రాక్షస అవతారానికి... క్షణం చాలు

Chaganti Koteswara Rao Devotional Article - Sakshi

శతక నీతి

‘‘తనకోపమె తన శత్రువు/తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ/తన సంతోషమె స్వర్గము/తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!’’ ..దీనిలో బద్దెనగారు మనకు పనికివచ్చే కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు. జీవితంలో నీవు పట్టుకోవలసినవి ఏవి, వదిలిపెట్టవలసినవి ఏవి... ఈ పట్టూవిడుపులు చేతకాకపోతే జీవితం ప్రశాంతంగా సాగదని చెబుతున్నారు. ఎవరయినా మనమీద శత్రు భావన పెట్టుకుంటే మనల్ని ఎప్పుడూ పాడుచేయాలని చూస్తుంటారు.

అది మనకు అర్థమయిన నాడు మనం వారికి దూరంగా జరుగుతాం. వారిపట్ల శత్రుభావన లేకుండా స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తాం. కానీ లోపల ఒక శత్రువు ఉన్నాడు. అవకాశం కోసం చూస్తుంటాడు. ఆ శత్రువే కోపం. నాకు శత్రువే లేడు... అన్నవాడికి కూడా లోపల ఈ శత్రువు మాత్రం ఉంటాడు.  కోపం ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చేటప్పడు అనుమతి తీసుకొని రాదు. వచ్చిన తరువాత ఎంతటి ప్రమాదాన్నయినా అది తీసుకురాగలదు. అలా కోపమనే శత్రువు మన పతనానికి హేతువవుతుంది.

శ్రీరామాయణంలో స్వామి హనుమ కోపం గురించి ఇలా అంటాడు...‘‘కత్థః పాపం న కుర్యాత్‌ కః కత్థో హన్యాత్‌ గురూరపి’ కత్థ పరుషయా వాచా నరః సాథూనధిక్షిపేత్‌’’ కోపానికి వశపడిపోతే ఈ పాపం చేస్తాడు, ఇది చెయ్యడు అని చెప్పడం సాధ్యం కాదు. గురూరపి.. గురువు అంటే.. పెద్దవారు, గౌరవనీయులని కూడా చూడడు. ముందూవెనకా ఆలోచించకుండా చంపేయగలడు. అది ఒక ఉన్మాదం. అది మనిషిని స్థిరంగా నిలబడనీయదు. తప్పుచేసి కారాగారానికి వెడుతుంటారు. వారందరూ చెడ్డవారు అని చెప్పలేం. వాళ్లు తమ కోపాన్ని అదుపు చేసుకోలేక చెయ్యకూడని పని చేస్తారు. ఆ తరువాత సంవత్సరాల తరబడి కుటుంబ జీవనానికి దూరమవుతారు.

విడుదలయి వచ్చిన తరువాత ఎంత పశ్చాత్తాప పడినా వారు తమ నెత్తిన ఎప్పుడూ ఆ అపకీర్తిని మోయక తప్పదు. కోపం రాగానే ముందు మనిషికి తన మాట మీద అదుపు తప్పిపోతుంది. ఇది మాట్లాడవచ్చు, ఇది కూడదన్న విచక్షణ ఉండదు. పెద్దలని, మహాత్ములని తెలిసి కూడా వారిని అధిక్షేపిస్తాడు, అవమానిస్తాడు, చులకన చేసి మాట్లాడతాడు. అప్పటివరకు మనిషిగా బతుకుతున్నవాడిని, ఎంతోమంచివాడుగా పేరు తెచ్చుకున్నవాడిని కూడా... ఒక్క క్షణకాలంలో రాక్షసుడిగా మార్చేయగలదు ఆ కోపం.

పిల్లలకు ఆ వయసులో మంచీ చెడూ ఆలోచించే విచక్షణ తక్కువగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు అదుపు చేసుకోగల పరిణతి ఉండదు. పెద్దలు ప్రయత్నపూర్వకంగా పిల్లలకు ఆ నియంత్రణను అలవాటు చేయాలి. అభిప్రాయ భేదాలను తొలగించుకునే వివేకం వారికి నూరిపోయాలి. ఇంట్లో పెద్దలు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే, పిల్లల లేత మనసు మీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళుకూడా ఇటువంటి పోకడలనే అనుసరిస్తుంటారు. అవి సరిచేసుకోక పోతే స్నేహితులకు దూరమవుతుంటారు. అటువంటి వారిని చూసి తోటి పిల్లలు కూడా భయపడతారు, దగ్గరకు రానీయరు. పెద్దలు, గురువులు కూడా అటువంటి పిల్లలను దూరంగా ఉంచుతారు. అది మరిన్ని అవాంఛనీయమైన పరిణామాలకు దారితీస్తుంది. అలాంటప్పుడు వారిని ఓపికగా కూర్చోబెట్టుకొని చెబితే వింటారు, తప్పు సరిదిద్దుకుంటారు.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top