Strange Weddings In The World: వెడ్డింగ్‌ విడ్డూరాలు

Cover story of Sakshi Fanday on strange wedding customs happening around the world

మాఘం వచ్చేసింది.. మనువాడాలనుకునే జంటలు మంచి రోజుకోసం ఎదురుచూస్తున్నాయి! జీలకర్ర – బెల్లం.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. అప్పగింతలు.. హిందూ సంప్రదాయంలోని ఈ తంతు దాదాపు దేశమంతా ఒకేలా ఉంటుంది.. పెళ్లికి ముందు.. తర్వాత ఉండే ఆచారవ్యవహారాలు.. వాటిల్లోని కొన్ని వ్యత్యాసాలు తప్ప! మన దగ్గర పెళ్లి.. కుటుంబ సంబరంగా కన్నా సామాజిక ఆడంబరంగానే అలరారుతోంది.

ఖర్చు మోయలేని భారమైనా ప్రతి తంతునూ ఆనందంగా.. బంధుమిత్ర సమేతంగా ఆస్వాదిస్తున్నారు. ఈ దేశంలో హిందూ మెజారిటీ, ముస్లిమ్, క్రిస్టియన్‌ మైనారిటీల తర్వాత సిక్కు, జైన్, పార్సీ, బౌద్ధ మతాలూ ఉన్నాయి. సీరియళ్లు, సిరీస్‌లు, భారతీయ చిత్ర పరిశ్రమ.. ఇవన్నీ హిందూ పెళ్లికి ఎంత గ్లామర్‌ని పెంచాయో ముస్లిం, క్రిస్టియన్‌ పెళ్లిళ్లకూ తెర మీద అంతే స్పెస్‌నిచ్చాయి.

కాబట్టి వాటి ప్రస్తావన లేకుండా మిగిలిన మైనారిటీ మతాల్లోని పెళ్లితంతు, దాని ఆచార వ్యవహరాలతోపాటు పలు దేశాల్లోని పెళ్లి పద్ధతులు, సంప్రదాయాలు ఎలా ఉన్నాయి? అన్నిట్లో.. అన్ని చోట్లా పెళ్లి ఇంతే ఘనమైన వేడుకగా ఉందా? చూద్దాం.. 

ఆనంద్‌ కారజ్‌
సిక్కు మతంలో పెళ్లి తంతును ఆనంద్‌ కారజ్‌ అంటారు. అంటే ఆనందమయమైన జీవితం వైపు అడుగులు అని తెలుగు అర్థం ఇచ్చుకోవచ్చు. ఈ తంతును గురు అమర్‌ దాస్‌ మొదలుపెట్టారు. దీన్ని సిక్కులు చాలా పవిత్రంగా భావిస్తారు.


గురుద్వారాలో గురు రామ్‌దాస్‌ స్వరపరచిన నాలుగు లావాల (శ్లోకాలు లేదా భజనలు)ను చదువుతూ లేదా పాడుతూ ఆనంద్‌ కార్జ్‌ను నిర్వహిస్తారు. వరకట్నం నిషిద్ధం. అంతేకాదు పెళ్లికి ముందు జాతకాలు చూసుకోవడాలు.. ఆ జాతకాల ప్రకారం పెళ్లి ముహూర్తం నిర్ణయించడం కూడా నిషిద్ధమే. హిందూ పెళ్లిలో ఉన్నట్లే సిక్కు వివాహ వేడుకలోనూ పెళ్లికి ముందూ తర్వాతా రోజుకో తంతు ఉంటుంది. 

లగన్‌
పార్సీ పెళ్లిని లగన్‌ అంటారు. పార్సీలకూ వారం రోజుల పాటు ఈ లగన్‌ వేడుక ఉంటుంది.. రకరకాల తంతులతో. అయితే అన్నీ కూడా సింపుల్‌గా.. సరదాగా ఉంటాయి. సాధారణంగా.. పార్సీలు పూజించే ఫైర్‌ టెంపుల్‌ (అగ్ని దేవాలయం)లోనే లగన్‌ ఉంటుంది. గుడిలో ఏర్పాటు చేసిన పెళ్లి మంటపానికి ముందు వరుడు వస్తాడు. వధువు తల్లి ఒక ట్రేలో పచ్చి కోడిగుడ్లు, వక్క, బియ్యం, కొబ్బరికాయ, ఖర్జూరాలు, నీళ్లతో మంటపానికి వస్తుంది.

నీటిని తప్ప మిగిలిన అన్నిటితో వరుడి తల చుట్టూ ఏడుసార్లు దిష్టి తీసినట్టుగా తిప్పి వరుడి తల మీంచి విసిరేస్తుంది. ఆ తర్వాత నీళ్లను వరుడి కుడి ఎడమల వైపు చల్లేస్తుంది.అనంతరం పెళ్లి కూతురు వస్తుంది. పెళ్లి ఎంత సింపుల్‌గా జరుగుతుందో రిసెప్షన్‌ అంత గ్రాండ్‌గా ఉంటుంది. అసలు పార్సీల లగన్‌ ఈ రిసెప్షన్‌తోనే ఫేమస్‌. చక్కటి సంగీతం.. సూపర్‌ డాన్స్‌లు.. నోరూరించే వంటకాలతో అద్భుతంగా ఉంటుంది. ఒకరకంగా దాన్ని పార్సీ కల్చరల్‌ పరేడ్‌ అనొచ్చు.  

మంగళ్‌ ఫేరా
జైన్స్‌లో కూడా హిందువులకున్నట్లే లగ్న లేఖన్‌ (పెళ్లి పత్రిక రాసుకోవడం) దగ్గర్నుంచి సగాయి (నిశ్చితార్థం), మంగళ్‌ ఫేరా (పెళ్లి), స్వగృహ ఆగమన (అత్తారింటికి వెళ్లడం) వరకు ముఖ్యమైన ఘట్టాలన్నీ ఉంటాయి. అయితే సగాయిలో ఉంగరాలు మార్చుకోవడం వంటివి ఉండవు. ఈ వేడుక పెళ్లికొడుకు ఇంట్లో జరుగుతుంది. పెళ్లికూతురి సోదరుడు వెళ్లి పెళ్లికొడుకు నుదుట తిలకం దిద్ది, కట్నకానుకలు అందజేస్తాడు. పెళ్లికి ముందు వధూవరులిద్దరి ఇళ్లల్లో మండప్‌ పూజ జరుగుతుంది. దీని తర్వాతే హారతితో పెళ్లి కొడుకు బారాత్‌ను పెళ్లి మంటపానికి ఆహ్వానిస్తారు. అక్కడ ముత్తయిదువల మంగళ గీతాల మధ్య పెళ్లికొడుకు, పెళ్లికూతురి సోదరుడు ఇద్దరూ ఒకరికొకరు తిలకం దిద్దుతారు.


అనంతరం పెళ్లికొడుకు తాను తెచ్చిన కానుకలను ఇస్తాడు. దీని తర్వాతే పెళ్లికొడుకు పెళ్లి వేదిక మీదకు వెళ్తాడు. అప్పుడు కన్యాదానం తంతు మొదలవుతుంది. పెళ్లికూతురి తండ్రి పెళ్లికొడుకు చేతిలో రూపాయి పావలాతోపాటు పెళ్లికూతురి చేతిని ఉంచుతూ వరుడికి పిల్లను అప్పగిస్తాడు. దాని తర్వాత వధూవరులిద్దరూ కలసి అగ్ని చుట్టూ తిరుగుతారు. పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకుని అమ్మాయిని అత్తారింటికి తీసుకెళ్తారు. నిజానికి జైన్స్‌ సింప్లిసిటీకి మారుపేరు అని చెప్తారు. ఇదివరకైతే వాళ్ల పెళ్లిళ్లు చాలా సింపుల్‌గా జరిగేవట. కాని కొత్త తరం హంగు, ఆర్భాటాలనే ఇష్టపడుతున్నట్టుంది ఇక్కడ కూడా!

అసోంలో.. 
ఒక గమ్మత్తయిన పెళ్లి ఆచారం ఉంది. వధువు తరఫు బంధుమిత్రులు వరుడికి రకరకాల పొడుపు కథలు చెప్పి సమాధానమివ్వమంటారు.


జవాబు చెప్పలేకపోతే డబ్బు డిమాండ్‌ చేస్తారు. ఆ సవాళ్లన్నింటినీ ఛేదించుకుంటూ వధువును చేరుకోవాలి వరుడు. తన ప్రేమను చాటుకోవాలి.

చెసియన్‌
పెళ్లిని బౌద్ధం ఒక కుటుంబ వ్యవహారంగానే చూస్తుంది. మతానికి సంబంధించిన విషయంగానో.. సామాజిక అంశంగానో చూడదు. స్త్రీ, పురుషుల ఎంపికలాగే పరిగణిస్తుంది. అందుకే పెళ్లి వేడుక కూడా చాలా నిరాడంబరంగా ఉంటుంది. పెళ్లికి ముందు జరిగే నిశ్చితార్థాన్ని చెసియన్‌ అంటారు. నిశ్చితార్థానికి వరుడి తల్లిదండ్రులు వధువు కుటుంబాన్ని తమ ఇంటికి ఆహ్వానిస్తారు.


బౌద్ధ సన్యాసుల ప్రార్థనల మధ్య నిశ్చితార్థం జరుగుతుంది. ఆ రోజే పెళ్లి తేదీని నిర్ణయిస్తారు. పెళ్లి వధువు ఇంటి దగ్గరైనా లేదా బౌద్ధాలయంలోనైనా జరుగుతుంది. ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన బౌద్ధ సన్యాసులు, సన్యాసినులు  వధూవరులిద్దరినీ ఆశీర్వదిస్తారు. వివాహం ఒకవేళ వధువు ఇంట్లో జరిగితే పెళ్లి తర్వాత వధూవరులిద్దరూ బౌద్ధాలయానికి వెళ్లి అక్కడా ఆశీర్వాదాలు తీసుకుంటారు.

ఆసియా దేశాలకు వెళితే..
ములుకు లేని బాణాలు.. అదృష్టజాతకురాలు
చైనాలో.. కాబోయే వరుడు ములుకు తీసేసిన బాణాలతో గురి చూసి వధువు మీదకు వేయాలి. తర్వాత వాటన్నిటినీ పోగు చేసి.. పెళ్లి రోజున విరిచేయాలి. ఇలా చేస్తేనే వారి మధ్య ప్రేమానురాగాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని, ఆ బంధం బలపడుతుందని చైనీయుల విశ్వాసం.


ఇంకో విషయం ఏంటంటే.. పెళ్లికూతురి తరఫువారు.. ఊళ్లోని ఒక అదృష్టజాతకురాలిని అద్దెకు తీసుకొచ్చి పెళ్లికూతురి వెంట ఆమెకు తోడుగా అత్తారింటికి పంపిస్తారు. అలా పంపిస్తే ఆమె అదృష్టం పెళ్లికూతురికీ వస్తుందని చైనీయుల నమ్మకమట! సింహాసనంలా అలంకరించిన కుర్చీలో పెళ్లికూతురు ఊరేగింపుగా అత్తారింటికి వెళ్తుంది. అలా వెళ్లేప్పుడు దారంతటా పెళ్లికూతురి తరఫు బంధువులు వధువుకి గొడుగు పడుతూ అక్షింతలు జల్లుతూ ఉంటారు. 

తల మీద కొంగుతో.. 
జపాన్‌లో.. పెళ్లి సమయంలో షింటో మత సంప్రదాయం ప్రకారం నిర్వహించే వేడుకలో వధువుపై నుంచి కింది దాకా తెల్లటి దుస్తులను ధరించాలి. తల మీద నుంచి మెడ వరకు ‘సునోకకుషి’ అనే వస్త్రాన్నీ వేసుకోవాలి. తెలుపు వర్ణం ఆమె కన్యాత్వాన్ని సూచిస్తే.. తల మీది వస్త్రం ఆమెకు తన అత్తగారి పట్ల ఉన్న అసూయను దాస్తుందట. పెళ్లిళ్లు సాధారణంగా షింటో ఆలయాల్లో జరుగుతాయి.


ఆలయంలో కాకుండా ఇళ్లల్లో జరిగినా, వధూవరులు తప్పనిసరిగా ఆలయానికి వెళ్లి అక్కడి ‘కామి’లకు (దేవీదేవతలు) తమ పెళ్లిని తెలిపి ఆశీస్సులు తీసుకుంటారు. తర్వాత వధూవరులిద్దరూ బియ్యం నుంచి తయారు చేసే ‘సకీ’ అనే మద్యాన్ని మూడేసి గుటకల చొప్పున తాగుతారు. తర్వాత బంధుమిత్రులతో కలసి విందు చేసుకుంటారు.

ఎండు చేపతో.. 
దక్షిణ కొరియాలో పెళ్లి వేడుకలో ఒక వింతయిన ఆచారం ఉంది. పెళ్లి కొడుకు కుటుంబం, అతని స్నేహితులు పెళ్లికొడుకును బోర్లా పడుకోబెట్టి అతని అరికాళ్లపై కర్రతో కానీ.. ఎండు చేపతో కానీ కొడుతూ గమ్మత్తయిన ప్రశ్నలు వేస్తుంటారట.


వరుడు ఆ దెబ్బలను తింటూ వాళ్లడిగే ప్రశ్నలకు సమాధానమిస్తుంటాడు. పెళ్లి కొడుకు జ్ఞాపకశక్తి చురుగ్గా ఉండటానికి ఇలా చేస్తారట. మ్యారేజ్‌ డే.. భార్య బర్త్‌ డే.. వంటివన్నీ గుర్తుంచుకోవడానికేనేమో! 

పావురాలు ప్రేమ ప్రతీకలు
ఫిలప్పీన్స్‌లో పెళ్లయిన వెంటనే వధూ వరులిద్దరూ తెల్ల పావురాల జంటను గాల్లోకి ఎగరేస్తారట. ఆ దేశంలో తెల్ల పావురాలను సఖ్యత, ప్రేమానుబంధాలకు ప్రతీకలుగా భావిస్తారు.


అప్పుడే పెళ్లయిన జంట అలా ఆ పావురాలను గాల్లోకి వదిలేస్తే ఆ జంట కూడా పదికాలాలపాటు ప్రేమానుబంధంలో బందీగా ఉంటుందని ఆ దేశస్తుల నమ్మకమట. అందుకే అలా పావురాలను ఎగరేస్తారు.

జెండా ఎగరేసి..
టర్కీలోని కొన్ని ప్రాంతాల్లో పెళ్లికి సంబంధించి గమ్మత్తయిన ఆనవాయితీ ఉంది. పెళ్లి ముహూర్తాన.. వరుడి స్నేహితులు వరుడి ఇంటి ఆవరణ లేదా ఇంటి మీద టర్కీ జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆ జెండాకు ఆ ప్రాంతంలో దొరికే పళ్లు, కూరగాయలతోపాటు అద్దాలనూ వేలాడదీస్తారట. పెళ్లి వేడుక మొదలైందని అలా జెండా ఎగరేసి మరీ ఊళ్లో్లవాళ్లకు చాటుతారన్నమాట! 

యూరప్‌లో వెడింగ్‌ కస్టమ్స్‌...
పెళ్లి కూతురిని దాచేసి..
రూమేనియాలో.. వధువు తరఫు బంధువులు.. పెళ్లి ముహూర్తానికి కొన్ని నిమిషాల ముందు వధువును దాచేస్తారు. వరుడొచ్చి తనకు కాబోయే భార్య ఎక్కడుందో చెప్పమని రిక్వెస్ట్‌ చేస్తాడు. ‘చెబుతాం కానీ ఖర్చు అవుతుంది’ అంటారు.


గిఫ్ట్స్‌ కావాలని డిమాండ్‌ చేస్తారు. అలా వరుడిని ముహూర్తం వేళ వరకూ ఆటపట్టించి.. చివరకు ఒక మంచి పాట పాడాలని పట్టబట్టి వరుడి చేత ఓ లవ్‌ సాంగ్‌ పాడించి..పెళ్లికూతురిని అప్పజెప్తారు.  

ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో మ్యారేజ్‌ సెలబ్రేషన్‌ ఎలా ఉంటుందంటే..
ఉమ్మేస్తేనే అదృష్టం

ఆఫ్రికాలోని కెన్యాలో ఉన్న ఈ పెళ్లి ఆచారం వింటే విస్తుపోతారు. పెళ్లి రోజున వధువు తండ్రి ఆమె వేసుకున్న వెడింగ్‌ డ్రెస్‌ మీద ఉమ్మేస్తాడు. కోపంతో కాదు.. ప్రేమతో! బిడ్డ వైవాహిక జీవితం బాగుండాలి.. ఆమె అదృష్టవంతురాలు కావాలనే ఆశతో! అవును అది వాళ్ల ఆచారం. అలా చేయని తండ్రి బిడ్డ క్షేమాన్ని కోరనట్టే అట. 
ఒంటె నాట్యం

దక్షాణ ఆఫ్రికా దేశం నైజర్‌లో పెళ్లయిపోయాక ఎడారిలో రిసెప్షన్‌ పార్టీ పెడతారు. ఆ పార్టీలో అతిథుల మధ్య.. డ్రమ్‌ బీట్‌కి అనుగుణంగా ఒంటె డాన్స్‌ చేస్తుంది. రిసెప్షన్‌కి ఒంటె డాన్స్‌ వినోదమే కాదు అక్కడి పెళ్లి ఆనవాయితీ కూడా!

ఆస్ట్రేలియా దేశాల్లోని పెళ్లి ఆచారాలు చూస్తే..
రంగు రాళ్లు రిటర్న్‌ గిఫ్ట్స్‌ కావు
ఆస్ట్రేలియాలో పెళ్లికి వచ్చిన అతిథులు అందరికీ రంగు రాళ్లు ఇస్తారు. ఓ టేబుల్‌ మీద ఒక బౌల్‌ పెడతారు. పెళ్లయి.. విందు ఆరగించి ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయే ముందు ఈ అతిథులు అంతా తమ దగ్గరున్న రంగురాళ్లను ఆ బౌల్లో వేసి వెళ్లిపోతారు. కొత్త పెళ్లి జంట ఆ బౌల్‌ని తీసుకుని తమ ఇంటికి వెళ్లి దాన్ని డ్రాయింగ్‌ రూమ్‌లోనో.. బెడ్‌ రూమ్‌లోనో డెకరేటివ్‌ పీస్‌గా పెట్టుకుంటుంది. తమ పెళ్లికి హాజరైన అతిథులకు గుర్తుగా! ఇది అక్కడి ఆచారం!

పన్ను పీకి చేతిలో పెట్టాలి
ఫిజీ ద్వీపంలో.. ఏ కుర్రాడైనా ఏ పిల్ల మీదైనా మనసు పారేసుకుని.. ఆమె తండ్రి దగ్గరకు వెళ్లి ‘మీ అమ్మాయిని ఇష్టపడుతు న్నాను.. పెళ్లి చేసుకుంటాను’ అని అడిగితే.. ఆ పిల్ల తండ్రి వెంటనే ‘కడలి ఈద గలవా ఓ వరుడా.. అడుగుకు డైవ్‌ చేయగలవా? డైవ్‌ చేసి తిమింగలం నోటిలోని పన్ను పీక గలవా?’ అని సవాలు విసురుతాడు.


ఆ అమ్మాయి మీద తన ప్రేమను నిరూపించుకోవాలంటే అబ్బాయి ఆ చాలెంజ్‌ను స్వీకరించాల్సిందే.. సముద్రంలోకి దూకి తిమింగలం పన్ను పీకి కాబోయే మామగారి చేతిలో పెట్టాల్సిందే! జంకినా.. వెనకడుగు వేసినా.. అమ్మాయి మీద ప్రేమలేనట్టే! అది అక్కడి తీరు మరి!

దక్షిణ అమెరికాలో..
బద్దలు కొట్టాల్సిందే!
గ్వాటెమాలలో కొత్తపెళ్లి జంటను ‘వందేళ్లు కలసి జీవించండి’ అని దీవిస్తే సరిపోదు.. గంటను బద్దలు కొట్టాల్సిందే! బియ్యం, పిండి వంటివన్నీ వేసిన గంట లాంటి పింగాణీ పాత్రను పెళ్లి కొడుకు తల్లి.. నేలకేసి కొడుతుంది.


దీనివల్ల కొత్త పెళ్లి జంట మీది చెడు దృష్టి పోయి.. ఆ వధూవరులు సుఖశాంతులు, అషై్టశ్వర్యాలతో తులతూగుతారని నమ్మకమట. అందుకే వరుడి తల్లి.. కొడుకు, కోడలిని నోటిమాటతో ఆశీర్వదిస్తే సరిపోదు, పింగాణి గంటను పగలకొట్టాలి. 

ఉత్తర అమెరికాలో..
ఎనిమిదిలా..
మెక్సికోలో.. పెళ్లి ప్రమాణాలు పూర్తయిన వెంటనే రోజా పూలదండను ఎనిమిది అంకెలా మలచి దాంతో వధూవరులిద్దరినీ బంధిస్తారు. అలా చేయడాన్ని ఐక్యతకు చిహ్నంగా భావిస్తారట.


మిగిలిన కార్యక్రమాలు అయిపోయేంత వరకు ఆ ఇద్దరూ అలా దండఖానాలో బందీలుగా ఉండాల్సిందే. పెళ్లి తంతు మొత్తం పూర్తయ్యాక ఆ జంటను విముక్తం చేసి ఆ దండను వధువు చేతికిస్తారట వాళ్ల కమిట్‌మెంట్‌కి గుర్తుగా. 

ఇవన్నీ చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇలా చెప్పుకుంటూ పోతే ఆచారవ్యవహారాలుగా కొనసాగుతున్న పెళ్లి చిత్రాలెన్నో ఈ ప్రపంచంలో!!

 

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top