విష్ణువును మేల్కొలిపే ఉత్తమ మాసం

Dhanurmasam 2020 Devotional Special Story In Telugu - Sakshi

ధనుర్మాసం

కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు.. మార్గశిర మాసంలో భగవచ్చింతనలో తన్మయమవుతాయి. నిర్మలమైన ఆకాశం మాదిరి మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి. తూర్పు తెలతెలవారుతుండగా..పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు.. వరిపిండితోనూ, సున్నపుపిండితోనూ వేసి.. వాటిమధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు.. తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు చేకూరుస్తారు. విష్ణువు సూర్యనారాయణుడై ధనూరాశి నుంచి మకర రాశికి ప్రయాణించే సమయం కాబట్టి సౌరమానం ప్రకారం ఇది ధనుర్మాసం. ఈ మాస వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. 

ఆరు ఋతువులలోనూ పుష్పసౌరభం నేనే, సామవేద గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులలో గాయత్రీ ఛందాన్ని, శోభ అధికంగా ఉండే వసంత కాలాన్ని నేను అని భగవద్గీతలోని విభూతి యోగంలో సాక్షాత్తు శ్రీ కృష్ణపరమాత్ముడే మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమిది. ఈ మాసంలో చేసే ఏ పూజైనా, హోమమైనా, ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయంగా తనే స్వీకరిస్తానని తెలియశాడు.  

ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసం. పవిత్రమైన ‘భగవద్గీత’ జన్మించిన మాసం. సూర్యుడు ధనూరాశిలో ఉండగా..విష్ణువును మేల్కొలిపే ధనుర్మాసవ్రతం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ‘మదుసూధనుడు’ అనే నామంతో శ్రీ మహావిష్ణువును పూజించాలి. ‘మార్గళివ్రతం’ అనే పేరుతో గోదాదేవి ఈ ధనుర్మాసమంతా విష్ణువ్రతాన్ని చేపట్టి రోజుకొక్క పాశురంతో స్వామిని కీర్తించింది కాబట్టి మనం గోదాదేవిని స్మరించుకోవడం శ్రేష్ఠం. 

ఈ మాసంలో లవణం దానం చేయటం వల్ల, ఈ మార్గశిర మాస విధులను పాటించడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళంతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శ్రీ మహావిష్ణువుతోపాటు సూర్యుణ్ణి కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో ‘ఓం దామోదరాయనమః, ఓ నమో నారాయణయనమః’ అని స్మరించుకుంటూ ఉండటం శుభఫలితాలనిస్తుందనీ శాస్త్ర వచనం.ప్రతిరోజు బ్రాహ్మీముహూర్తంలో తులసి సన్నిధిలోని మృత్తికతో, తులసి ఆకులను తీసికొని ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి.ఈ మాసంలో పసుపు, ఆవాలు, మెంతులు, మిరియాలు, చింతపండు, పెరుగు మొదలైనవి  క్షార గుణాన్ని హరించి ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి వీటితో తయారైన పొంగలి, పులిహోర.. దద్యోజనం వంటి వాటిని విష్ణువుకు నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. అదేవిధంగా మార్గశిర గురువారాల్లో శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం’ చేయడం, ద్వాదశి అభిషేకంవల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ మాసంలో ప్రాతః కాలం లో స్నానం చేసి విష్ణువుని ఆరాధించడం లేదా శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రం పఠనం చేయడం అనంతకోటి పుణ్యప్రదం. 

ఈ మాసంలో చేసే నదీస్నానాన్ని మార్గశీర్ష స్నానాలు అంటారు. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని వ్యవహరిస్తారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని శక్తికొలది పూజిస్తే సంతాన అనుకూలత కలుగుతుందని ప్రతీతి. మార్గశిర శుద్ధ సప్తమిని భానుసప్తమి, జయసప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్యారాధన చేసి పాయసం నివేదన చేస్తే అనేకమైన మంచి ఫలితాలు కలుగుతాయి. మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమి గా పిలుస్తారు, శివుని మరో రూపమే భైరవుడు. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాలభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానం, పితృతర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది. ఈ మాసంలో ఇంకా అనేక పర్వదినాలున్నాయి. వాటిని ఆచరించడం ప్రశస్తం. 
– కృష్ణ కార్తీక

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top