పిల్లులు, కుక్కలతో ఆనందంగా...

Corona Effect US People Adopting Pet Animal - Sakshi

కరోనా కరోనా... భూగోళం మీద ఉన్నవారంతా భాషాభేదాలు, కులమతాలకు అతీతంగా ఈ పదాన్నే జపిస్తున్నారు. కరోనా కోరల నుంచి ఎప్పటికి బయటపడతామో ఎవ్వరికీ తెలియదు. బంధువులు, స్నేహితులు, ఆప్తులు.. అందరూ అయినవారే, కావలసినవారే... కాని అవసరానికి ఎవ్వరినీ సహాయం అడగలేం, స్వచ్ఛందంగా వచ్చి చేయలేరు. క్షేమసమాచారాలు తెలుసుకోవటానికి వీడియో కాల్స్‌కి మాత్రమే పరిమితం అవుతున్నారు. రక్తసంబంధం కూడా ఈ విషకాటుకి బలైపోతోంది. ప్రస్తుత ఆధునిక సమాజంలో అందరివీ చిన్న కుటుంబాలే... అమ్మనాన్న, ఒకరు లేక ఇద్దరు పిల్లలు. ఎవరి పనిలో వారు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో మునిగిపోతున్నారు. ఇంట్లో కూడా మాస్క్‌ పెట్టుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ... మానసికంగా కుంగిపోతున్నారు. ఎంతసేపు ఏవి చూసినా, మనసులో మాటలు పంచుకోవటానికి మనిషి తోడు లేకపోవటాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు మూగజీవుల్ని పెంచుకోవటం ఎక్కువైంది అంటున్నారు అమెరికన్లు. అమెరికాలో కుక్కల్ని, పిల్లుల్ని దత్తతు చేసుకుంటున్నారు. వాటితో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలక్షేపం చేస్తున్నారు. 2020తో పోలిస్తే ఈ సంవత్సరం పెంపుడు జంతువులను పెంచుకుంటున్నవారి సంఖ్య 40 శాతం పెరిగింది. ఐసొలేషన్‌లో ఉంటున్నవారికి ఇవి ఎంతో మానసిక ఆనందాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నాయి.

‘‘మార్చి మొదటి వారంలో న్యూయార్క్‌ నగరం చుట్టుపక్కల నుంచి 700 కు పైగా అప్లికేషన్స్‌ వచ్చాయి’’ అంటున్నారు గ్రాంగెర్‌. బైడవీ అనే లాభాపేక్ష లేని సంస్థకు గ్రాంగెర్‌ అధ్యక్షులు. ఆమె రకరకాల ప్రాణులకు మంచి తర్ఫీదు ఇస్తున్నారు. ఇప్పుడు గ్రాంగెర్‌ పూర్తిగా పనిలో బిజీ అయిపోయారు. కుక్కలకు పిల్లులకు శిక్షణ ఇస్తున్నారు. ‘‘ఎప్పుడైనా మనసుకి బాధ అనిపిస్తే, వెంటనే ఒకసారి బయటకు వచ్చి, వీధులలో తిరిగే కుక్కపిల్లల చిలిపి చేష్టలు, పిల్లుల విన్యాసాలు చూడండి. అవి ఎలా ఆడుకుంటాయో గమనించండి. ఎలా నిద్రిస్తుంటాయో పరిశీలించండి. మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది. మీ బాధను ఇట్టే మరిచిపోతారు’’ అంటున్నారు గ్రాంగెర్‌. కొన్ని కుటుంబాలలో కోవిడ్‌తో బాధపడుతూ, మూగప్రాణులను చూసేవారు లేక, వాటి అవసరాలు తీర్చలేక బాధపడుతూ,  తలుపులు తీసి వారి పెంపుడు జంతువులను బయటకు పంపేస్తున్నవారు కూడా ఉన్నారు. అయితే జంతువులను దత్తతు తీసుకుంటున్న వారితో పోలిస్తే, పెంపుడు ప్రాణులను వదిలిపెట్టేస్తున్న వారి సంఖ్య చాలా తక్కువ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top