ఇంటి పంట
సేంద్రియ మిద్దెతోటలు, ఇంటిపంటల సాగులో బోన్ మీల్ వాడటం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
మిద్దెతోటల్లో పువ్వులు, పండ్లు, కూరగాయల మొక్కలకి బోన్ మీల్ పొడిని వేయడానికి కొన్ని ప్రత్యేక సమయాలు, పద్ధతులు ఉన్నాయి.
ఇది మొక్కలకు కావలసిన ఫాస్పరస్, కాల్షియంను నెమ్మదిగా అందిస్తుంది.
కొత్తగా మొక్కలు నాటేటప్పుడు లేదా విత్తనాలు వేసేటప్పుడు కుండీలోని మట్టి మిశ్రమంలో బోన్ మీల్ కలపడం చాలా మంచిది. దీని వల్ల వేర్లు బలంగా అభివృద్ధి చెందుతాయి.
మొక్కలు పూతకు వచ్చే ముందు లేదా మొగ్గలు తొడిగే దశలో బోన్ మీల్ వేయడం వల్ల పూత రాలకుండా ఉంటుంది. కాయ సైజు పెరుగుతుంది. ముఖ్యంగా టమోటాలు, మిర్చి వంటి కూరగాయలకి ఇది బాగా ఉపయోగపడుతుంది.
బీట్‌రూట్, క్యారెట్, బంగాళాదుంప వంటి నేల లోపల పెరిగే దుంప జాతి మొక్కలకు ఇవి ఊరే సమయంలో వేస్తే నాణ్యమైన దిగుబడి వస్తుంది.
వర్షాకాలం ప్రారంభంలో మొక్కలు వేగంగా పెరిగే సమయంలో ఒకసారి వేయవచ్చు.
బోన్ మీల్ చాలా నెమ్మదిగా కరిగే ఎరువు. కాబట్టి దీన్ని ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి వేస్తే సరిపోతుంది.
కుండీలోని పై మట్టిని కొద్దిగా తవ్వి, మొక్క మొదలుకు కొంచెం దూరంగా వేసి తిరిగి మట్టితో కప్పేయాలి.
బోన్ మీల్ వేసిన తర్వాత వెంటనే తగినంత నీరు పోయాలి. - కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


