మదర్‌ అదర్‌సైడ్‌ మాస్టర్‌ షెఫ్‌ | Chef Kanak Kathuria: opens up about her culinary journey | Sakshi
Sakshi News home page

మదర్‌ అదర్‌సైడ్‌ మాస్టర్‌ షెఫ్‌: కనక కతూరియా

May 13 2026 4:15 PM | Updated on May 13 2026 4:21 PM

Chef Kanak Kathuria: opens up about her culinary journey

ఒకప్పుడు సాధారణ గృహిణిగా, పిల్లల తల్లిగా ఇంటిపట్టునే ఉన్న కనక కతూరియా ఇప్పుడు మాస్టర్‌ షెఫ్‌ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేంతగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ‘కనక్స్‌ కిచెన్‌’ పేరుతో సోషల్‌ మీడియాలో మిలియన్ల మంది అభిమానం సొంతం చేసుకున్నారు. బార్బిక్యూ నేషన్స్‌లో మెక్సికన్‌ రుచులను పరిచయం చేయడానికి ముంబై నుంచి ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన కనకను ‘సాక్షి ఫ్యామిలీ’ పలకరించింది. ఈ సందర్భంగా ఆమె తన ‘వంట’రి పోరాటాన్ని గురించి పంచుకున్న ఎన్నో విశేషాలు ఆమె మాటల్లోనే...

‘‘పాతికేళ్లుగా వంటల్లో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాను. ఇండియన్, ఇటలీ, చైనీస్, జపనీస్, మెక్సికన్, ఫ్రెంచ్, అమెరికన్‌.. అన్నిదేశాల రుచులూ మా ఇంటి కిచెన్‌లో నేటికీ ఘుమఘుమలాడుతూనే ఉన్నాయి. నేను పెద్ద పెద్ద రెస్టారెంట్‌లలో పనిచేసే షెఫ్‌ని కాదు. సాధారణ గృహిణిని. కానీ, ఈ రోజు ఇండియన్‌ షెఫ్‌గా పేరొందాను.

బిజీగా మార్చుకున్నాను...
నేను ఎం.కామ్‌. చదివినా, పెళ్లయ్యాక ఇంటికే పరిమితం అయ్యాను. ఇద్దరు కూతుళ్ల పెంపకంలో రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియనంత బిజీ అయిపోయింది జీవితం. వంటలపై నాకున్న అభిరుచిని మెరుగుపరుచుకోవడానికి రోజూ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. పిల్లలు ఏడుస్తుంటే వారిని ఎత్తుకొని తిప్పుతూ, నిద్రపుచ్చుతూ, రకరకాల వెస్ట్రన్‌ వంటకాలు తయారు చేసేదాన్ని. ఆ సమయంలోనే వాటిని వీడియో తీసేదాన్ని. యూ ట్యూబ్‌ ల్యాంచ్‌ అయిన తొలినాళ్ల నుంచీ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాను.

హోస్ట్‌గా.. గెస్ట్‌గా...
ఒక్క రోజులో ఏదీ సాధ్యం కాదు. ఇంటి పనులు, పిల్లల చదువులు, నా వంటకాలు బ్లాగ్‌లు, వీడియోలు... ఇవన్నీ కొనసాగిస్తూ వచ్చాను. మా ఇద్దరు అమ్మాయిలు కాలేజీ స్థాయి చదువుల్లో రాణిస్తున్నారు. నా వంటలకు మొదట వారే టేస్టర్స్‌. ‘మా అమ్మ చేతి వంట ది బెస్ట్‌’ అని మార్కులు ఇస్తుంటారు. వాళ్ల పెంపకంలో జాగ్రత్తలు తీసుకుంటూనే దేశంలో జరిగే అన్నిరకాల ఫుడ్‌ ఫీస్ట్‌లకు జడ్జిగా హాజరయ్యాను. ఫుడ్‌ ఈవెంట్స్‌ను హోస్ట్‌ చేశాను. 

ప్రముఖ రెస్టారెంట్స్‌తో కలిసి వర్క్‌ చేశాను. వెస్ట్రన్‌ ఫుడ్స్‌ అందించే విషయంలో నన్ను ఆహ్వానిస్తుంటారు. నా వంటకాల రుచులనూ ఈ సందర్భంగా పరిచయం చేస్తుంటాను. టీవీ రియాలిటీ షో మాస్టర్‌ షెఫ్‌ ఇండియా ఫస్ట్‌సీజన్‌లో పాల్గొన్నాను. హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషలలో కనక్స్‌ కిచెన్‌ పేరుతో ఫుడ్‌ ఛానెల్స్‌ తీసుకు వచ్చాను. 

ఏ విభాగంలోనైనా సవాళ్లు ఎదుర్కోవడానికి ఒక పరిమితి ఉంటుంది. కానీ, వంటల తయారీలో ప్రతీ రోజూ, ప్రతి డిష్‌ ఛాలెంజింగ్‌గానే ఉంటుంది. రుచిలో అందరినీ మెప్పించడం సాధ్యమయ్యే విషయం కాదు. ఏ చిన్న పొరపాటు జరిగినా అంతా వృథా అయిపోతుంది. మనసు పెట్టి చేసే వంట మన అనుకున్నవారందరినీ చేరువ చేస్తుంది. అదే నా సక్సెస్‌ మంత్ర’ అని వివరించారు ఈ ఇండియన్‌ షెఫ్‌.

ఫిట్‌గా హెల్తీగా...
టేస్టీ, హెల్తీ, వెజ్, నాన్‌వెజ్‌... ఇలా ఇన్నిరకాల వంటకాలు చేస్తూ, రుచి చూస్తూ, తింటూ ఉంటారు కదా! ‘బరువు పెరుగుతారు’ అని చాలా మంది అనేవారు. కానీ, ఈ విషయంలోనూ హెల్తీగా ఫిట్‌గా ఉండటానికి కృషి చేస్తుంటాను. యాక్టివ్‌గా ఉండటానికి జిమ్, వాకింగ్‌ నా లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకున్నాను.  
– నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్‌ ప్రతినిధి

 

Advertisement
 
Advertisement
Advertisement