Cancer Prevention: ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్‌ బారిన పడినట్టే..!

Cancer Prevention: Healthy Habits Can Help Prevent Cancer - Sakshi

ఏయూ క్యాంపస్‌(విశాఖపట్నం): ప్రస్తుత కాలంలో క్యాన్సర్‌ వ్యాధులు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిలో అత్యంత క్లిష్టమైన జీర్ణాశయాంతర క్యాన్సర్‌ రోగులపై ఏయూ హ్యూమన్‌ జెనిటిక్స్‌ విభాగ పరిశోధక విద్యార్థి కోడెల్లి శ్రీనివాసరావు అధ్యయనం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 400 మందికి సంబంధించిన రక్త నమూనాలు సేకరించారు. వీరిలో 200 మంది క్యాన్సర్‌ సోకిన వారు కాగా.. మరో 200 మంది ఆరోగ్యవంతులు ఉన్నారు. వీరి ఆహారపు, జీవన అలవాట్లు, జన్యువుల ప్రభావాలను ఆయన అధ్యయనం చేశారు.
చదవండి: చిరుతిళ్లను ఆరోగ్యంగా తినొచ్చు

ఈ పరిశోధనకు ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ లభించింది. విభాగ సీనియర్‌ ఆచార్యులు జి.సుధాకర్‌ పర్యవేక్షణలో ‘స్టడీస్‌ ఆన్‌ జెనిటిక్‌ పాలిమారిజం ఆఫ్‌ పీ 53, ఎంఎంపీ2, ఎంఎంపీ9 ఇన్‌ గ్యాస్ట్రో ఇంటస్టెయిన్‌ పేషెంట్స్‌ ఆఫ్‌ నార్త్‌కోస్టల్‌ ఆంధ్రప్రదేశ్‌’అంశంపై పరిశోధన చేసి.. వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి నుంచి డాక్టరేట్‌ ఉత్తర్వులు స్వీకరించారు.

జన్యువుల విశ్లేషణ 
క్యాన్సర్‌ కారకాలుగా భావించే పీ 53, ఎంఎంపీ 2, ఎంఎంపీ 9 జన్యువులను శ్రీనివాసరావు అధ్యయనం చేశారు. క్యాన్సర్‌ బారిన పడిన 200 రోగుల రక్తనమూనాలను పరిశీలించగా వీరిలో ఎంఎంపీ 9 అత్యధికంగా ఉండటం గుర్తించారు. తర్వాత స్థానంలో ఎంఎంపీ 2లు జీర్ణాశయాంతర క్యాన్సర్‌ రోగుల్లో కనిపించాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ క్యాన్సర్‌ బారిన పడిన వారిలో ఎంఎంపీ 9 జన్యువు అధికంగా మ్యూటేషన్‌ కావడం గమనించారు.

పురుషుల్లోనే అధికం  
తన అధ్యయనంలో భాగంగా 200 మంది క్యాన్సర్‌ రోగుల ఫలితాలను విశ్లేషించి పరిశీలిస్తే జీర్ణాశయాంతర క్యాన్సర్‌ వచ్చే ముప్పు పురుషుల్లో 73 శాతం ఉండగా స్త్రీలలో 27 శాతంగా ఉంది. నిరక్షరాస్యుల్లో 58 శాతం ఉండగా.. ఉన్నత విద్యావంతుల్లో 4.5 శాతం ఉండటం గమనించారు. ఆహారపు అలవాట్లను పరిశీలిస్తే మాంసాహారుల్లో 77 శాతం మంది, శాకాహారుల్లో 23 శాతం మంది దీని బారిన పడుతున్నట్లు గుర్తించారు. పల్లె ప్రజలకంటే పట్టణాల్లో నివసించే వారిలో అధికంగా ఈ క్యాన్సర్‌ బారిన పడుతున్నట్లు తెలిపారు. పొగతాగేవారు, పొగాకు నమిలే అలవాటు కలిగిన వారిలో ఈ క్యాన్సన్‌ ముప్పు ఎక్కువగా ఉంది. మద్యం సేవించే అలవాటు కలిగిన వారిలో 58 శాతం మంది ఈ వ్యాధి బారిన పడినట్లు గుర్తించారు.

ఆహారపు, జీవన అలవాట్లు కారణం  
తన పరిశోధనలో భాగంగా 20 నుంచి 70 ఏళ్ల వయసు కలిగిన క్యాన్సర్‌ రోగులపై అధ్యయనం చేశారు. వారి రక్త నమూనాలను సేకరించి టోటల్‌ ప్రొటీన్, సీరం క్రియేటినిన్, బ్లడ్‌ యూరియా, బ్లడ్‌ సుగర్, కార్సినో–ఎంబ్రియోనిక్‌ యాంటిజెన్, బిలిరుబిన్, కాలేయ సంబంధ ఎంజైములు, అల్బూమిన్, గ్లోబులిన్, సోడియం, పొటాషియంల జీవరసాయన స్థాయిలను అంచనా వేశారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యవంతుల నమూనాలను సేకరించి వారి డీఎన్‌ఏలను వేరుచేసి.. పీసీఆర్, ఆర్‌ఎఫ్‌ఎల్‌పీ విధానాల్లో అధ్యయం జరిపారు. యాంత్రిక సమాజంలో మారిపోతున్న ఆహారపు అలవాట్లు క్యాన్సర్‌కు కారణంగా మారే అవకాశాలు ఉన్నాయి. తగినంత శారీరక వ్యాయామం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. క్యాన్సర్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదిస్తే.. ఈ మహమ్మారిని జయించడం సులవవుతుంది.

జీవనశైలిలో మార్పు రావాలి  
మంచి ఆరోగ్య అలవాట్లను కలిగి ఉండటం ఎంతో అవసరం. మన జీవనంలో దురాలవాట్లు, మత్తు పదార్థాలను దరిచేరనివ్వకుండా చూడాలి. జన్యువుల ప్రభావం మనిషిపై ఉంటుంది. దానికంటే ఆహారం, మద్యపానం, ధూమపానం, పొగాకు వంటి పదార్థాల ప్రభావం అధికంగా ఉంటోంది. మంచి జీవన అలవాట్లను కలిగి ఉండటం వలన క్యాన్సర్‌ను నిరోధించడం సాధ్యపడుతుంది.
– డాక్టర్‌ కె.శ్రీనివాసరావు  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top