విద్వాన్‌ సర్వత్ర పూజ్యతే! | Sakshi
Sakshi News home page

విద్వాన్‌ సర్వత్ర పూజ్యతే!

Published Mon, Nov 22 2021 10:49 AM

Chaganti Koteswara Rao Discourses In Sakshi

ధనం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్యంలో ఉండే భౌతికమైన ధనం. రెండవది మానసిక ధనం. మూడవది పుణ్యరూపమయిన ధనం. ఈ మూడూ  సమానమైన ప్రాతినిధ్యాన్ని, సమానమైన ప్రతిపత్తిని పొంది ఉంటాయి. అయితే శాస్త్రాన్ని అన్వయం చేసుకోకపోతే మాత్రం బాహ్యంలో ధనమున్నప్పటికీ అది ప్రమాదహేతువై కూర్చుంటుంది. అందుకే శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో – సరస్వతీదేవి, లక్ష్మీదేవి.. ఇద్దరి అనుగ్రహం అవసరమేనని అంటారు. సరస్వతీకటాక్షం లేని లక్ష్మీదేవికటాక్షం బాహ్యంలో భయ హేతువు. ఐశ్వర్యం ఉంది.  చదువు లేదు. ఎక్కడ సంతకం పెట్టాలో తెలియదు, ఎవడేం చేస్తాడో తెలియదు. అంతరంలో–ఎక్కడ దానం చేయాలో తెలియదు, అపాత్రదానం చేసి తనకున్న వైభవాన్ని పాడుచేసుకుంటాడు.

అదే సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీకటాక్షంలో అభ్యున్నతి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరస్వతీ కటాక్షమున్నవారికి లక్ష్మీకటాక్షం లేకపోవడం అన్నమాట ఉండదు. విద్వాన్‌ సర్వత్ర పూజ్యతే. ఎంత చదువున్నా తాదాత్మ్యత చెందడు. ప్రసాదబుద్ధితో బతుకుతుంటాడు. ‘ఇవన్నీ నావి కావమ్మా, నీ పాదాలు పట్టుకోవడం చేత వచ్చిన కీర్తి’ అనే భావనతో ఉంటాడు. అది అభ్యున్నతికి హేతువవుతుంది. ఇది బాహ్యంలో శాంతికి, భోగాన్ని అనుభవించడానికి, పుణ్యకర్మ చేయడానికి అత్యంత ప్రధానం.

రెండవది మానసిక ధనం. అంటే శాంతి. శాస్త్ర ప్రకారం మనం ఏది చేసినా...‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అంటాం. తాను శాంతంగా ఉండాలి.  పదిమందిని శాంతంగా ఉంచగలగాలి.  ప్రశాంతంగా ఉండడంకన్నా ఐశ్వర్యం లోకంలో మరొకటి ఉండదు. బాహ్యంలో ఎంత ఐశ్వర్యవంతుడయినా తనకింకా ఏదో లేదనే బాధతో బతికేవాడు దరిద్రుడు. తనకి ఏది లేకపోయినా ‘నాకేం తక్కువయిందని’..అన్నభావనతో బతికేవాడు మహదైశ్వర్యవంతుడు. కొంతమంది పూరింట్లో ఉన్నా ఎంతో తృప్తిగా జీవిస్తుంటారు. పెద్దపెద్ద రాజభవంతుల్లో ఉన్నా ఇంకా ఏదో లేదని ఎప్పుడూ  వెంపర్లాడుతుండేవాడు నిత్య దరిద్రుడు. అందుకే మానసికమైన ధనం భౌతికమైన ధనం కన్నా చాలా గొప్పది. ఐశ్వర్యమయినా, ఆనందమయినా మానసికమైన ధనాన్ని ఆవహించి ఉంటాయి.

మూడవది పుణ్యధనం. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నావు. మంచిదే. ఇక్కడ ధనవంతుడిగా ఉన్నావు. మంచిదే. కానీ జన్మ పరంపర ఇక్కడితో ఆగిపోతుందని నమ్మకం ఏమిటి? జ్ఞానం కలుగుతుందనీ, దానివల్ల పునరావృతి పొందవనీ, మళ్ళీ జన్మ స్వీకరించవనీ నమ్మకమేం లేదుగా! ఇప్పుడు నీవు అనుభవిస్తున్న ఐశ్వర్యం కానీ, ప్రశాంతత కానీ గత జన్మల పుణ్యఫలమేగా! దానిని నీవు అనుభవిస్తున్న కొద్దీ ఖర్చయిపోతుంటుందిగా! మరి వచ్చే జన్మకి పుణ్యం ఎక్కడినుంచి వస్తుంది ? ఇక్కడి ధనాన్ని, ఇక్కడి పుణ్యాన్ని, ఇక్కడి తెలివిని, ఇక్కడి శక్తిని పుణ్యం కింద మార్చుకోవాలిగా! అదెలా మారుతుంది? 

పాండిత్యం ఉంటే నీకున్న పాండిత్యాన్ని పదిమందికీ పంచి పెట్టడానికి ఉపయోగిస్తే అది అందరికీ చేరుతుంది. తరగని సంపదలా నీ వద్దే ఉంటుంది కూడా! అందుకే విద్వాన్‌ సర్వత్ర పూజ్యతే అన్నారు పెద్దలు. 

చదవండి: The Exorcism Of The Emily Rose: ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!!

Advertisement
 
Advertisement