తప్పు నల్లిది... శిక్ష మంచానికి!

Difficulties in making friends with evildoers - Sakshi

శతక నీతి – సుమతి

మనుష్యుడు తనంతతానుగా తప్పు చేసేవాడు కాకపోయినా, దుర్మార్గులతో స్నేహం చేస్తే పడరాని కష్టాలను పడతాడని చెప్పడానికి...సుమతీ శతకకారుడు బద్దెనగారు బహు సులభమైన ఉపమానాలతో వివరిస్తున్నాడు... ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్‌ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ ...‘‘కొంచెపు నరు..’’ అంటే... బుద్ధి పరిణతి చెందనివాడు, అధముడు, దుర్బుద్ధి కలిగినవాడు, ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలతో ఉండేవాడు–వాడు బాగుపడడు, ఇతరులను బాగపడనివ్వడు. దుర్జనులతో స్నేహం చేస్తే అంచితముగ కీడువచ్చు..అంటే అంతాఇంతా అని చెప్పలేనంత అపకీర్తి, ప్రమాదం, కష్టం ముంచుకొచ్చేస్తాయి.... ఎలాగంటే...

ఇప్పటితరానికి ఎక్కువగా తెలిసే అవకాశం లేదు కానీ వెనకటికి నులక మంచాలు, నవారు మంచాలు, పేము మంచాలంటూ ఉండేవి. కట్టెమంచాలకు నవారు, నులక లేదా పేము అల్లి వాడుకొనేవారు. మంచానికున్న పట్టీలు, కోళ్ళు, నవారు, నులకల మధ్య సందుల్లో కుప్పలు కుప్పలుగా నల్లులు చేరేవి, గుడ్లు పెట్టేవి.  వీటికి ఒక లక్షణం ఉంటుంది. మంచంమీద పడుకున్న వ్యక్తి మేలుకుని ఉన్నంతవరకు అవి బయటికి రావు. నిద్రలోకి జారుకోగానే  అవి కుడుతుంటే సుఖంగా నిద్రపోవడం సాధ్యం కాదు.

వాటి బాధ వదిలించుకోవాలంటే పగలు ఎర్రటి ఎండలో మంచాన్ని నేలకేసి పదేదపదే కొడితే నల్లులు రాలిపడుతుంటాయి. కాళ్లతో వాటిని నలిపి చంపుతారు. అయినా ఇంకా సందుల్లో గుడ్లు ఉంటాయి. వాటిమీద కిరసనాయిలు పోసేవారు.... ఇప్పడు మనం ఆలోచించాల్సింది ఏమిటంటే.... నిద్రపోతున్న మనుషులను కుట్టినది నల్లులయితే మధ్యలో ఆ మంచం చేసిన తప్పేమిటి ? నిజానికి పడుకోవడానికి ఉపయోగపడడం తప్ప మరోపాపం ఎరుగదు. కానీ నల్లులకు ఆశ్రయం ఇచ్చినందుకు ... దెబ్బలు తిన్నది మాత్రం మంచమే. నల్లులు చేరిన తరువాత మంచానికి కష్టాలు ఎలా వచ్చాయో, దుర్మార్గులతో కలిసిన వారి జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి.  

మహాభారతంలో దుర్యోధనడు అంటాడు...‘‘జానామిధర్మంనచమే ప్రవృత్తిః జానామ్యధర్మం నచమే నివృత్తిః...’’ నాకు ధర్మం తెలియదనుకుంటున్నారా...నాకు అన్నీ తెలుసు కానీ దాన్ని పాటించాలనిపించడం లేదు. దాన్ని పట్టుకుంటే జీవితంలో వృద్ధిలోకి వస్తామని కూడా తెలుసు. విజయాలు వరిస్తాయనీ తెలుసు. నాకు అధర్మం ఏదో తెలియదనుకుంటున్నారా.. ఏది చెయ్యకూడదో నాకు తెలుసు. అది చేస్తే భగవంతుడి అనుగ్రహం ఉండదని కూడా తెలుసు.

అలా ఉంటే జీవితంలో ఇబ్బందులపాలవుతామనీ తెలుసు...అయినా అధర్మాన్ని విడిచిపెట్టాలనిపించదు. ’’ అంటూ ఇంకా దుర్యోధనుడు ఏమన్నాడో చూడండి...‘‘...కేనాపి దేవేన హృధిస్థితేన యథాప్రవృతోస్మి తథాకరోమి’’...అన్నాడు... అంటే.. ఇందులో నా తప్పేముంది? మీ అందరికీ ఉన్నట్టే నా హృదయంలో కూడా భగవంతుడున్నాడు. ఆయన నన్ను ధర్మాన్ని పట్టుకోనీయడం లేదు. అధర్మాన్ని పట్టుకోనిస్తున్నాడు. నేను పట్టుకుంటున్నా. ఇది నా తప్పెలావుతుంది? ఏదయినా తప్పు ఉంటే లోపల ఉన్న భగవంతుడిది అవుతుంది..’’

అటువంటి వితండవాదనలు చేసే మూర్ఖులను ఎంతమంది రుషులు, సాధుసత్పురుషులు వచ్చినా ఏం మార్చగలరు? జీవితంలో మనకు ఇటువంటి వారు కూడా ఎక్కువగా తారసపడుతుంటారు... వారితో స్నేహం వల్ల మన జీవితాలు కూడా దారి తప్పుతాయి... మన చుట్టూ ఉండేవారిపట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో బద్దెనగారు ఉద్బోధ చేస్తున్నారు. అలా ఉండకపోతే...నల్లులకే కాదు, మంచానికి ఏర్పడిన ప్రమాదం లాగా మనకే కాదు, మన పక్కన ఉన్న ఇతరులు కూడా కష్టాలపాలవుతారని హెచ్చరిస్తున్నారు.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top