పర్వీన్‌ కూడా ప్రేమ కోసం పరితపించింది | Bollywood Actress Parveen Babi Tragic Love Story | Sakshi
Sakshi News home page

పర్వీన్‌ కూడా ప్రేమ కోసం పరితపించింది

Oct 11 2020 11:25 AM | Updated on Oct 11 2020 11:29 AM

Bollywood Actress Parveen Babi Tragic Love Story - Sakshi

పర్వీన్‌ బాబీ, కబీర్‌ బేడీతో..

బాలీవుడ్‌కు గ్లామర్‌ అద్దిన నటి.. హీరోయిన్‌కు అదా నేర్పిన వ్యక్తి.. పర్వీన్‌ బాబీ.. తెర మీద ఆమె విసిరిన చూపులను.. ఒలికించిన నవ్వులను ఏరుకోవడానికి థియేటర్‌లకు పరిగెత్తిన దీవానాలు ఎందరో! సినిమా వాళ్లలోనూ ఆమె ఆరాధకులు తక్కువేం లేరు! పర్వీన్‌ కూడా ప్రేమ కోసం పరితపించింది.. ఒంటరిగానే జీవితాన్ని సాగించింది.. విషాదంగా ముగిసింది.. ఆ ట్రాజెడీ లవ్‌ అండ్‌ లైఫ్‌ స్టోరీ...

కేర్‌ నాట్‌ అటిట్యూడ్‌.. ఫ్లూయెంట్‌ ఇంగ్లిష్‌.. కంప్లీట్‌ క్లారిటీతో పర్వీన్‌ బాబీ అనే ఉత్తుంగ తరంగం మోడలింగ్‌ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమా ఫ్లాప్‌. అయినా నిర్మాతలు క్యూ కట్టారు ఆమె ఇంటి ముందు. కాల్షీట్ల కోసం పోటీ పడ్డారు దర్శకులు. పర్వీన్‌ బాబీ గ్లామర్‌ అలాంటిది. ఆమె రాకతో బాలీవుడ్‌ స్క్రీన్‌ కొత్త మెరుపులు సంతరించుకుంది. ఇదీ పర్వీన్‌ బాబీ సిగ్నేచర్‌. బాంబే చిత్రసీమ అంతా ఆమె కోసం వెంపర్లాడుతుంటే పర్వీన్‌ మాత్రం డేనీ డెంజోంగ్పా కోసం పరితపించింది.

1970ల సంగతి.. 
డానీ, పర్వీన్‌ ఇద్దరూ సమవయస్కులే. విలన్‌గా డానీ, హీరోయిన్‌గా పర్వీన్‌ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఒకరితో ఒకరికి పరిచయం అయింది. అప్పటికీ పర్వీన్‌ బాబీ గురించి డానీ విని ఉన్నాడు. తొలి చూపులోనే మతిపోగొట్టుకున్నాడు. పర్వీన్‌కూ డానీ ప్రత్యేకమయ్యాడు. అలా ఆ ఇద్దరి మనసులు కలిశాయి. తన ఫస్ట్‌ లవ్‌గా పర్వీన్‌ను మనసులో భద్రంగా దాచుకున్నాడు. కబర్లు, లాంగ్‌ డ్రైవ్‌లు వాళ్ల సాంగత్యాన్ని మరింత పెంచింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి తెచ్చింది. 

లివ్‌ ఇన్‌..
కలిసి ఉండడం ప్రారంభించారు. పెళ్లికాకుండా ఆ జంట ఒకే ఇంట్లో ఉండడం అప్పట్లో బాలీవుడ్‌లో సంచలనం. దాంతో బుగ్గలు నొక్కుకుంది. గాసిప్స్‌ పంచింది. ఖాతరు చేయలేదు ఆ ఇద్దరూ. పర్వీన్‌ తల్లికి తెలిసినా బిడ్డ సంతోషాన్ని చూసి మనసుకు సర్దిచెప్పుకుంది. వరుస హిట్లతో పర్వీన్‌ బిజీ అయిపోయింది. అవకాశాల పరంపర డానీనీ తీరిక లేకుండా చేసింది. ఒకే రంగంలో ఉన్నా ఇద్దరి ప్రపంచాలూ వేరవడం మొదలైంది. ఒకే ఇంట్లో ఉంటున్నా కలిసి గడిపే కాలం కరువవడం స్టార్ట్‌ అయింది. మౌనంగానే ఎవరికి వారవసాగారు. ఆ విషయం ఇద్దరికీ అర్థమైంది. బంధం తెగిపోయినా స్నేహం చెడిపోవద్దనే అవగాహనకు వచ్చారు. ఆ ఇంటిని ఖాళీ చేసి తమ ప్రేమప్రయాణాన్ని ఆపేశారు. షేక్‌ హ్యాండ్‌తో స్నేహాన్ని కొనసాగించారు. 

సాండోకాన్‌
పర్వీన్‌ బాబీతో బ్రేకప్‌ అయ్యాక డేనీ.. నటి కిమ్‌ యశ్‌పాల్‌ ప్రేమలో పడ్డాడు. కాని పర్వీన్‌.. డానీని మరిచిపోలేకపోయింది. ఆప్తమిత్రుడుగా అతడి అండను కోరుకుంటూనే ఉంది. ఈలోపు కబీర్‌ బేడీ దృష్టిలో పడింది పర్వీన్‌. ఇటలీలో... ‘సాండోకాన్‌’ అనే ఇటాలియన్‌ సీరియల్‌ సెట్స్‌లో. అందులో పర్వీన్‌ కూడా ఓ భూమిక పోషించింది. ఆ సెట్స్‌లో కబీర్‌ మనసులో అలజడి రేపిన పర్వీన్‌ త్వరలోనే అతని ప్రేమిక అయింది. ఈ జంట ప్రేమ ఇటాలియన్, స్పానిష్‌ మీడియానూ కనువిందు చేసింది. అక్కడి దిన పత్రికల పేజ్‌త్రీ కాలమ్స్, మ్యాగజీన్స్‌కు పర్వీన్, కబీర్‌ల డేటింగ్‌ కబుర్లు, ఫోటోలు బాగానే కాలక్షేపం అయ్యాయి. సాండోకాన్‌తో యూరప్‌లో కబీర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. చాన్స్‌ల గ్రాఫ్‌ కూడా హెచ్చింది. వెనక్కి బాలీవుడ్‌కు మళ్లే అవకాశం కనిపించలేదు. కాని  బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా ఉన్న పర్వీన్‌ బాబీకి ముంబై తిరిగిరాక తప్పలేదు. అప్పటికే ఆమె కోసం 40 సినిమాలు వేచి చూస్తున్నాయి. ముంబైలో పర్వీన్‌ ఫోన్‌లో పలకగానే నిర్మాతలంతా నిశ్చింతగా నిట్టూర్చారట. 

కెరీరా? కబీరా? 
అన్న పరిస్థితి వచ్చింది పర్వీన్‌ బాబీకి. కెరీర్‌ ఎంత ముఖ్యమో కబీర్‌తో లైఫ్‌ అంతకన్నా ముఖ్యం. కబీర్‌ను ఇండియాకు వచ్చేయమనడం అంత భావ్యంగా అనిపించలేదు ఆమెకు. అలాగని తన కెరీర్‌నూ వదులుకోవడానికి మనసొప్పలేదు. అలా అతనక్కడ.. ఇలా తానిక్కడ.. కుదిరేట్లు లేదు. కబీర్‌ అదివరకే వివాహితుడు. ప్రతిమా బేడీ నుంచి విడిపోవాలనుకుంటున్న సమయంలో తాను అతనికి దగ్గరైంది. కాని తనకూ ఓ లైఫ్‌ ఉంది.. గుర్తింపు ఉంది. దాన్ని వదులుకొని కబీర్‌కు నీడలా ప్రపంచమంతా తిరగాలని లేదు ఆమెకు. దాంతో కబీర్‌ చేయి విడిపించుకొని రెండేళ్ల ఆ ప్రణయానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేంది పర్వీన్‌ బాబీ. 

‘కబీర్‌ను వదులుకున్నందుకు నేనెప్పుడూ రిగ్రెట్స్‌ ఫీలవలేదు. అతని జర్నీకి నేను హార్డిల్‌ అయ్యి, ఆయన సక్సెస్‌ను శాసించాలనుకోలేదు. అలాగని నా ఐడెంటిటీనీ కోల్పోవడానికి సిద్ధపడలేదు. మహిళగా నాకూ ఈగో ఉంది. ప్రైడ్‌ ఉంది. దాన్ని కాపాడుకోవాలనుకున్నా. ఇంకా చెప్పాలంటే ఐ కుడ్‌ నెవర్‌ బికమ్‌ ఎ మ్యాన్స్‌ డాగ్‌. నేనెప్పుడూ నార్మల్‌ సెక్యూర్‌ రిలేషన్‌నే కోరుకున్నా. అతనితో అది సాధ్యంకాదని అర్థమైంది’ అని చెప్పింది పర్వీన్‌ బాబీ ఒక ఇంటర్వ్యూలో. 
ప్రేమంటే జీవితమంత పర్వా పర్వీన్‌కు. కబీర్‌ తర్వాతా ఆ అన్వేషణ కొనసాగింది. ఆ కథ వచ్చేవారం.
-ఎస్సార్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement