్మీదేవి వల్లనే. శ్రీవేంకటేశ్వరుడు కన్పించేది కూడా ఎనలేని విలువైన ఐశ్వర్యం వెనుకనే. ఆయన్ని భక్తజనం కొలిచేది కూడా ఐశ్వర్యం కోసమే. అంటే కేవలం ధనం కోసమే కాదు... అది పదవి, అధికారం, జీవితానికి సంబంధించి లేదా ధనానికి సంబంధించిన వాటికోసం అదేవిధంగా శక్తి లేని శివుడు ఏ ప్రయోజనాన్నీ చేకూర్చలేడట.
అందుకే అర్ధనారీశ్వర రూపంలో ఆయన ఉన్నాడు. కేవలం తమ తమ భార్యల ద్వారా గుర్తింపు ఈ త్రిమూర్తులకీ ఉండడమే కాదు– తమ తమ భర్తలకు కష్టం వచ్చినప్పుడు రక్షించి ఒడ్డెక్కించింది కూడా తమ తమ భార్యలే. అందుకే వీరికి త్రిశక్తులని పేరు. ఈ త్రి శక్తి దేవతల సమష్టి పండగే విజయ దశమి.
జమ్మిచెట్టును ఎందుకు పూజిస్తారు?
శ్లోకం: శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శనం
జమ్మి చెట్టును సంస్కృతంలో శమీవృక్షం అంటారు. త్రేతాయుగంలో శ్రీరాముడు శమీ పూజ చేసి లంకకు వెళ్లి విజయం సాధించాడని రామాయణ గాథ చె΄్తోంది. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లేటపుడు తమ ఆయుధాలను, ధనుర్బాణాలను శవాకారంలో మూటలా కట్టి ఆ మూటను శమీవృక్షం పై ఉంచి తాము అజ్ఞాత వాసం వీడే వరకు వాటిని జాగ్రత్తగా కాపాడాలని జమ్మి చెట్టుకు నమస్కరించి వెళ్ళారట.
తిరిగి అజ్ఞాత వాసం వీడిన అనంతరం జమ్మిచెట్టుకు పూజలు చేసి చెట్టు పై నుండి ఆయుధాలు తీసుకుని యుద్ధంలో కౌరవులను ఓడించారని మహా భారతకథ చెపుతోంది. నాటి నుండి నేటి వరకు విజయ దశమి రోజున శమీ వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని అందరి నమ్మకం. విజయ దశమి రోజున నక్షత్ర దర్శన సమయాన జమ్మిచెట్టు వద్ద అపరాజితా దేవిని పూజించి పైన పేర్కొన్న శ్లోకం చదివి చెట్టుకు ప్రదక్షిణ చేసిన తరువాత ఆ చెట్టు ఆకులు తెంపుకుని పెద్ద వారికి ఇచ్చి దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇది నేటికీ ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఆయుధ పూజలోని ఆంతర్యం?
అజ్ఞాతవాస ముగింపులో విజయ దశమి నాడు పాండవ మధ్యముడు విజయుడు జమ్మిచెట్టు మీదున్న ఆయుధాలను బయటికి తీసి పూజచేసి ఉత్తర గోగ్రహణ యుద్ధాన్ని చేసి దిగ్విజయుడైనాడు. కనుక ఆశ్వీయుజ శుద్ధ దశమి విజయదశమి అయింది. ఆరోజున దుర్గాదేవి, అర్జునుడు విజయం సాధించారు కనుక ప్రజలు తమకు జీవనాధారమైన పనిముట్లకు కృతజ్ఞతా పూర్వకంగా పూజలు చేసి తమ జీవితం విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకుంటారు.
ఇదే ఆయుధపూజ. విద్యార్థులు పాఠ్య పుస్తకాలను, ఇతరులు తమ వృత్తికి సంబంధించిన పుస్తకాలను పూజలో పెట్టడం ఆనవాయితీ. ఉత్తరాయణంలో అక్షరాభ్యాసం కాని పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేయడం, ఏదైనా కొత్త అంశాలను ఆరంభించడం ఈనాటి ఆచారాలలో ఒకటి.
పాలపిట్ట దర్శనం ఎందుకు?
పురాణ గాథల్లోకి వెళితే పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించుకుని తిరుగు ప్రయాణమై తమ రాజ్యానికి వెళుతున్న సమయంలో వారికి పాలపిట్ట దర్శనం కావడం జరిగిందని, నాటి నుండి వారి కష్టాలు తొలగిపోయి కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడంతోపాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందారట.
అందుకే పాండవులకు కలిగిన శుభాలు పాలపిట్టను చూస్తే అందరికి కలుగుతాయని ప్రజల నమ్మకం. అందుకే విజయ దశమి రోజు లపిట్ట దర్శనం కోసం గ్రామాల్లో సాయంత్రం వేళ జమ్మి పూజ అనంతరం పంట పొలాల వైపు ప్రజలు ఆడ, మగ తండోపతండాలుగా వెళతారు. పాలపిట్ట దర్శనం చేసుకుని ఆనందంగా ఇళ్లకు చేరుకుంటారు.
– డి.వి.ఆర్.
(చదవండి: వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..)