మట్టి రుణం ఇలాగ తీరింది

Big victory for farmer: India revokes patent for PepsiCo Lays potatoes - Sakshi

రైతుకు తెలిసిందేమిటి? దుక్కి దున్నడం... విత్తు నాటడం. కలుపు తీయడం... పంటను రాశిపోయడం. ఒళ్లు వంచి శ్రమించడం... మట్టిలో బంగారం పుట్టించడం. మరి... అలాంటి రైతుకు చట్టాల కష్టాలేమిటి? తన పొలంలో ఏం నాటాలో ఏం నాటకూడదో ఒకరు చెప్పేదేమిటి? రైతు మీద ఈ ఆంక్షలేమిటి? తనకు తెలియకుండానే తన మీద కేసు పెడితే ఏం చేయాలి? విదేశీ శక్తుల చేతిలో మనరైతు బలవుతుంటే చూస్తూ ఊరుకోవడమేనా? తనకంటూ హక్కులున్నాయని రైతుకు చెప్పేదెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క పోరాటంతో సమాధానం వచ్చింది. ఆ సమాధానమే జాతీయ రైతు హక్కుల కార్యకర్త కవిత కురుగంటి.

సంయుక్త కిసాన్‌ మోర్చా పేరుతో సింఘు బోర్డర్‌లో జరిగిన రైతుల ఆందోళనను దేశం యావత్తూ గుర్తించింది. రైతులకు జరుగుతున్న నష్టాన్ని తెలుసుకుంది. మౌనంగానే అయినా మనస్ఫూర్తిగా సంఘీభావం ప్రకటించింది. కార్పొరేట్‌ శక్తుల కోరల్లో రైతులు చిక్కుకోకూడదని చిత్తశుద్ధితో కోరుతుంది. అయితే అంతకంటే ముందు ఓ దశాబ్ద కాలంపాటు అమాయకమైన రైతులు కొందరు విదేశీ కార్పొరేట్‌ శక్తితో ఎదురొడ్డి పోరాడలేక, పోరాటం ఆపలేక సతమతమయ్యారు. వారు ఎదుర్కొన్న వాస్తవ పరిస్థితిని న్యాయస్థానానికి తెలియచేయడం కోసం స్వయంగా సదరు విదేశీ కంపెనీ మీద కేసు వేశారు రైతు హక్కుల కార్యకర్త కవిత కురుగంటి. విదేశీ కంపెనీ మనదేశ రైతులను కబళించడానికి పన్నిన కుట్రను న్యాయస్థానానికి విశదపరిచారామె. రైతుల పక్షాన ఉన్న న్యాయం ఏమిటో తెలియచేశారు.

ఫలితంగా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రైతులకు రక్షణగా నిలిచింది. లేస్‌ చిప్స్‌ తయారు చేయడానికి అవసరమైన ఎఫ్‌ ఎల్‌ – 2027 బంగాళాదుంప పండించిన రైతుల మీద పెప్సీ కంపెనీ కేసు పెట్టింది. తమ కంపెనీతో అంగీకారం కుదుర్చుకోకుండా ఆ పంట పండించిన కారణంగా సదరు రైతులు తమకు కోట్లాదిరూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసింది. కవిత న్యాయపోరాటం ఫలితంగా న్యాయస్థానం సదరు కంపెనీకి ఇచ్చిన పీవీపీ సర్టిఫికేట్‌ను కూడా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా. ఒకవైపు ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది ఉన్న బడా కార్పొరేట్‌ సంస్థ... మరోవైపు అసంఘటితంగా ఉన్న రైతులు. ఇలాంటి స్థితిలో రైతుల పక్షాన పోరాటం చేయడానికి వారి పట్ల సానుభూతి ఉంటే సరిపోదు. అంతకు మించిన ధైర్యం ఉండాలి. అంతకంటే ఎక్కువగా రైతు కష్టాలు, ప్రభుత్వ విధానాలు, కార్పొరేట్‌ కంపెనీల వ్యవహార ధోరణి పట్ల స్పష్టమైన అవగాహన కూడా ఉండాలి. గుంటూరులో పుట్టిన తాను పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మాత్రమే వ్యవసాయరంగం గురించి తెలుసుకున్నానని చెప్పారామె.

మహిళారైతులే స్ఫూర్తి
‘‘నాకు వ్యవసాయం గురించి మెదక్‌జిల్లాలోని పస్తాపూర్‌ మహిళలు నేర్పించారు. పీజీలో ఫీల్డ్‌ స్టడీ కోసం డీడీఎస్‌ (దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ) తో కలిసి పని చేశాను. నిజానికి నేను కమ్యూనికేషన్స్‌ స్టూడెంట్‌ని. డాక్యుమెంటరీ కోసం ఆ ఊరికి వెళ్లి వ్యవసాయం చేసే మహిళలను దగ్గరగా చూశాను. పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ను కూడా అక్కడ పరిచయం చేశాం. ఒక కొత్త విధానాన్ని చక్కగా అర్థం చేసుకుని సమష్టిగా పని చేసుకుంటారు వాళ్లు. వెనుకబడిన కుటుంబాలకు చెందిన మహిళలు తమ సమస్యలను నేర్పుగా చక్కబెట్టుకోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించేది. మన ఇళ్లలో మగవాళ్లకు ఒకరకం న్యాయం, మహిళలకు మరోరకమైన న్యాయం ఉండడం నాకు మింగుడుపడేది కాదు.

బాల్యం నుంచి నన్ను వెంటాడిన అనేక ప్రశ్నలకు సమాధానం అక్కడ దొరికింది. ఇక ఎం.ఏ పూర్తి కాగానే పస్తాపూర్‌కి వెళ్లిపోయాను. ఆరేళ్లపాటు అక్కడ పని చేసి ఢిల్లీకి వెళ్లి అనేక సంస్థలతో పని చేశాను. ప్రస్తుతం బెంగళూరు నుంచి పని చేస్తున్నాను. నేను రైతు కుటుంబంలో పుట్టలేదు, కార్పొరేట్‌ కంపెనీలకు పని చేయలేదు, ప్రభుత్వ ఉద్యోగమూ చేయలేదు... కానీ ఈ మూడు రంగాల మీద చక్కటి అవగాహన ఉంది. భావసారూప్యం కలిగిన వాళ్లం ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి పని చేస్తున్నాం. అవసరమైన చోట వీథి పోరాటం చేస్తాం, అలాగే ప్రభుత్వానికి విధాన రూపకల్పన కోసం నివేదికలు ఇస్తాం, అవి దుమ్ముకొట్టుకుని పోతున్నాయనిపిస్తే వాటి అమలు కోసం ఉద్యమమూ చేస్తాం’’ అన్నారామె.

కేసు ఈ నాటిది కాదు!
పెప్సీ కంపెనీ రైతుల మీద 2008లో తొలిసారి కేసు పెట్టింది. నిందితులు విధిలేక తలకెత్తుకున్న న్యాయపోరాటం ఇది. ఇందుకోసం తమ శక్తికి మించి లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. అయినప్పటికీ అప్పట్లో తగినంతగా ప్రజల్లోకి వెళ్లలేదు. వార్తా కథనాలు కూడా పెద్దగా రాలేదు. ‘‘మేము రైతులకు మద్దతుగా పోరాటం మొదలు పెట్టిన వెంటనే చేసిన ప్రధానమైన పని ఈ అంశానికి విస్తృతంగా ప్రచారం కల్పించడమే. మనదేశంలో మంత్రులకు, అనేక సంస్థలకు ఉత్తరాల ద్వారా పోరాటాన్ని ఉధృతం చేశాం. సోషల్‌ మీడియా ద్వారా యూఎస్, యూరప్, యూకే, ఆఫ్రికా దేశాలకు కూడా తెలిసి వచ్చింది.

సదరు కంపెనీ మన రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందనే భావన అందరిలోనూ కలిగింది. మన ప్రభుత్వాల మీద, ఆ కంపెనీ మీద ఇన్ని రకాలుగా ఒత్తిడి తీసుకురాగలిగాం. వాస్తవాల అన్వేషణ కోసం పంజాబ్, గుజరాత్‌లో మారుమూల ప్రదేశాలకు కూడా వెళ్లాం. ఇంత గ్రౌండ్‌ వర్క్‌ చేసిన తర్వాత 2019, జూన్‌లో స్వయంగా కేసు వేశాను. రైతులకు అనుకూలంగా వచ్చిన తీర్పు వెనుక ఇంత ఎక్సర్‌సైజ్‌ జరిగింది’’ అని చెప్పారు కవిత కురుగంటి. గడచిన గురువారం నాడు హైదరాబాద్, ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌లో జరిగిన ‘రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల పబ్లిక్‌ హియరింగ్‌’ కోసం వచ్చిన సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు.

ఈ తీర్పు గొప్ప విజయమే... కానీ!
‘ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ప్లాంట్‌ వెరైటీ అండ్‌ ఫార్మర్స్‌ రైట్స్‌ యాక్ట్‌ – 2001’ ప్రకారం రైతులు తమకు ఇష్టం ఉన్న పంటను పండించుకోవచ్చు. ఈ మేరకు మనదేశం రైతుల ప్రయోజనాలకు విఘాతం కలగని విధంగానే చట్టానికి రూపకల్పన చేసింది. అయితే రైతులకు మాత్రం ఆ విషయం తెలియదు. ఆ కారణంగానే పెప్సీ కంపెనీ రైతుల మీద కేసు వేయగలిగింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ద్వారా రైతులకు తమకు హక్కులున్నాయని తెలిసింది. ఈ విషయంలో పెప్సీ కంపెనీ కేసు వేయడానికి ముందు సదరు రైతులకు తెలియకుండా వారు పండిస్తున్న బంగాళాదుంపల శాంపుల్స్‌ సేకరించి వాటిని ల్యాబ్‌లో పరీక్షించింది.

అది కూడా నేరమే. ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడితే పోరాడే శక్తులున్నాయని కార్పొరేట్‌ కంపెనీలకు ఈ తీర్పు ద్వారా తెలిసి వచ్చింది. ఇది నిజంగా ఒక హెచ్చరిక వంటిది. ప్రభుత్వాలు కూడా ఇకపై మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటాయని ఆశించవచ్చు. అయితే 30 నెలల పాటు జరిగిన ప్రొసీడింగ్స్‌నీ, తీర్పు పూర్తి పాఠాన్ని గమనిస్తే కొంత ఊగిసలాట కూడా ఉన్నట్లనిపిస్తోంది. ఆ కంపెనీ అగ్రిమెంట్‌ పూర్తి కావస్తోంది. ఈ దఫా అగ్రిమెంట్‌లో మరింత పక్కాగా కంపెనీకి ప్రయోజనకరంగా నిర్ణయం తీసుకునే ప్రమాదం లేకపోలేదనిపిస్తోంది. అందుకే అలాంటిది జరిగితే మళ్లీ పోరాడడానికి సిద్ధమవుతున్నాం.
– కవిత కురుగంటి, కన్వీనర్, అలయెన్స్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అండ్‌ హోలిస్టిక్‌ అగ్రికల్చర్‌

– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top